Home > World News > ఎన్నికల బాండ్లు వచ్చేస్తున్నాయ్…..

ఎన్నికల బాండ్లు వచ్చేస్తున్నాయ్…..

మోడీ వర్సెస్ తొగాడియా
అమరావతికి సింగపూర్ ప్రధాని..

arunjaitley-apduniaరాజకీయ పార్టీలకు వ్యక్తులు, సంస్థల విరాళాలను పారదర్శకం చేస్తామంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గత బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు కార్యాచరణ రూపమిస్తూ ఎన్నికల బాండ్లను ప్రకటించారు.బ్యాంకులను మధ్యవర్తులుగా చేసి రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చేందుకు ఈ బాండ్లు దోహదం చేస్తాయి. ఈ కొత్త ఎన్నికల బాండ్లు సంబంధించిన విధివిధానాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వదలిచే రుణదాతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వీటిని విరాళంగా రాజకీయ పార్టీలకు అందించవచ్చు. ఇలా తమకు అందిన బాండ్లను ఓ ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ద్వారా ఆయా రాజకీయ పార్టీలు నగదు రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలకు లభిస్తూ వస్తున్న నగదు చెల్లింపులకు ప్రత్యామ్నాయంగా ఈ ఎన్నికల బాండ్లను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ బాండ్లు ఎస్బీఐ ప్రత్యేక బ్రాంచిల వద్ద జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో పదేసి రోజులపాటు అందుబాటులో ఉంటాయి. పదిహేను రోజుల చెల్లుబాటు వ్యవధి కలిగిన ఈ బాండ్లపై రుణదాతల పేరు ఉండదు. అయితే, వీటిని కొనుగోలు చేసే వ్యక్తులు బ్యాంకువద్ద కేవైసీ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ అవినీతి మార్గాలకు పాల్పడుతున్నందున ఎన్నికల ప్రక్రియ వక్రీకరణకు గురవుతోంది. బడా పారిశ్రామిక సంస్థలు అధికారంలో ఉన్న పార్టీలను బట్టి తమ నల్లధనాన్ని, కొంత తెల్లధనాన్ని దామాషా పద్ధతిలో పంచిపెడుతుంటాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక దాని వాటా భారీగా పెరిగింది. కాంగ్రెస్‌కు విరాళాల ఆదాయం భారీగా కోతకు గురైంది. రాజకీయ విరాళాలను కొంతమేర పారదర్శకం చేసేందుకై ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి మేరకు ఇదివరకే కొన్ని మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి. వాటి ప్రకారం, రూ.20వేలకు పైబడిన విరాళాల మూలాలను ఆదాయపు పన్ను శాఖకు తెలిపి పన్ను మినహాయింపు పొందాలి. రూ.20 వేల లోపు విరాళాలను కూడా లెక్కల్లో చూపి ఐటి మినహాయింపు పొందాలి. అయితే ఈ విరాళాలకు మూలాలు అంటే దాతల పేర్లు వెల్లడించాల్సిన పనిలేదు. అయితే రాజకీయ పార్టీ నిధులకు మరింత పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చేందుకుగాను రూ.2000, ఆ పై బడిన విరాళాలకు కూడా మూలాలు వెల్లడించటం మంచిదని ఎన్నికల కమిషన్ కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేయగా, ఆర్థికమంత్రి గత బడ్జెట్ ప్రసంగంలో, ఎన్నికల్లో అవినీతి సొమ్మును అంతం చేసేందుకై ఆ సూచనను ఆమోదిస్తున్నట్లు ప్రకటించి హర్షధ్వానాలు పొందారు. అప్పుడే ప్రకటించారీ ఎన్నికల బాండ్ల పథకాన్ని. ప్రభుత్వం ఇప్పుడు నోటిఫై చేసిన ఆ పథకం ప్రకారం, దాతలు నగదు బదులు బాండ్ల రూపంలో విరాళం అందచేయాలి. రూ.1000, రూ.10,000, రూ.1లక్ష, రూ.10లక్షలు, రూ.1కోటి ముఖ విలువతో బాండ్లు ఉంటాయి. రాజకీయ విరాళాలిచ్చే దాతలు తమ బ్యాంకు ఖాతాల నుంచి బాండ్లను కొనుగోలు చేసి ఏ పార్టీకి ఎంత ఇవ్వదలిస్తే ఆ మేరకు బాండ్లు ఇవ్వవచ్చు. రాజకీయ పార్టీలు ప్రత్యేక ఖాతా తెరిచి, 15 రోజుల్లో ఆ బాండ్లను తమ ఖాతాలో జమచేయాలి. ఆ బాండ్లపై దాత పేరు ఉండదు. అయితే ఎవరైనా సరే ‘నో యువర్ కస్టమర్’ రూల్సు పాటించి తమ బ్యాంక్ ఖాతాలోని నిల్వ సొమ్ము నుంచి బాండ్లు కొనుగోలు చేయాలి కాబట్టి ఏ వ్యక్తి, ఏ సంస్థ ఎంత విలువ బాండ్లు కొన్నదో బ్యాంకుకు తెలుస్తుంది. కాని ఆ సమాచారం ఆటోమేటిక్‌గా ఐటి వారికి వెళ్లదు. బాండ్ల కొరకు వెచ్చించిన సొమ్ము కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌లో చూపబడుతుంది. ఇందులో బదిలీ అయ్యేదంతా తెల్లధనమే అయినందున కావలసినంత పారదర్శకత ఉంటుందన్నది ప్రభుత్వ అంచనా. అయితే ఇది పూర్తిగా పారదర్శకమా?నల్లధనం పాత్ర అంతమవుతుందా?ఏ దాత ఏ పార్టీకి ఎంత విరాళమిచ్చాడో తెలిసే అవకాశం లేనందున, ఇప్పుడున్న కొద్దిపాటి పారదర్శకత కూడా లేకుండా పోతుందని మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఒకరు అభిప్రాయపడినట్లు ఒక పత్రిక వార్త. పైగా దాతలు ప్రభుత్వంనుంచి వేధింపులకు గురయ్యే అవకాశముంది. దాతలపేర్లు బ్యాంకులో లభ్యమవుతాయి. కాబట్టి, ఎవరు బాండ్లు కొన్నారో, ఏ పార్టీకి ఇచ్చారో తెలుసుకునే అవకాశం ఆర్థిక శాఖ వారికి ఉంటుంది. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని పాలక పార్టీవారు ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ విరాళమిచ్చిన దాతలను వేధించే అవకాశం ఉంటుంది. ఆ కారణాన ప్రతిపక్షాలకు విరాళాల మొత్తం తగ్గిపోవచ్చునన్నది బలమైన సందేహం. పూర్తిగా తెల్ల ధనమే విరాళంగా ఇచ్చేటప్పుడు చెక్కుద్వారా చెల్లింపును కంపల్సరీ చేయవచ్చు కదా లేదా పార్టీ ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేయవచ్చు కదాఈ బాండ్ల చికాకు ఎందున్నది మరో సందే హం.
అయితే నల్లధనం పాత్ర లేకుండా పోతుందనేది భ్రమ. కంపెనీలు, వివిధ వ్యాపార తరగతులు, అధికారంలోని రాజకీయ నాయకులు నల్లధనం ఆర్జించటం మానుకున్నప్పుడే అది సాధ్యం. ఏమైనా, ఇదొక ప్రయోగం. నిజం నిలకడమీద తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com