Home > Editorial > బెగ్గింగ్ మాఫియా

బెగ్గింగ్ మాఫియా

వన్ నేషన్ .. వన్ ఎలక్షన్స్
ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు

Hyderabad 13th March 2015. Story pix. on Beggrsబాబ్బాబ్బాబు.. చేతులు చాస్తూ ఓ ముదుసలి! అమ్మా.. అయ్యా.. ఒక్క రూపాయి.. చుట్టూరా తిరుగుతూ ఓ కుర్రాడు..! చంటిదానికి తిండి లేదయ్యా.. చంకన పిల్లతో దీనంగా ఓ మహిళ!! ..భాగ్యనగరంలో ఏ కూడలి వద్ద చూసినా ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. కానీ ఇలా అడుక్కునేవారిలో చాలామంది ‘నకిలీ’లే అన్న సంగతి మీకు తెలుసా? వీరిని ముందుంచి బిచ్చం పేరుతో బిజినెస్‌ చేస్తున్న మాఫియా గురించి విన్నారా? ఈ బెగ్గింగ్‌ మాఫియా టర్నోవర్‌ ఏటా ఏకంగా రూ.100 కోట్లపైనే ఉందంటే నమ్ముతారా? నమ్మలేని ఈ వాస్తవాలే కాదు.. వీరిలో కాస్తా ఒడ్డూపొడుగు ఉన్న యువకులను సెటిల్‌మెంట్లు, దందాలకు వాడుకుంటున్న ఫైనాన్షియర్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బెగ్గర్స్‌ ఫ్రీ ఫెడరేషన్‌ సర్వే ఈ సంచలన అంశాలను వెల్లడించింది. చివరికి బిచ్చమెత్తుకునే మహిళల చేతుల్లో కనిపిస్తున్న పసిపాపలూ వారి పిల్లలు కాదని తేలింది. అందుకు సాక్ష్యమే ఈ చిత్రం. ఈ మహిళ ఒడిలో కనిపిస్తున్న చిన్నారితో ఈమెకు ఎలాంటి సంబంధం లేదు. ‘ఈ చిన్నారి మీ పాపేనా? ఏం పేరు? ఎందుకు పడుకుంది’ అని సాక్షి ఆమెను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పింది. చివరికి చిన్నారి తమ పాప కాదని, ఉదయం 7 గంటలకు బెగ్గర్‌ లీడర్‌ పాపను తెచ్చిస్తాడని, సాయంత్రం మళ్లీ తీసుకెళ్తాడని చెప్పింది. పాపకు ఆకలి లేకుండా నిద్రమత్తులోనే ఉండేందుకు చిన్న డ్రాప్స్‌ బాటిల్‌ ఇస్తారని తెలిపింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బెగ్గింగ్‌ మాఫియా విజృంభిస్తోంది. అవసరాల్లో ఉన్నవారిని, ఆపదల్లో ఉన్నవారిని పట్టుకొచ్చి యాచక ‘కూలీ’లుగా మార్చుతోంది. కొంత సొమ్ము అప్పుగా ఇచ్చి.. తీర్చేందుకు భిక్షాటన చేయిస్తోంది. రోజూ ఇంత ‘వసూలు’ చేయాలంటూ టార్గెట్లు పెడుతూ వచ్చిన దాంట్లో ఎంతోకొంత చేతిలో పెడుతోంది. టార్గెట్‌ మేరకు డబ్బులు తేకపోతే హింసిస్తోంది.
హైదరా బాద్‌ లో సుమారు 14 వేల మంది యాచకులున్నారని.. అందులో 90 శాతం ఇలాంటి నకిలీ బెగ్గర్లేనని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీవోస్‌ ఫర్‌ బెగ్గర్‌ఫ్రీ సొసైటీ’సర్వే లో వెల్లడైంది. ఏ దిక్కూ లేకనో, కుటుంబాన్ని పోషించుకునేందుకో అడుక్కునేవారు నాలుగైదు వందల మందే ఉంటారని గుర్తించింది. ఇక యాచకులుగా ‘పని’చేస్తున్నవారిని బెగ్గింగ్‌ మాఫియా అసాంఘిక కార్యకలాపాలకూ వినియోగిస్తోందని… ‘సుపారీ’ దాడుల దగ్గరి నుంచి గంజాయి, డ్రగ్స్‌ విక్రయించడం దాకా చాలా పనులకు వినియోగిస్తోందని తేలింది.

14 వేల మందికిపైనే..
హైదరాబాద్‌లోని కూడళ్లు, పార్కులు, థియేటర్లు, దుకాణాల సముదాయాలు ఇలా ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇలాంటివారి సంఖ్య 14 వేలకుపైనే. కానీ ఇందులో నిజమైన యాచకులు నాలుగైదు వందల మంది మాత్రమే. మిగతా వారంతా బెగ్గింగ్‌ మాఫియాలో ‘రోజు కూలీలు’. బెగ్గింగ్‌ ముఠాను నిర్వహించేవారి దగ్గర వీరంతా ‘పని’చేస్తారు. వారికి అప్పగించిన ప్రాంతాన్ని బట్టి రోజూ రూ. 400 నుంచి రూ.600 వరకు ‘వసూలు’చేస్తారు. ముఠా లీడర్లు ఆ సొమ్మును తీసుకుని.. రోజూ రూ.100 నుంచి రూ.200 వరకు యాచకులకు ఇస్తారు.

ఈ ‘వసూళ్ల’టార్గెట్లు, ‘కూలీ’మొత్తం కూడా ఒక్కో కూడలికి, పార్కులు, బస్టాండ్లను బట్టి మారుతుంది. మొత్తంగా బెగ్గింగ్‌ మాఫియాకు హైదరాబాద్‌వ్యాప్తంగా ఏటా రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు ‘చిల్లర’ సమకూరుతోందని స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్‌ సర్వే లో వెల్లడైంది. సుమారు 10 వేల మంది యాచకులు రోజూ రూ.400 చొప్పున వసూలుచేసి ఇస్తున్నారని.. అంటే రోజూ రూ.40 లక్షలకుపైగా మాఫియాకు ఆదాయం వస్తోందని తమ అధ్యయనంలో గుర్తించింది.

వీరిది అవసరం.. వారిది వ్యాపారం
ఈ ఫెడరేషన్‌కు చెందిన 300 మంది ప్రతినిధులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకేసారి విస్తృతంగా సర్వే నిర్వహించారు. అసలు యాచకులు ఎంతమంది, వారిలో ఎన్ని రకాల వారున్నారు, ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారు, ఏ మేరకు దందా సాగుతోందన్న అంశాలను పరిశీలించారు. మూడు రకాల యాచకులు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు.

ఏ దిక్కూ లేనివారు..
మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఆరోగ్యం దెబ్బతిని ఏ పనీ చేయలేకపోవడం వంటి దుస్థితిలో ఉన్నవారు మొదటి రకం యాచకులు. తమ వారెవరూ లేకపోవడం లేదా కుటుంబాలు ఉన్నా వీరిని పట్టించుకోకపోవడంతో భిక్షమెత్తుతున్నారు. ఇలాంటి వారిని శిబిరానికి తరలించి సహాయం చేయాల్సి ఉంటుందని స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్‌ గుర్తించింది.
అవసరానికి యాచించేవారు. కుటుంబంలో వివాదాలు, వ్యవసాయం, వ్యాపారంలో తీవ్ర నష్టాల పాలై గతిలేని స్థితిలో భిక్షాటన చేస్తున్నవారు రెండో రకం. వీరికి తగిన కౌన్సెలింగ్‌ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. తిరిగి సాధారణ జీవితం గడపగలరని ఫెడరేషన్‌ తేల్చింది.

భిక్షాటనే వ్యాపారంగా..
కుటుంబం, ఆస్తులు అన్నీ ఉన్నా.. భిక్షాటననే వ్యాపారంగా మలుచుకునేవారు మూడోరకం. వీరు కష్టపడకుండా డబ్బు సంపాదించేందుకు బెగ్గింగ్‌ మాఫియాగా అవతరించారు. ముఠాలు ఏర్పాటు చేసి భిక్షాటన చేయించడం, ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం చేయడంతో పాటు గంజాయి/డ్రగ్స్‌ విక్రయించడం, ఫైనాన్స్‌ సంస్థలకు సెటిల్‌మెంట్లు చేసిపెట్టడం వంటివీ వీరు చేస్తున్నట్లు గుర్తించారు.

పసిపిల్లలకు ‘నరక’యాచన!
అన్నెం పున్నెం ఎరుగని పసి పిల్లలను బెగ్గింగ్‌ మాఫియా నరక యాతనకు గురి చేస్తోంది. చిన్న పిల్లలు ఉంటే ఎక్కువగా భిక్షమేస్తారన్న ఉద్దేశంతో రెండేళ్లలోపు చిన్నారులను దీనికి వినియోగిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌కు వలస వచ్చే నిరుపేద కుటుంబాలకు వల వేసి వారి పిల్లలను భిక్షాటన కోసం వినియోగించుకుంటున్నారు. రోజుకు రూ.100 నుంచి రూ.150 చొప్పున ఇస్తున్నారు. ఇలా రెండు మూడు వందల మంది చిన్నారులను తీసుకువచ్చి.. మహిళా యాచకులకు అప్పగించి, భిక్షాటన చేయిస్తున్నారు.

♦ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, థియేటర్లు, దేవాలయాలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరిగే ప్రాంతాలకు ఈ మహిళా యాచకులను పంపుతున్నారు.
♦ పిల్లలు ఏడవకుండా, ఏడెనిమిది గంటల పాటు నిద్రలోనే ఉండేలా వారికి నల్లమందు చుక్కలు వేస్తున్నారు. మహిళా యాచకులు ఆ పిల్లలను చూపుతూ అడుగుతుండడంతో.. చాలా మంది డబ్బులు వేస్తుంటారు.
♦ కొందరు బెగ్గింగ్‌ లీడర్లు చిన్నారులు నిద్రలోనే ఉండేలా రెండు, మూడు గంటలకోసారి ప్రమాదకరమైన డ్రగ్స్‌ వేస్తున్నట్టు స్వచ్ఛంద సంస్థలు గుర్తించాయి. ఆ డ్రగ్స్‌ వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల అస్తవ్యస్తమవుతుందని నిర్ధారించాయి. ముఖ్యంగా ఆడపిల్లలు పది పన్నెండేళ్లలోపే రజస్వల కావడం, శారీరకంగా ఇబ్బందులు వంటివి తలెత్తుతాయని గుర్తించారు.

అప్పులిచ్చి.. భిక్షాటన చేయించి..
బెగ్గింగ్‌ మాఫియా లీడర్లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు కొంత సొమ్మును అప్పుగా ఇస్తున్నారు. ఆ అప్పు తీర్చేందుకు ‘యాచక కూలీ’లుగా పెట్టుకుంటున్నారు. తర్వాత అప్పు తీర్చాలని ఒత్తిడి చేస్తూ ఆ కుటుంబాల్లోని మహిళలను, ఆడపిల్లలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లుగా జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన సర్వేనివేదికలో స్వచ్ఛంద సంస్థల ఫెడరేషన్‌ పేర్కొంది.

♦ హైదరాబాద్‌లో భిక్షాటన చేస్తున్న సుమారు 14 వేల మందిలో కేవలం నాలుగైదు వందల మంది మాత్రమే మొదటి, రెండో రకం యాచకులు కాగా.. మిగతా వారంతా నకిలీ యాచకులేనని గుర్తించారు.
♦ బెగ్గింగ్‌ మాఫియా లీడర్లు, ఫైనాన్షియర్ల వేధింపులు, ఒత్తిళ్లతో చాలా మంది యాచకులుగా మారుతున్నారని తేల్చారు.

‘భిక్షం’ కోసం దుకాణాలతో ఒప్పందాలు!

సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌లో జరిగిన వ్యవహారం.. బెగ్గింగ్‌ మాఫియా విశ్వరూపానికి ఓ మచ్చుతునక. కొద్దినెలల కింద ఇక్కడ యాచకులంతా కలసి దుకాణాల వద్ద చేరి యాచిస్తూ, ఇవ్వకపోతే గొడవపడుతూ హంగామా సృష్టించారు. దీంతో బెగ్గింగ్‌ మాఫియాకు, దుకాణాల యజమానులకు ‘ఒప్పందం’కుదిరింది. సోమవారం కొన్ని దుకాణాలు, మంగళవారం కొన్ని దుకాణాలు.. ఒక్కో దుకాణం వారు ఒక్కో రోజు భిక్షం ‘వేసేలా’ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రోజు రూ.5 నుంచి రూ.10 వరకు భిక్షంగా ఇవ్వాల్సిందే! బెగ్గింగ్‌ మాఫియా టర్నోవర్‌ భారీగా పెరగడానికి ఇలాంటి ఒప్పందాలూ కారణమే.

ఇంట్లోకి వెళ్లాలంటే.. అడుక్కోవాల్సిందే..!
గురువారం ఉదయం 8 గంటలు.. హైదరాబాద్‌ శివారులోని సుచిత్ర చౌరస్తాలో ఓ 55 ఏళ్ల వ్యక్తి భిక్షాటన చేస్తున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆయన దగ్గరికి వెళ్లి.. తమ ఆశ్రమానికి తీసుకెళ్తాం రమ్మని అడిగారు. కానీ రానని, రావడం తనకిష్టం లేదని వాదించాడు. ఎందుకు రావని సంస్థ ప్రతినిధులు పదే పదే అడగడంతో.. తన బాధను వెల్లగక్కాడు. తాను ఒకప్పుడు హెచ్‌ఎంటీ సంస్థలో పనిచేసేవాడినని, సొంత ఇల్లు, కొడుకు, కోడలు అంతా ఉన్నారని చెప్పాడు. తాను డబ్బులు తీసుకెళితేగానీ వారు ఇంట్లోకి రానివ్వరని, తిండి పెట్టరని ఆవేదన వ్యక్తం చేశాడు. రోజూ యాచిస్తే నాలుగైదు వందల వరకు వస్తాయని.. ఆ సొమ్మంతా బెగ్గర్స్‌ లీడర్‌ తీసుకుని తనకు రూ.100 ఇస్తాడని.. ఈ సొమ్ము తీసుకెళ్లి ఇంట్లో ఇస్తానని చెప్పాడు.

మేమే బాధ్యత తీసుకుంటాం
హైదరాబాద్‌లో నిజమైన యాచకులు 400 మంది వరకు మాత్రమే ఉంటారు. ఉపాధి చూపిస్తే కొంతమంది సెటిలవుతారు. మిగతా వారిని మా స్వచ్ఛంద సంస్థలో పెట్టి బాగుచేస్తాం. 60 వారాల పాటు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులతో కలసి బెగ్గింగ్‌ నిర్మూలనకు పనిచేశాం. కానీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో ఫలితం రాలేదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేకంగా బెగ్గర్‌ రిహాబిలిటేషన్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలి. జీహెచ్‌ఎంసీ, పోలీసు, జైలు అధికారులు, మీడియా, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి నకిలీ యాచకులను ఏరివేయవచ్చు. ప్రస్తుతం నకిలీ బెగ్గర్లు డ్రగ్స్, గంజాయి వంటివి విక్రయించే స్థాయికి వెళ్లారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే.. సహకరించడానికి 100కుపైగా ఎన్జీవోలు సిద్ధంగా ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *