Home > Bhakti > అప్రతిష్ట మూట కట్టుకుంటున్న బాసర ఆలయం

అప్రతిష్ట మూట కట్టుకుంటున్న బాసర ఆలయం

వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు
గ్రహణం రోజున కుడా యధావిధిగా శ్రీకాళహస్తీశ్వరాలయం

basara-temple-apduniaచదువుల తల్లి సరస్వతిమాత కొలువుదీరిన బాసర ఆలయంలో వరుసగా జరుగుతున్న అపశృతులు ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నాయ. కొంతమంది వ్యక్తుల కారణంగా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. ఇటీవల ఆలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులతో ఆరాధింపబడుతున్న సరస్వతిదేవి ఆలయంలో.. ఆ అమ్మవారికి నిత్య పూజలు చేసే అర్చకులే అపచారాలకు కేంద్ర బిందువులవుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతిదేవి ఆలయానికి ప్రతీరోజు తెలంగాణ రాష్ట్రం నుండేకాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు, చిన్నారులకు అక్షర స్వీకారాలు చేయించేందుకు తరలివస్తుంటారు. ఆలయ ప్రాభవం విస్తరించడంతో భక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఆలయానికి భారీసంఖ్యలో కట్నకానుకలతోపాటు పెద్ద మొత్తంలో విరాళాలు సమకూరుతున్నాయి. ఆలయ విశిష్టత పెరగడం.. ఆదాయం నాలుగింతలు కావడంతో అమ్మవారిని పూజించే పూజారుల కళ్ల్లు నగదు, కట్నకానుకలపై పడ్డాయన్న విమర్శలున్నాయి.

గతంలో అమ్మవారి నగలను, కానుకల పేరిట నగదును అర్చకులతోపాటు ఆలయ సిబ్బంది స్వాహాచేసిన సంఘటనలూ ఉన్నాయి. దీనికితోడు ఆలయ సమీపంలోని దుకాణాల టెండర్లతోపాటు ఆలయ నిర్వహణ పనులు, లడ్డూ తయారీ లాంటి విషయాల్లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఈవోను నియమించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదు.బాసర సరస్వతిదేవి ఆలయంలో పనిచేస్తున్న దాదాపు 24 మంది అర్చకుల మధ్య భేదాభిప్రాయాలు, గ్రూపు తగాదాల కారణంగానే ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అర్చకులు పూజా కార్యక్రమాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో భక్తుల నుండి బలవంతపు కానుకలు తీసుకుని వాటిని హుండీలో వేయకుండా తమ సొంతానికి వాడుకుంటుండడం వివాదాలకు కారణమవుతోంది. అర్చకుల గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య ధోరణితో ఆలయంలో పూజావిధానానికి, నైవేద్య వితరణకు సైతం ఆటంకాలు ఎదురవుతున్నాయి.

అర్చకుల మధ్య సమన్వయం లేకపోవడం, ఆలయ ప్రతిష్టకు శాపమవుతోంది. ఆలయ నిర్వహణలో అడుగడుగునా రాజకీయ జోక్యం మితిమీరిపోతుందన్న విమర్శలు వినవస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పరోక్షంగా ఆలయ పాలన వ్యవహారాలను శాసిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కొంతమంది అర్చకులు, సిబ్బంది అంతా తామై వ్యవహరిస్తూ సించే స్థాయికి ఎదిగారన్న అభిప్రాయాలున్నాయి. వీరిని కాదని ఎవరైనా ప్రవర్తిస్తే ఇక వారికి ఆలయంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కకుండా చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఎలాంటి బదిలీలు లేకుండా చాలామంది సిబ్బంది దీర్ఘకాలం నుండి ఇక్కడే తిష్టవేసుకుని అవినీతి వ్యవహారాలకు అండగా నిలుస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యమే.అమ్మవారి ఆలయానికి సంబంధించి దాదాపు 170 ఎకరాల వరకు భూములున్నట్లు సంబంధిత అధికారుల వద్ద ఉన్న రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో బాసరతోపాటు ధర్మాబాద్ సమీపంలోని బాలాపూర్, కుభీర్, తానూర్, భైంసా ప్రాంతాల్లో భూములున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

అయితే ఈ భూముల్లో చాలా ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు సమాచారం. భూములపై సరైన నియంత్రణ లేకపోవడం, రికార్డులు సైతం కొన్నిచోట్ల గందరగోళంగా ఉండడం కబ్జాదారులకు వరంగా మారుతోంది. బాసర, బాలాపూర్‌లోని విలువైన భూములు ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన పలువురు అర్చకుల గుప్పిట్లో ఉన్నట్లు సమాచారం. పథకం ప్రకారం వీరే ఆయా భూములపై కోర్టు స్టే తీసుకువచ్చి ఆ భూములను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలబాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌కుమార్ ఇక్కడి అమ్మవారి ఉత్సవ మూర్తిని నల్గొండ జిల్లా దేవరకొండకు రహస్యంగా తరలించిన వివాదం… చివరికి ముక్తాయింపు ఇచ్చారు. వ్యవహారంలో ఇద్దరు పూజారులను విధుల నుండి తొలగించగా మరో ఇద్దరు ఆలయ ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీచేశారు. ఈ సంఘటనపై అధికారులు తీసుకున్న చర్యలు సైతం అనుమానాలకు తావిస్తోంది. ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేయగా దేవతా విగ్రహాలను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందిపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.బాసర సరస్వతిదేవి ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలు ఇక్కడి ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. ఏళ్లనుండి అర్చకులు ఇక్కడే తిష్టవేయడం, వీరికి ఎలాంటి బదిలీలు లేకపోవడం గుత్త్ధాపత్యానికి ఆస్కారమిస్తోంది. వీరంతా స్థానికులే కావడంతో అధికారులు, సిబ్బంది సైతం వీరికి అడ్డుచెప్పలేని పరిస్థితి నెలకొందంటున్నారు. అలాగే ఆలయంలోని కొంతమంది ఉద్యోగులు సైతం అర్చకులతో అంటకాస్తూ గుట్టుచప్పుడు కాకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *