Home > Editorial > సింగిల్‌ పాయింట్‌ అజెండాలో మోడీ

సింగిల్‌ పాయింట్‌ అజెండాలో మోడీ

కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
స్వదేశానికి ప్రధాని

narendra-modi-apduniaఎన్డీయే ప్రభుత్వమైనా ప్రధాని మోదీ ముందు మిత్రపక్షాలు వెలవెలబోతున్నాయి. మంత్రివర్గ మార్పులలో మిత్రపక్షాలకు చోటు దక్క లేదు. కానీ సంకీర్ణ ప్రభుత్వమైనందు వల్ల కనీస మర్యాద దక్కడం లేదని..మిత్రపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి మిత్రపక్షాల తోడ్పాటుతో అయినా సరే కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని బీజేపీ తహతహలాడి ఎంతో కాలం కాలేదు. వాజపేయి అన్ని పక్షాలను కలుపుకొని పోతూ కేంద్రంలో అధికారం నిలబెట్టుకున్నారు. వాజపేయి హయానికి ఇప్పటి ప్రధాని మోదీ పాలనకు ఎంతో తేడా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని దేశవ్యాప్తంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్న మోదీ- అమిత్ షా జోడీకి మిత్రపక్షాల ఉనికిని పెద్దగా పట్టించుకునే ధోరణి లేదు. అందుకే ఎన్డీయే కూటమి చచ్చిపోయినట్టే అని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు బీజేపీ పోకడను శివసేన వంటి పార్టీలు బహిరంగంగా నిరసించగలవు. కానీ మిగతా పక్షాలు మింగలేక, కక్కలేక మౌనం వహిస్తున్నాయి. వ్రతం చెడినా ఫలం దక్కాలన్నట్టు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ తన జేడీయూ పటాలంతో ఎన్డీయేలో కూడా చేరారు. కానీ కేంద్ర మంత్రివర్గంలో ఒక్క పదవి కూడా దక్కలేదు. మిత్రపక్షంగా కనీస గౌరవం కూడా దక్కడం లేదు. బీజేపీ లోక్‌సభ ఎన్నికలలోగా నితీశ్‌ను కొనసాగనిస్తుందా లేక జేడీయూను మింగేసి ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకుంటుందా అనే సందేహానికి తావేర్పడ్డది. కేంద్ర మంత్రివర్గం అంటే అది దేశ సామాజిక స్వరూపానికి, రాజకీయ స్వభావానికి ప్రతిబింబంగా నిలువాలె. రాజ్యాంగబద్ధంగా అన్ని ప్రాంతాల, వర్గాల ప్రాతినిధ్య వేదికగా ఉండాలని లేనప్పటికీ, విస్తృత ప్రాతినిధ్యం వల్ల పాలనకు నైతికత లభిస్తుంది. ప్రజాస్వామ్యం స్థిరపడుతుంది. ప్రజామోదం లభిస్తుంది. కానీ ఇటీవలి కాలంలో ప్రధాని స్థానం బలపడటమే కాకుండా, రాజకీయ రంగంలో కేంద్రీకృత ధోరణులు పెరుగుతున్నయి. మోదీ- అమిత్ షా నాయకత్వం ఎంత బలంగా ఉందో క్యాబినెట్‌ను పరిశీలిస్తేనే అర్థమవుతుంది. ప్రధాన శాఖలు పూర్తి విధేయులకే లభించాయి. ఆ విధేయులైనా ఆయా ప్రాంతాలలోని ప్రజా పునాది గల నాయకులతో నిండిపోయిందా అంటే అదీ లేదు. మాజీ అధికారులకూ స్థానం దక్కింది. ప్రధా ని మోదీ క్యాబినెట్‌లోని 27 మంది సహచరులలో పదమూడు మంది మంత్రి మాత్రమే లోక్‌సభ సభ్యులు.

పధ్నాలుగు మంది రాజ్యసభ నుంచి వచ్చినవారు. ఆర్థిక, రక్షణ, మానవ వనరుల అభివృద్ధి, వాణిజ్యం వంటి కీలక శాఖలు రాజ్యసభ సభ్యులే నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల ప్రముఖులతో కళకళలాడే రాజ్యసభను తక్కువగా చూడకూడదు. ప్రజాక్షేత్రంలో గెలువ లేనంత మాత్రాన కొందరు నిష్ణాతుల సేవలను మంత్రుల స్థానంలో ఉపయోగించుకోవడం కోసం రాజ్యసభ దారి ఉన్నది. అయితే ప్రజలలో తిరిగి వారి మెప్పు పొందడానికి నిరంతరం ప్రయత్నించే వారికి దేశ సమస్యలు ఏమిటనేవి బాగా అర్థమవుతాయి. వీలైనంత వరకు ప్రజా క్షేత్రం నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఉండాలె. రాజ్యసభ నుంచి లేదా రాజకీయేతర రంగాల నుంచి వచ్చిన వారితో మంత్రివర్గం ఎక్కువగా నిండిపోయే పోకడ అభిలషణీయమైనది కాదు.

తమిళనాడుకు చెందిన నాయకురాలు నిర్మలా సీతారామన్‌కు రక్షణ కీలకమైన మంత్రిత్వ శాఖ దక్కడం విశేషమే. దేశ భద్రతకు సంబంధించిన క్యాబినెట్ కమిటీలో విదేశాంగ మంత్రి అయిన సుష్మా స్వరాజ్‌తోపాటు మరో మహిళకు స్థానం కల్పించినట్టయింది. అయితే సీనియ ర్ రాజకీయవేత్తకు కాకుండా, అప్పటి వరకు సహాయ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌కు కట్టబెట్టడమంటే పరోక్షంగా ఆ శాఖను ప్రధాని తన చేతిలో పెట్టుకోవడమే. బీజేపీ సుస్థిరత, విస్తరణ కోసం భిన్న ప్రాంతాలు, వర్గాలవారికి అవకాశాలు లభించాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నందున ఆ ప్రాంతానికి చెందిన వీరేంద్ర పాటిల్‌కు క్యాబినెట్ లో స్థానం దక్కింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిషా ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కనుక, ధర్మేంద్ర ప్రధాన్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఉత్తర ప్రదేశ్‌లో వివిధ సామాజిక వర్గాల మధ్య సమతుల్యత సాధించడంలో భాగంగా శివ్ ప్రతాప్ శుక్లాకు అవకాశం లభించింది. జాతీ య రాజకీయాలలోని తాజా పోకడలను బట్టి ఆయా తెలంగాణ ప్రజలు గ్రహించవలసినది ఎంతో ఉన్నది. కేంద్రీకృత రాజకీయాలకు, ప్రాంతీయ ప్రయోజనాలకు మధ్య ఎప్పుడూ ఏదో స్థాయిలో వైరుధ్యం ఉంటుంది. రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించే పెద్ద నాయకులను జాతీయ రాజకీయాలు ఎదుగనివ్వవు. ప్రాంతీయ ఆకాంక్షలను వ్యక్తం చేసే పార్టీల ఉనికిని జాతీయ పార్టీలు సహించవు. అందువల్ల సొంత రాజకీయపార్టీని బలోపేతం చేసుకోవాలె. ప్రాంతీయ పార్టీ ఎంపీలు ఎంత ఎక్కువగా ఉంటే, అంత ప్రభావ శక్తి ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి సొంత బలంపై ఆధారపడాలే తప్ప, జాతీయ పార్టీలను, వాటి మైత్రిని నమ్ముకోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *