Home > Editorial > కోర్టుల తీర్పుతోనైనా కళ్లు తెరవాలి

కోర్టుల తీర్పుతోనైనా కళ్లు తెరవాలి

సుప్రీం తీర్పుతో రాముడికి రామ్...రామ్..
జీహెచ్ఎంసీలో కొత్త మార్పులు...?

supreme-apduniaభూగర్భ జలాలు ఇంకిపోతూనే ఉన్నాయి, పొంగి పొరలిన చెఱువులు, బావులు, మడుగులు, గడుగులు, పడియలు, వాగులు, అలుగులు ఎండిపోతున్నాయి, పూడిపోతున్నాయి,అదృశ్యమై పోతున్నాయి. హైద్రాబాద్ లో అదృశ్యమైపోయిన సరోవరాల గురించి ఉన్నత న్యాయస్థానం దిగ్భ్రాంతికి గురి కావడం పరిణామ నిహిత వైరుధ్యాలకు నిదర్శనం. దేశంలోని ఎనిమిది కోట్ల మందికి మంచినీరు లభించకపోవడం దశాబ్దుల ప్రగతిని వెక్కిరిస్తున్న వాస్తవం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీటి సరఫరా కోసం పథకాలను రచిస్తూనే ఉన్నాయి. కానీ వాస్తవ రూపం మాత్రం అనుకున్న స్థాయిలో జరగలేదన్నది ఇక్కడ వాస్తవం. నదుల నీరు తాగడానికి పనికిరాకుం డా దశాబ్దుల తరబడి చేసుకున్నాము. మంచినీరు బావుల నుంచి చేతులతో కాని యంత్రాలతో కాని తోడు కోవడం గ్రామీణులకు తెలీదు. చెఱువులు పూడిపోయి పల్లెలలో పొలాలుగాను, పట్టణాలలో నగరాలలో ఇళ్లుగాను, వాణిజ్య గృహ సముదాయాలు గాను అవతరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీరు, సేద్యపునీరు సమకూర్చడానికి అత్యాధునిక పథకాలు అమలు జరుపుతున్న సమయంలో సంప్రదాయ జల వనరులు అంతరించడం సమాంతర పరిణామం. పొంతన లేని ఈ పరిణామాలకు పొంతన కుదరని విధానాలు కారణం. చెఱువులు, బావులు, నదులు, భూగర్భ జలాలు ఎండిపోవడం కలుషితం కావడం కేవలం నీటి సమస్య కాదు, ఇది చెట్టు సమస్య, అడవి సమస్య, జంతువుల సమస్య, మానవ జీవన విధానపు సమస్య, సర్వ సమగ్ర ప్రకృతి సమస్య… వర్షం నీరు వృథా కాకుండా ప్రతి గ్రామంలోను మంచినీటి చెఱువు ఏర్పాటు చేయవచ్చు. కానీ చెఱువు నీరు తాగడం పాతకాలం మాట. అభివృద్ధి నిరోధకం. చెరువులను పూడ్చేశారు. మంచినీటి కోసం బోరింగ్ వేసి ఓవర్‌హెడ్ టాంక్ కట్టారు. ఏడాది తిరగకుండానే భూగర్భం ఎండిపోయింది. ‘బోరింగ్’, దాన్ని ఏర్పాటు చేయడానికైన నిధులు వృథా అయిపోయాయి. ఊట చెఱువులు అనేది సరికొత్త ఆవిష్కరణగా కొన్ని దశాబ్దుల పాటు ప్రచారమైంది. ప్రతి గ్రామంలోను కనీసం ఒక చెఱువును నిర్మించాలన్నది ఆదర్శం. ఈ చెఱువు నీరు పొలాలకు వాడరాదు, తాగవచ్చు. కానీ ఈ చెఱువులో నీరు నిండుగా ఉన్నందు వల్ల దిగువ ప్రాంతంలోని భూగర్భ మంతంటా నీరు విస్తరించి ఉంటుంది. బావులలోను, గొట్టపు బావులలోను నీరు అందుతుంది. ఈ ‘ఊట’- పర్కొలేటరీ- విధానం అనాదిగా మన దేశంలో ఉంది. నీరు ఇంకడం లేదు కనుక భూగర్భంలో నీరు నిరంతరం ఉండదు. అందువల్ల బోరింగ్- గొట్టపుబావి- నకు నీరు దొరకదు, దొరకలేదు. మంచినీరు, సేద్యపునీరు రెండూ దొరకడం లేదు. అందువల్ల చెఱువులను నిర్మించాలనడం కొత్త సిద్ధాంతంగా ప్రచారం అయింది. మళ్లీ కనిపెట్టిన ఈ చెఱువుల సిద్ధాంతం దేశ వ్యాప్తంగా విఫలం కావడానికి కారణం చిత్తశుద్ధి లేని ప్రణాళికలు, పథకాలు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో కాకతీయ ఉద్యమం పేరుతోను, భగీరథా ఉద్యమం పేరుతోను చెఱువులను పునరుద్ధరిస్తోంది. ఇంటింటికీ మంచినీరు లభించనున్నదట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నీటి పథకాలు నిర్మిస్తోంది. కానీ దేశమంతటా జరుగుతున్నట్టే రెండు తెలుగు రాష్ట్రాలలోను పాత చెఱువులు పాడుపడిపోతూనే ఉండడం సమాంతర పరిణామం. తెలంగాణలో ఒక వైపున కాకతీయ ఉద్యమం- మిషన్ కాకతీయ-లో భాగంగా పాత చెఱువులను పాడుపడిన చెఱువులను పునరుద్ధిస్తున్నారు. కానీ రాష్ట్ర రాజధానిలో అదృశ్యమైపోయిన సరోవరాల గురించి ఉన్నత న్యాయస్థానం దిగ్భ్రాంతికి గురి కావడం పరిణామ నిహిత వైరుధ్యాలకు నిదర్శనం. భాగ్యనగర ప్రాంగణంలో 1950 వరకూ దాదాపు ఏడు వేల సరస్సులు, కుంటలు, చెఱువులు, ఇతర సహజ జలాశయాలు ఉండేవట. ప్ర స్తుతం కేవలం డెబ్బయి చిన్న, పెద్ద జలాశయాలు మిగిలి ఉన్నాయట. ఈ జలాశయాలు కూడా కేవలం దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నీటిని ముట్టుకుంటే చాలు రోగగ్రస్తులు కావలసిందే. మరోవైపు రెండు వందల నలబయి కిలోమీటర్ల ‘ముచికుంద’ నది మురుగు వాసనల మురికినీటి ‘మూసీ’గా మారిపోయింది. మూసీ నది మళ్లీ ‘పాన యోగ్యం’ కాకపోయినా కనీసం స్నాన యోగ్యమైన వ్యవసాయ యోగ్యమైన నీరు ప్రవహించేది ఎప్పుడు? ‘మూసీ’ క్షాళన కార్యక్రమం వైఫల్యాలకు ఒక ఉదాహరణ మాత్రమే. గంగానది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వాలు గతంలో ప్రారంభించిన పథకాలు కాలుష్యంలో కలసిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం మరింత దీక్షతో మరింత ఆర్భాటంగా ‘గంగాశుద్ధి’ కార్యక్రమం ఆరభించింది. ‘నమామి గంగే..’ పథకంలో భాగంగా గత జూలైలో గంగానది పొడవునా రెండు వందల ముప్పయి ఒక్కచోట్ల సమాంతరంగా జలశుద్ది కార్యక్రమం ఆరంభమైంది. కానీ ప్రపంచీకరణ పారిశ్రామిక కాలుష్యం నుంచి విముక్తం అయ్యేవరకూ గంగకు మునుపటి స్వచ్ఛ జలరూపం ఏర్పడడం కల్ల..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీటి వనరులను నిర్వహిస్తున్నంత కాలం నీటి సమస్య తీరదు. ఎండిన చెఱువులు, నగదులు మళ్లీ నిండవు. చెట్లు,నీరు, అడవులు, వానలు పరస్పర ఆశ్రయాలు, పరస్పర పరిపోషకాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *