Home > Crime > అడ్డూ అదుపు లేకుండా ఎర్రచందనం స్మగ్లింగ్

అడ్డూ అదుపు లేకుండా ఎర్రచందనం స్మగ్లింగ్

ప్రకాశంలో పెరుగుతున్న క్రైమ్ రేట్
బెజవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం

redsandel-smuglling-apduniaఅటవీశాఖ పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా విలువైన ఎర్రచందనం తరలింపును అడ్డుకోవడంలో వారు విఫలమవుతున్నారు. తిరుపతి, చిత్తూరు డివిజన్ల వారీగా అధికారులు, సిబ్బంది ఉన్నా వారు చేసేది ఏమీలేదు. సమాచారం వస్తే… అప్పుడప్పుడు దాడులు చేస్తూ.. తూతూమంత్రపు తనిఖీలతోనే నెట్టుకొస్తున్నారు. ఏమైనా అంటే ఎర్రచందనం సంరక్షణ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చూస్తారనే కారణం చెప్పి తప్పించుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ వారు ముందుకు సాగడం లేదు. జిల్లాలో అటవీశాఖ చెక్‌పోస్టులు 15 ఉండగా.. వీటిని చెన్నై, బెంగళూరు మార్గాల్లో కీలకమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కేవలం ఒక వాచర్‌ను నియమించి పనైపోయిందనిపిస్తున్నారు. ఏం తనిఖీ చేయాలి..? అసలు అక్కడ విధులేమిటి..? అనేవి వాచర్లకు అవగాహన లేదు. తనిఖీ ఉండదు.. ఒక అనుమానిత వాహనాన్ని ఆపేది ఉండదు. వారు చెక్‌పోస్టుల్లో కూర్చొని వెళ్లిపోతున్నారు. కొందరైతే అసలు విధులకే రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. దీంతో వాహనాలు చక్కగా సరిహద్దులు దాటేస్తున్నాయి. కీలకమైన సమాచారం వస్తే మినహా ఇవి కేవలం లెక్కల కోసమే పనిచేస్తున్నాయి. ఈ ఏడాది చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తూ పట్టుబడిన కేసులు లేవు. అక్కడున్న వాచర్లు సైతం ‘మాదేముంది… రూ.5వేలు ఇస్తే పనిచేస్తున్నాం…’ అని చెప్పడం విశేషం. ఇక రాత్రి వేళ అక్కడ కనీసం ఎవరూ ఉండరు. ఏ వాహనానికి అడ్డూ అదుపు ఉండదు. చక్కగా ఎర్రచందనాన్ని అడవులు దాటించే పరిస్థితులే కనిపిస్తున్నాయి.ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. పొరపొచ్చాలు ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే దానికి అటవీశాఖ, ప్రత్యేక టాస్క్‌ఫోర్సుల మధ్య నెలకొన్న అంతరమే ప్రత్యక్ష ఉదాహరణ. రెండు శాఖల మధ్య పరోక్ష యుద్ధం జరుగుతోంది. వీరికి వారు సహకరించరు… వారికి వీరు సహకరించరు… కేవలం ఇది ఇక్కడే కాదు… మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర సమావేశమైన సందర్భాల్లోనూ… ఈ రెండు శాఖల అధికారులు వాదులాటలకు దిగిన సందర్భాలున్నాయి. ఒకరి తప్పులు ఇంకొకరు ఎత్తిచూపే స్థాయికి వీరి విబేధాలు చేరాయి. శేషాచలం పరిరక్షణ ఎవరిది..? అనే విషయాన్ని ఇరు శాఖల అధికారులను అడిగితే మాకేం సంబంధం.. అంటే మాకేం సంబంధం..! అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇది అధికారుల మధ్యనే కాదు… సిబ్బంది మధ్య కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.అడవుల పరిరక్షణకు, విలువైన ఎర్రచందనం రవాణా నిరోధానికి అటవీశాఖ పరంగా చేస్తున్నదేమీ కనిపించడం లేదు. ఎర్రచందనం రక్షణకు అటవీశాఖలోని కీలక అధికారులు విదేశాలకు వెళ్లి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి రావడం, తర్వాత దాన్ని ప్రభుత్వానికి నివేదించడం పలు సందర్భాల్లో జరిగింది. అయితే అమలు జరగలేదు. తాజాగా శేషాచలం అడవులపై బెలూన్లను ఎరుగవేసి… నిఘా పెట్టాలని అనుకున్నారు. దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. గతంలో డ్రోన్లతో నిఘా వ్యవహారం బెడిసికొట్టింది. ఇలా ప్రతిసారి ఏదో ఒక విషయంపై పరిశీలన చేయడం… అది అమలు చేయకపోవడం మినహా కొత్తగా వీరు చేసేదేమీ లేదు. ఇక ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించడానికి అడవుల పక్కనుండే తండాలు, కాలనీల్లో కనీసం అవగాహన కార్యక్రమాలను కూడా వీరు చేయడం లేదు.అప్పుడప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు పట్టుకుంటున్నారు. దీన్ని మీడియాకు చూపించే విషయంలోనూ సరైన సమాచారం లేదు. కేవలం దుంగలను పట్టుకున్నట్లు చిత్రాలను విడుదల చేసి… ఒక ప్రెస్‌ నోటుతో మమ అనిపిస్తున్నారు. వారి లెక్కల కోసం తప్ప… ఎప్పటికప్పుడు సిబ్బందితో కనీసం తనిఖీలు ఉండటం లేదు. అడవుల్లోకి ఏమైనా వాహనాలు వెళ్తున్నాయా..? వాటి పరిస్థితి ఏమిటి..? అనే లెక్కలు తెలియడం లేదు. దీనిపై ఏమైనా అంటే.. మా చేతుల్లో ఏముంది… స్మగ్లర్ల వద్ద ఆయుధాలు ఉంటాయి.. మా దగ్గర ఏముంటాయి..? అనే సమాధానం వస్తోంది. మిగిలిన విషయాల్లోనూ అటవీశాఖ అద్భుతాలు చేస్తుందా అంటే అదీ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *