Home > Editorial > వ్యవసాయానికి సాయం కావాలి

వ్యవసాయానికి సాయం కావాలి

అమెరికాను కుదిపేస్తున్న ట్రంప్ నిర్ణయాలు
రాహూల్ గాంధీ విశ్వాసం కల్గిస్తారా...

agriculture-apduniaవ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకోవడం అనేక కారణాలు ఉన్నాయి. ఎరువులు, పురుగు మందులు అటు రైతాంగం తీవ్ర సమస్య ఎదుర్కొంటోంది. గత 16 ఏళ్ల కాలంలో ఆ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లోని 14,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది జులై నుంచి యవత్మల్ జిల్లాలోని, ఇతర ప్రాంతాలలోని వ్యవసాయ కార్మికులు, రైతులు క్రిమిసంహారక మందుల బారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఆగస్టు నుంచి 19మంది మరణించారు అన్న వార్తలు వచ్చే దాకా ప్రభుత్వం కాని, మీడియా కాని క్రిమి సంహారకాల వల్ల ఎదురవుతున్న ముప్పును పట్టించుకోనే లేదు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉన్నందువల్ల, వీటిపై జనాగ్రహం ప్రబలినందువల్ల రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సింది. ఇంతకు ముందు కూడా క్రిమి సంహారకాల వల్ల జనం జబ్బు పడుతున్నారని సమాచారం అందినా నివారణ చర్యలు ఏమీ తీసుకోలేదు. యవత్మల్ జిల్లాలో 19మంది మృతితో పాటు క్రిమిసంహారకాల వల్ల మొత్తం 30 మంది మరణించారు. అందువల్ల క్రిమిసంహారకాలను నియంత్రించి పరిస్థితిని నిశితంగా పరిశీలించాల్సింది. 2002లో బి.టి. పత్తి అమ్మకాలను భారత్‌లో ఆమోదించినప్పటి నుంచి కేవలం వర్షాధారంగానే సేద్యం జరిగే విదర్భ ప్రాంతంలో రైతులు ఆ పత్తి వంగడాలను సాగుచేయడం మొదలు పెట్టారు. గత సంవత్సరం పత్తికి మంచి ధర పలకడం వల్ల ఈ సారి రైతులు 16-17 లక్షల ఎకరాల్లో పత్తి విత్తారు. అనేక సం॥రాలుగా ఈ ప్రాంతంలోనూ, ఇతర చోట్ల క్రిమి సంహారకాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎర్ర నల్లి, పచ్చ దోమ కీటకాలకు ఈ క్రిమి సంహారకాలు పనిచేయడం లేదు. గత రెండు సంవత్సరాల నుంచి ఉత్తరాదిలోనూ, దేశంలోని పశ్చిమ ప్రాంతంలోనూ బి.టి. పత్తి దిగుబడి తగ్గింది. తెల్ల దోమ, ఎర్రనల్లికి బోల్ గార్డ్ 2 పని చేయడం మానేసింది. 2009లోనే బోల్ గార్డ్ 1 పనిచేయడం మానేసింది. 2015లో గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో బోల్‌గార్డ్ 2కు బదులు మరో క్రిమి సంహారకం వాడినా ప్రయోజనం కనిపించలేదు.2015-16లో తెల్లదోమ వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పత్తి పంటకు నష్టం కలిగింది. బి.టి. పత్తి సామర్థ్యం తగ్గిందని అనధికారికంగా అంగీకరిస్తున్నారు. కాని ప్రభుత్వా లు రైతులకు ప్రత్యామ్నాయం చూపలేదు. లేదా ఈ రకం పత్తి విత్తనాల అమ్మకాన్ని నియంత్రించడానికి చేసిందేమీ లేదు. పైగా రైతులు పత్తిచేల కు పక్కన కీటకాల బాధ సోకని పంటలు వేయలేదని విమర్శించింది. ఈ ఏడాది జులైలో పత్తి చేలలో విపరీతంగా కీటక నాశినులు వాడడానికి కారణం ఏమిటో పత్తి పరిశోధన కేంద్ర సంస్థ (సి.ఐ. సి.ఆర్.) వివరించింది. చాలా కాలం పాటు పత్తి కాయలను డిసెంబర్ లోనే కోయకుండా మార్చి దాకా కొనసాగించే వారు. అందువల్ల ఎర్ర నల్లి పత్తి గింజలకు, దూదికి నష్టం కలిగించేది కాదు. ఆ తర్వాత త్వరగా పత్తి విత్తడం వల్ల ఈ పురుగు సాధారణంగా నవంబర్ మధ్యలో ఆశిస్తుంది. కాని త్వరగా విత్తడం వల్ల పురుగు కూడా త్వరగా కనిపించడం మొదలైంది. ముఖ్యంగా సాగు నీటి ద్వారా పత్తి సాగు చేసే చోట్ల ఈ సమస్య ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలంగా ఉన్నందువల్ల, చేను ఎదుగుదలకు హార్మోన్లు వాడినందువల్ల ఆకులు దట్టంగా వస్తున్నాయి. గత సంవత్సరం నుంచి కలుపు నివారణ మందులను తట్టుకునే మోన్‌సాంటో రౌండప్ రెడీ ఫ్లెక్స్ (ఆర్. ఆర్.ఎఫ్.) అనే కొత్త వంగడాన్ని అక్రమంగా ప్రవేశ పెట్టారు. దీని వల్ల కొత్త ఇబ్బంది ఎదురైంది. ఈ నకిలీ విత్తనాలను పేరు, ఆ విత్తనానికి సంబంధించిన వివరాలు లేకుండా పాకెట్లలో అమ్ముతారు. అవి అధికోత్పత్తి రకాలో, లేదా వాటిలో బి.టి. పత్తి జన్యువులు ఉన్నాయో తెలియదు. 2001లో గుజరాత్‌లో నవభారత్ సీడ్స్ సంస్థ అక్రమంగా బి.టి. విత్తనాలను విక్రయించినప్పుడు ఇలాంటి సమస్యే ఎదురైంది. ఈ విషయాన్ని పరిశోధించడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఓ సంఘా న్ని నియమించారు. 15 శాతం విత్తనాలు నకిలీ ఆర్.ఆర్.ఎఫ్. విత్తనాలేనని తేలింది. ఆర్.ఆర్.ఎఫ్. విత్తనాలు అమ్మే మోన్‌సాంటో గత సవత్సరం ఈ విత్తనాల ఆమోదం కోసం జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జి.ఇ.ఎ.సి.)కి పెట్టుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. 2006 తర్వాత కొత్తరకం చీడ సోకడం వల్ల పత్తి పంటలపై నిరంతరం క్రిమి సంహారక మందులు చల్లడం మొదలైంది. సి.ఐ.సి.ఆర్. శాస్త్రవేత్త చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. బి.టి.పత్తిలో 2000 రకాల కన్నా అధికోత్పత్తి వంగడాలు ఉన్నాయి. 2013లో ఈ విత్తనాలు వినియోగించడం 95శాతం పెరిగింది. అందువల్ల చీడపీడల బాధ, దాని తో పాటు క్రిమి సంహారకాల వాడకం పెరిగింది. ఈ ఏడాది విదర్భ ప్రాంతంలో రసం పీల్చే పురుగుల, మూడురకాల గొంగళి పురుగుల, పచ్చదోమ, ఎర్ర నల్లి తాకిడి ఎక్కువైంది. పొగాకు పంటను ఆశించే గొంగళి పురుగుల బాధ కూడా పెరిగింది. వీటిని నివారించడానికి అనేక రకాల మందులను చల్లడం మొదలైంది. ఇప్పుడు పత్తిచేలు దట్టంగా ఉంటున్నాయి. కీటక నాశినులను చల్లేవారిపై ఈ మందుల ప్రభావం పెరుగుతోంది. క్రిమి సంహారక మందులు అమ్మే వారికి అమ్మకాలతో పని తప్ప రైతులపై విష ప్రభావం ఏ మేరకు ఉంటుందో పట్టించుకోరు. పైగా రైతులలో నిరక్షరాస్యులే ఎక్కువ. కొన్ని సంవత్సరాలుగా పత్తి చేలపై ప్రొఫెనోఫాస్, సైపర్మెత్రిన్ మందులు చల్లుతున్నారు. అయితే కీటక నాశినులు చల్లిన వారు జబ్బు పడడానికి, కొన్ని సందర్భాలలో మరణించడానికి కారణం ఏమిటో శాస్త్రీయ పరిశోధనల వల్ల మాత్రమే తెలుసుకోగలం. మోనో క్రోటోఫాస్, సైపర్మెత్రిన్ మందులు కలిపి వాడడం వల్ల సమస్య జటిలమవుతోంది. మందులు చల్లడంలో ఖర్చు తగ్గించుకోవడానికి రైతులు సాధారణంగా రోజు కూలీలను నియమిస్తారు. వారికి ఎలాంటి రక్షణ ఉపకరణాలు అందుబాటులో ఉండవు. యవత్మల్ జిల్లాలోనూ, ఇతర ప్రాంతాలలోనూ రైతుల మరణాలను కేవలం గణాంకాలుగా పరిగణించి విస్మరించడం విషాదమే అవుతుంది. మందులు చల్లే వారి ఆరోగ్య పరిరక్షణకు, క్రిమి సంహారకాలను నియంత్రించడానికి, సమగ్రమైన ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థ ఏర్పాటు తో పాటు మేలురకం విత్తనాలను అందుబాటులో ఉంచే విషయంలో ప్రభుత్వం బుద్ధిపెట్టి ఆలోచించాలి. ఈ విషాద సంఘటనలు పునరావృతం కాకుండా రాజకీయ సంకల్ప బలాన్ని ప్రదర్శించాలి. మొత్తం వ్యవసాయ విధానంపై ఈ ప్రభావం ఎంత ఉంటుందో పరిశీలించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *