Home > Editorial > స్కూళ్లలో కొరవడుతున్న రక్షణ

స్కూళ్లలో కొరవడుతున్న రక్షణ

మానవహక్కుల్లో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణ
సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ

schoolchildren-apduniaపిల్లలకు ఉజ్వల భవిష్యత్ కోరుకుంటూ తల్లిదండ్రులు లక్షల ఫీజులు కుమ్మరించి కార్పొరేట్ స్కూళ్లలో చేర్చుతున్నారు. స్కూలు బస్సులకు వేలకువేలు చెల్లిస్తున్నారు. కేరింతలు కొడుతూ ఇంటికి రావలసిన కొడుకు శవమై వస్తే ఆ తల్లిదండ్రుల గుండెకోత మాటలకందదు. ఇటువంటి విషాద సంఘటన కొద్దిరోజుల క్రితం గురుగ్రాం(హర్యానా)లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలులో జరిగింది. ఏడేళ్ల ప్రద్యుమన్ ఠాకూర్ అనే విద్యార్థి స్కూల్ వాష్‌రూంలో దారుణంగా హత్యకు గురైన సంఘటన హృదయాలను కలచివేస్తుంది. ఆ పిల్లవాడిపై లైంగిక దాడి కూడా జరిగిందని, స్కూలు బస్సు డ్రైవర్‌ని అరెస్టు చేయగా అతడు హత్యానేరం అంగీకరించినట్లు ఒక కట్టుకధ ప్రచారంలోకి వచ్చింది. లైంగిక దాడి జరగలేదని, గొంతుపై సహా రెండు చోట్ల కత్తిగాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టు తెలియజేసింది. అందువల్ల దీనివెనుక ఎవరో కుట్రదారులున్నారని విదితమవుతున్నది. తన కుమారుని హత్యపై సిబిఐ దర్యాప్తు ఆదేశించాలని కోరుతూ బరుణ్ చంద్ర ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అధ్యక్షతనగల ధర్మాసనం హర్యానా ప్రభుత్వానికి, రాష్ట్ర డిజిపికి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వార కేంద్రప్రభుత్వానికి, సిబిఎస్‌ఇకి నోటీసులు జారీ చేసింది. పుత్రశోకంలో ఉన్న తండ్రి విజ్ఞప్తికి స్పందించాల్సిందిగా జస్టిస్ మిశ్రా సిబిఐని కోరారు.తాను అనుభవిస్తున్న క్షోభ మరే తల్లిదండ్రులకు రాకూడదన్నది కొడుకును కోల్పోయిన తండ్రి ఆవేదన. బాలల భద్రత లేమికి దారితీస్తున్న బరితెగించిన ఉల్లంఘనలు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదన్నది అతని నివేదన. ఆ మనోభావంతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి ‘ఈ సమస్య దేశమంతటా బాలల భద్రతకు సంబంధించింది’ అని వ్యాఖ్యానించారు.

కేంద్రప్రభుత్వానికి, సిబిఎస్‌ఇకి నోటీసులు జారీ చేయటంలో ఇదే ఉద్దేశం వ్యక్తమవుతోంది. విచారణ అనంతరం స్కూళ్లలో కచ్చితంగా పాటించాల్సిన భద్రతా నిబంధనలను కోర్టు ఆదేశించవచ్చు. ప్రద్యుమన్ ఠాకూర్ హత్యపై సిబిఐ విచారణ ఆదేశించే అవకాశముంది.ప్రసిద్ధి చెందిన ర్యాన్ స్కూళ్లలో పిల్లల భద్రత డొల్ల. వసంత్‌కుంజ్ (ఢిల్లీ)లోని ర్యాన్ స్కూల్లో గత సంవత్సరం ఒక విద్యార్థి నీటితొట్టిలో మునిగి చనిపోయాడు. ఢిల్లీ ప్రభుత్వం అప్పుడుసిబిఐ దర్యాప్తును కోరినా కేంద్రప్రభుత్వంలో చలనం లేదు. గురుగ్రాం ఘటన జరిగిన వెంటనే ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో మూడువారాల్లో సిసిటివి కెమెరాలు నెలకొల్పాలని, తమ నాన్‌టీచింగ్ సిబ్బంది గతం గూర్చి పోలీసు తనిఖీ నివేదికలు పొందాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థుల భద్రతకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఒక కమిటీ వేసింది. గురుగ్రాం జిల్లా అధికారులు 2014లోనే పోలీసు, తల్లిదండ్రులు, బాలల భద్రత నిపుణులు, బాలల మానసిక శాస్త్రజ్ఞులు, న్యాయాధికారులు, పౌరసంస్థలు, మీడియా సభ్యులతో చర్చించి మార్గదర్శకాలు రూపొందించారట. కాని వాటిని అమలు జరిపిన నాధుడు లేడు.బాలికల పట్ల టీచర్లు లేదా స్కూలు సిబ్బంది అరాచకాలు, అఘాయిత్యాల గూర్చి గగుర్పాటు గొలిపే ఏదోక ఘటన వినని రోజంటూ ఉండటం లేదు. తూర్పుఢిల్లీలోని ఒక స్కూలులో ప్యూను ఒకడు ఐదేళ్ల చిన్నారిపై శుక్రవారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోనే మోడల్ టౌన్ తాన్‌సేన్ అకాడమీలో పియానో టీచరు ఏడేళ్ల బాలికను తాకరానిచోట పదేపదే తాకుతున్నట్లు కేసు నమోదైంది. వాయవ్య ఢిల్లీలో అశోక్ విహార్ ప్రిసీడియం స్కూలులో డ్యాన్స్ టీచర్ ఒక ఐదవ తరగతి విద్యార్థినిని బట్టలు తీసేయమన్నట్లు ఫిర్యాదు అందింది. అంతదూరమెందుకు, మన సంగారెడ్డిలోని రావుస్ హైస్కూల్‌లో, యూనిఫాం వేసుకు రాలేదని వ్యాయామటీచర్ ఒక విద్యార్థినిని బాలుర టాయిలెట్ ముందు నిలబెట్టిందట. ఇటువంటి అరాచకాలు నిలిచిపోవాలంటే నేరస్థులను కఠినంగా శిక్షించటంతో పాటు దానికి తగినంత పబ్లిసిటి ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అమలు జరిగేలా భద్రత మార్గదర్శకాలు జారీ కావాలి. వాటి అమలు పరిరక్షణకు నోడల్ అధికారులను నియమించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com