Home > Editorial > అక్కడో మాట….ఇక్కోడో మాట…

అక్కడో మాట….ఇక్కోడో మాట…

జనంలోకి జనసేన
ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న విజయ్ మాల్యా

mamatha-benerjee-apduniaగోర్ఖాలాండ్ రాష్ట్ర సాధన ఉద్యమం మళ్ళా భగ్గుమన్నది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు బెంగాలీ భాష చదవాలంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడంతో డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో ప్రారంభమైన నిరసన తీవ్ర స్థాయికి చేరింది. అయితే బెంగాలీ తప్పనిసరి కాదని ఆ తరువాత ముఖ్యమంత్రి సవరించుకున్నప్పటికీ, అప్పటికే ఉద్యమం రాజుకున్నది. బెంగాలీని నిర్బంధం చేసే త్రిభాషా సూత్రంపై రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వక వివరణ ఇవ్వాలని గోర్ఖా ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇదే వేడిలో సొంత రాష్ట్రం సాధించుకోవాలనే పట్టుదల వారిలో కనిపిస్తున్నది. గోర్ఖాలపై బెంగాలీ భాషా సంస్కృతులను రుద్దుతున్నారనేది వారి ఆరోపణ. గోర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చూసుకోవడమే బెంగాలీ సామ్రాజ్యవాదం నుంచి విముక్తికి మార్గమని వారు అంటున్నారు. ఇప్పుడు డార్జిలింగ్ ప్రాంతంలో నిరవధిక బంద్ సాగడాన్ని బట్టి ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఉద్యమం తీవ్రంగా మారడంతో డార్జిలింగ్ ప్రాంతానికి సైన్యాన్ని తరలించారు. కానీ అనూహ్యరీతిలో డార్జిలింగ్ ప్రాంతంలోని ఐదు పార్టీలు ఏకతాటిపైకి వచ్చి సమిష్టి నాయకత్వంలో ఉద్యమం నిర్వహించాలని నిర్ణయించాయి. పరస్పర తీవ్రంగా విభేదించుకునే గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్‌ఎల్‌ఎఫ్) గోర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) ఒకేవేదిక మీదికి వచ్చాయి. ఈ ఆందోళనకు స్థానికుల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభిస్తున్నది. వాస్తవానికి ఒక్క గోర్ఖాలాండ్ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు అనేకం ఉన్నాయి. ఇందులో చాలా ప్రాంతాల డిమాండ్లు ఆమోదించదగినవి. మనది సువిశాల దేశమైనందు వల్ల అనేక భౌగోళిక, భాషా సాంస్కృతిక వైరుధ్యాలున్నాయి. ప్రతి జాతి రాజ్యాంగబద్ధంగా, దేశ సమైక్యతకు కట్టుబడి ఉంటూనే సొంత రాష్ట్రం లో స్వీయపాలన సాగించుకోవాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. పైగా బ్రిటిష్ పాలనా కాలంలో కూడా అనేక ప్రాంతాలు సొంత అస్తిత్వాలతో మనగలిగాయి. దేశంలో దాదాపు ఆరువందల సంస్థానాలు ఉండేవి. ఈ చారిత్ర క, సామాజిక నేపథ్యాలను, సాంస్కృతిక భిన్నత్వాన్ని, ఆర్థిక మనుగడను, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేయడం అవసరం. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవికతలను గుర్తించి ప్రజల మనోభావాలను గౌరవించాలనే విజ్ఞత పాలకులకు లేకపోవడమే కారణం. గోర్ఖాలాండ్ డిమాండ్ 110 ఏండ్లుగా ఉన్నది. బ్రిటిష్ కాలంలో తమను వేరే ప్రాంతంతో కలుపకుండా ప్రత్యేక పాలనా విభాగం గా మార్చాలని గోర్ఖా ఉద్యమకారులు మింటో మార్లే సంస్కరణల కమిటీకి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు సమర్పించారు. 1980 దశకంలో ఉద్యమం తీవ్రంగా సాగి పన్నెండు వందల మంది మరణించారు. 2007లో మళ్ళా ఉద్యమం రాజుకున్నది. 2011లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గోర్ఖాలాండ్ ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. కానీ ఉద్యమం ఆగిపోగానే ఆ స్థానిక పాలనా మండలికి అధికారాలు బదలాయించకుండా, గోర్ఖా పార్టీలను బలహీన పరిచే పన్నాగాలు సాగాయి. దీంతో ఇప్పుడు మళ్ళా ఉద్యమం రాజుకున్నది. 2009 ఎన్నికల సందర్భంగా కొత్త రాష్ర్టాల ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ గోర్ఖా ప్రజలను నమ్మించింది. దీంతో బీజేపీ నేత జస్వంత్ సింగ్‌ను గోర్ఖాలు లోక్‌సభకు ఎన్నుకున్నారు. కానీ లోక్‌సభలో కంటి తుడుపు మాటలు మాట్లాడటం మినహా బీజేపీ గోర్ఖాల డిమాండ్ సాధనకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని చూస్తున్న బీజేపీ డార్జిలింగ్‌లో గోర్ఖా ఉద్యమాన్ని ఎగదోస్తున్నదనే ఆరోపణ ఉన్నది. గోర్ఖా వర్గాలను ఏకతాటిపైకి తేవడమే కాకుండా ఉద్యమ ఐక్య సంఘటనలో కూడా చేరింది. కానీ బీజేపీ జాతీయ నాయకులు మాత్రం తమ డార్జిలింగ్ శాఖ గోర్ఖా ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు తెలియదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గోర్ఖా ఉద్యమాన్ని అణచడానికి అన్ని విధాల సహకరిస్తామని కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. డార్జిలింగ్‌లో గోర్ఖా ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఢిల్లీలో మాత్రం బెంగాలీ లాబీకి అనుకూలంగా వ్యవహరించడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. సీపీఎం తమ పార్టీ భాషా ప్రయుక్త రాష్ర్టాలు ఉండాలనే సూత్రానికి కట్టుబడి ఉంటుందని చెప్పుకుంటుంది. కానీ ఇదే సూత్రం ప్రకారం గోర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించకుండా బెంగాలీ పెత్తనాన్ని కాపాడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిజాయితీగా వ్యవహరించి కొత్త రాష్ర్టాల డిమాండ్లను సత్వరంగా పరిష్కరించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com