Home > Politics > అమలుకు నోచుకోని హామీలు

అమలుకు నోచుకోని హామీలు

అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ దీపాలు : మంత్రి లోకేష్
ఏఐడీఎంకేనుంచి శశికళ, దినకరన్ ఔట్

chandrababu-naidu-apduniaఅనంతపురం అభివృద్ధికి ప్రభుత్వం చేసిన హామీలు సరిగా అమలు కావడంలేదని జిల్లావాసులు అంటున్నారు. ప్రకటనల్లో ఉన్నంత హుషారు పనుల్లో లేదని వ్యాఖ్యానిస్తున్నారు. సర్కార్ ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని జిల్లా అభివృద్ధికి చిరునామాగా మార్చాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాకు పలుసార్లు విచ్చేశారు. వచ్చిన ప్రతిసారీ అనేక హామీలిస్తూ అభివృద్ధి మంత్ర జపిస్తున్నారు. కానీ హామీలకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. సీఎం జిల్లా పర్యటనలు జరిపిన ప్రతిసారీ ఇచ్చిన హామీలన్నీ లెక్కిస్తే 157 వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు అమలు చేసినవి 47 మాత్రమే. అందులో కొన్ని అరకొరగానే ప్రారంభమయ్యాయి. అంశాల వారీగా చూస్తే ప్రధానమైనవేవి అమలు జరిగిన దాఖలాలు లేవని స్థానికులు అంటున్నారు. ఒక్క హంద్రీనీవా ప్రాజెక్టుపైనే ఆయన ఇచ్చిన హామీలు పది ఉన్నాయి. అందులో ఏ ఒక్కటీ పూర్తి కాలేదని చెప్తున్నారు.

అనంతపురం జిల్లాలో వాటర్‌గ్రిడ్‌ను ప్రారంభిస్తామని గతంలో సీఎం హామీ ఇచ్చారు. దీంతో అధికారులు వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.1900 కోట్లతో ప్రణాలిక రూపొందించారు. ఇది ఇంత వరకు అమలు జరగలేదు. పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తామని హామీఇచ్చారు. ఇదీ అమలుకు నోచుకోలేదు. వేరుశనగకు ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీని ఊసేలేదు. ఇలా అనేక హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా పూర్తయ్యే సూచనలు కనిపించ లేదు. గొల్లపల్లి రిజర్వాయర్‌ ఎగువ భాగంలో పారిశ్రామిక అవసరాలకు మరో రిజర్వాయరు నిర్మాణం చేపడతామని చెప్పారు. దానికీ అతీగతీలేదు. పేరూరు, బిటిపికి నీరిస్తామన్నారు. అవీ ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయాయి. మడకశిర బ్రాంచ్‌కాలువ పనులు పూర్తి చేస్తామన్న హామీలు వాయిదా పడుతున్నాయి. ఇలా పలు హామీలు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాక్షాత్తూ సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *