Home > Health > క్షయ వ్యాధిపై యుధ్దం : మంత్రి ల‌క్ష్మారెడ్డి

క్షయ వ్యాధిపై యుధ్దం : మంత్రి ల‌క్ష్మారెడ్డి

శీతాకాలంలో టమోటా ఉపయోగాలు
ఖమ్మం ప్రైవేటు వైద్యానికి సుస్తి
lakshma reddy_apduniaత్వ‌ర‌లోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనూ బైక్ అంబులెన్స్‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి వెల్లడించారు.  వాటిని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల‌కు పంపిస్తామ‌న్నారు . అలాగే నిరుపేద‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్న పార్ధివ వాహ‌నాల సంఖ్య‌ను పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం మాన‌వీయ కోణంలో, కేవ‌లం సేవా దృక్ప‌థంతో, ప్ర‌జారోగ్య‌మే ప‌ర‌మావ‌ధిగా ప‌ని చేస్తున్న‌ద‌న్నారు. సవరించిన జాతీయ క్షయ నివారణ కార్యక్రమం ఆర్నేటీసీపీ  క్షేత్ర స్థాయి ఉద్యోగుల ద్విచక్ర వాహనాలను ప్రారంభించి, పంపిణి చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మా రెడ్డి, ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రంలోని గ‌ల్లీల్లో అంబులెన్స్‌లో వెళ్ళ‌లేని స్థితి ఉంద‌ని, అలాగే ఏజెన్సీ ఏరియాల్లోనూ వాహ‌నాల‌ను వెళ్ళ‌లేని రోడ్లు స‌రిగా లేని ప్రాంతాల్లోకి వైద్య సేవ‌లు అందించ‌డానికి వీలుగా ఈ బైక్ అంబులెన్స్‌ల‌ను వినియోగిస్తామ‌న్నారు మంత్రి. అలాగే 28వ తేదీన నెక్లెస్ రోడ్‌లోనే అమ్మ ఒడి వాహ‌నాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. గ‌ర్బిణీల‌ను ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లోనే సుఖ ప్ర‌స‌వాలు చేయించి, త‌ల్లీ బిడ్డ‌ల‌ను, వారి అటెండెంట్ల‌ను క్షేమంగా ఉచితంగా వాళ్ళ‌ ఇళ్ళ‌కు చేర్చేందుకే అమ్మ ఒడి వాహ‌నాల‌ను వినియోగిస్తామ‌న్నారు. ఈ వాహ‌నాల‌ను కూడా మొద‌ట‌గా ప్ర‌యాణ స‌దుపాయాలు అంత‌గా లేని ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. మ‌రోవైపు ఈ మ‌ధ్యే ప్రారంభించిన పార్థివ వాహ‌నాలు నిరుపేద‌ల కోసం ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని, ఇప్ప‌టికే 1200 డెడ్ బాడీస్‌ని, ద‌గ్గ‌రే కాకుండా, సుదూర ప్రాంతాల‌కు, ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా త‌ర‌లించామ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న 50 వాహ‌నాల‌కి తోడుగా మ‌రో 30 వాహ‌నాల‌ను అద‌న‌గా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు. మొత్తం 168 వాహనాలను పంపిణి చేసిన మంత్రి ఈ విష‌య‌మై మాట్లాడుతూ క్షేత్ర స్థాయి పరిశీలన, ప్రత్యక్ష పర్యవేక్షణలో భాగంగా గృహ సందర్శన ద్వారా క్షయ వ్యాధి గ్రస్థులకు చికిత్స చేయాల‌ని క్షేత్ర సిబ్బందికి సూచించారు. క్షయ వ్యాధి తీవ్రతను గుర్తించడం, నిర్దేశిత స్థాయి చికిత్స ద్వారా రోగ విముక్తులను చేయడం, మందులు అందించాల‌న్నారు. 
క్షయ వ్యాధి గ్రస్తులతో పాటు క‌లిసి జీవించే వాళ్లకు కూడా పరీక్షలు జరపడం, కౌన్సెలింగ్ ఇవ్వడం క్షేత్ర సిబ్బంది ప్రధాన లక్ష్యంగా ఉండాల‌న్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తో కలిసి భారత ప్రభుత్వం, తెలంగాణ సర్కారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని, మంచి ఫ‌లితాలు సాధించే దిశ‌గా సిబ్బంది ప‌ని తీరు ఉండాల‌ని, వాళ్ళ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఈ ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేయాల్సిన బాధ్య‌త అధికారుల‌ద‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి చెప్పారు.ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక సారి చొప్పుననిర్వహించే టీబీ వ్యాధిగ్రస్తులు గణన ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికీ 1,54,947 మందికి టీబీ పరీక్షలు నిర్వహించారు, అందులో 29,741 మందికి టీబీ రోగులుగా నిర్ధారించారు. న్యూ స్మియర్ పాజిటివ్ గా మరో 13,367 మందిని నిర్ధారించారని మంత్రి చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లోనూ ఇలాంటి కేసులు నమోదు అవుతున్నప్పటికి, రికార్డు కావడం లేదన్నారు. ప్రతి టీబీ రోగి ఏడాదికి సగటున 15 మందికి ఈ వ్యాధిని అంటించే అవకాశం ఉందని మంత్రి ల‌క్ష్మారెడ్డి వివ‌రించారు. ఇప్పటివరకు 70 వేల మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా రికార్డులు చెబుతున్నాయన్నారు. టీబీ ఊపిరి తిత్తులకు 85 శాతం సోకె అవకాశం ఉందని,  మిగతా అవయవాలకు కూడా టీబీ సోకవచ్చున‌ని, టీబీ వ్యాధి నివారణకు అవగాహనే మందు అని మంత్రి ఉద్బోధించారు. టీబీ ని నివారించకపోతే, మానవాళి మనుగడకు ప్రమాదం ఏర్ప‌డుతుంద‌న్నారు. అందుకే టీబీ మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, టీబీ నివారణ లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.  ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఇచ్చిన వాహనాలను సద్వినియోగం చేయాలని అన్నారు. సీఎం కెసిఆర్ కల ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగస్వాములు అవుదామ‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డితోపాటు, ఆ శాఖ‌ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమణి, ఆరోగ్య సంచాలకులు డాక్టర్ లలిత కుమారి, టీబీ జేడీ సూర్యప్రకాష్, ప్రపంచ ఆరోగ్య సంస్థ  కన్సల్టెంట్ డాక్టర్ చక్రపాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *