Home > Editorial > ఇండియాలో క్యాష్ లెస్ ఎకానమీ సాధ్యమా…

ఇండియాలో క్యాష్ లెస్ ఎకానమీ సాధ్యమా…

రాహుల్ లో కనిపిస్తున్న పరిణితి
సుప్రీం తీర్పుతో రాముడికి రామ్...రామ్..

narendra-modi-apduniaరోజు రోజుకూ జేబులోని పర్సు బరువు మాత్రం తగ్గిపోతోంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల ఎంత వరకూ సాకారం అవుతుందో చెప్పలేం కానీ, ఇప్పటికి మాత్రం ఇది వింతగానూ, విడ్డూరంగానూ కనిపిస్తోంది. నిజానికి నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడమనే కల భారతదేశంలాంటి దేశంలో దాదాపు అసంభవం, అసాధ్యమనే అనిపిస్తుంది. ఇక్కడ సగానికి సగం గ్రామాలకు నగరాలతో అనుసంధానం కూడా లేదు. వేలాది గ్రామాలు ఇంతవరకూ సరైన రోడ్లకు నోచుకోలేదు. విద్యుచ్ఛక్తి, తాగు నీరు లేని గ్రామాలు కూడా కోకొల్లలు. ఈ గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ఇక 134 కోట్ల జనాభాలో 34 శాతం మందికి ఇంటర్‌నెట్‌ అంటే ఏమిటో తెలియదు. అంటే దేశంలో సుమారు 86.5 కోట్ల మంది ప్రభుత్వం చెబితే వినడమే తప్ప ఏనాడూ ఇంటర్నెట్‌ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాఖలాలు లేవు. నగరాలు, పట్టణాల్లో సైతం లక్షలాది మందికి ఇంటర్నెట్‌ గురించి, డిజిటల్‌ వ్యాలెట్ల గురించి ఒక్క అక్షరం ముక్క కూడా తెలియదంటే ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.ఇటువంటి ప్రజలు నగదు రహితానికి అలవాటు పడడం ఎంత వరకూ సాధ్యం? భారతదేశం లాంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి భారీ మార్పులు రాత్రికి రాత్రి జరిగిపోవు. పైగా ఏమాత్రం సన్నద్ధత లేకుండా జరిగిపోవాలంటే కుదిరే పని కాదు. నగరాలు, పట్టణాల్లో ఈ మార్పు కాస్తంత వేగంగా చోటు చేసుకోవచ్చు కానీ, అత్యధిక జనాభా ఉన్న గ్రామీణ భారతదేశంలో మాత్రం ఇది ఇప్పట్లో జరిగే పని కాదు. ఇంటర్నెట్‌, యాప్స్‌, డిజిటల్‌ వంటి అంశాల గురించి తెలుసుకోవడం గ్రామీణులు, రైతులకు ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు. దీనికి ఏళ్లూ పూళ్లూ పట్టడం ఖాయం. ఈ పేద ప్రజలు, ఈ రైతులు, ఈ గ్రామీణులు నగదును పక్కనపెట్టి ప్లాస్టిక్‌ నగదులోకి మారడం కొద్ది రోజుల్లోనే సాధ్యమని ప్రధాని ఎలా ఊహించారు?డిజిటల్‌ నగదు గురించి తెలుసుకోవాలన్నా, డిజిటల్‌ నగదును ఉపయోగించాలన్నా ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. సుమారు రెండేళ్ల క్రితం ప్రపంచ బ్యాంక్‌ స్థాయిలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, 53 శాతం మంది భారతీయులకు మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. అందులోనూ 43 శాతం మంది ఖాతాదార్లు తమ ఖాతాలను దాదాపు ఏడాది నుంచి ఉపయోగించడం లేదు. అంటే, ఆ బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు జరగడం గానీ, డబ్బులు వేయడం గానీ, తీయడం గానీ జరగడం లేదన్న మాట. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజలంతా డిజిటల్‌ నగదు వైపు మళ్లడమంటే సాధ్యమయ్యే పనేనా? దాదాపు ఏడాదిగా నిద్రాణంగా ఉన్న బ్యాంకు ఖాతాలతో డిజిటల్‌ నగదు లావాదేవీలు జరగడమంటే మాటలా? ఎప్పుడో ఏడాది తరువాత తవ్వబోయే బావి ముందు ఇప్పటి నుంచే నీటి కోసం క్యూలో నిలబడాలన్నట్టుగా ఉంది.దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా దిశగా నడిపించదలచుకున్నప్పుడు ఇది దశల వారీగా జరగాల్సి ఉంటుంది. ముఖ్యంగా దేశంలోని గ్రామాలన్నిటికీ కనెక్టివిటీను పెంచాల్సి ఉంటుంది. బ్యాంకుల పట్ల అవగాహన కలిగించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ గురించి తెలియజెప్పాల్సి ఉంటుంది. ఇంత జేసినా నగదు రహిత లావాదేవీలు పూర్తిగా జరుగుతాయన్న నమ్మకం లేదు. కొంత నగదు జేబులో ఉండడం అనేది అనివార్యమవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు, రైతులు, గ్రామీణులు, గిరిజనులు, దళితులలో అక్షరాస్యత పెరగాల్సి ఉంది. కేవలం అరకొర ఆరోగ్య సంరక్షణ, పాఠశాల విద్య, మౌలిక సదుపాయాలు మాత్రమే ఉన్న దేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనేది ఆకాశానికి నిచ్చెనలు వేయడం చందంగానే ఉంటుంది. అన్ని దేశాలలో మాదిరిగానే భారతదేశంలో కూడా బాగా డిమాండ్‌ ఉండడం వల్లే నగదు చెలామణీలో ఉంది. దానికి డిమాండ్‌ లేకుండా ఉండి ఉంటే రిజర్వ్‌ బ్యాంక్‌ దాన్ని ముద్దించేదే కాదు. ఇటువంటి నగదుకు కొరతను సృష్టించడం వల్ల ప్రజలు ప్రత్యామ్నాయాల దిశగా పరుగులు పెడతారని ప్రభుత్వం ఊహించి ఉంటుంది. అయితే, సరైన ప్రత్యామ్నాయాలే లేనప్పుడు ప్రజలు సహజంగానే నానా కష్టాలూ పడడం జరుగుతుంది. ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా నగదు రహితానికి ప్రయోగాలు, ప్రయత్నాలు జరిగాయి కానీ, అక్కడ కూడా ఈ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలించలేదు. అటువంటిది వర్ధమాన దేశాల్లో ఏ విధంగా ఫలిస్తుందన్నది ఆలోచించాల్సిన విషయమే. భారత స్థూల జాతీయోత్పత్తిలో నగదు చెలామణీ 10.5 శాతం వరకూ ఉంది. ఆ స్థాయిలో ఉన్న నగదు చెలామణీని ఒక్కసారిగా ఆపేయడం ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందే తప్ప ఏమాత్రం పుష్టినివ్వదు. కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్‌ బ్యాంకు వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వ్యవస్థలు ఉంటే తప్ప ఈ నగదు రహిత ప్రయోగం ముందుకు పోయే అవకాశం లేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవసరమైనంత నగదును చెలామణీలోకి తీసుకు రావడం ఇందులో మొదటిది. ప్రస్తుతానికి మాత్రం అటువంటి ప్రణాళికేదీ ఆర్థిక శాఖ, రిజర్వు బ్యాంకుల వద్ద సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.నోట్ల రద్దు అనేది అంత తేలికగా అమలు జరిగే అవకాశమే ఉంటే అన్ని అభివృద్ధి సూచీల్లోనూ అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఈ పని చేసేది కాదా? జపాన్‌, అమెరికా, యూరోపియన్‌ కమ్యూనిటీ తమ నోట్లను తాము యథా ప్రకారం ముద్రించుకుంటూనే ఉంటున్నాయి తప్ప ఏనాడూ నోట్లను రద్దు చేసే సాహసం చేయలేదు. సంస్కరణలను వేగవంతం చేయాలన్న కోరికతో ప్రధాని హడావిడిగా నోట్ల రద్దును చేపట్టినట్టు కనిపిస్తోంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనే మాటను ప్రపంచం ముందుకు తెచ్చిన ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త కెనెత్‌ రోగాఫ్‌ కూడా ఈ చర్యను ముందుగా అభ వృద్ధి చెందిన దేశాలు చేపట్టాలనే సూచించాడు. పైగా నోట్ల రద్దు అనేది ఆరేడేళ్లు సాగాల్సిన ప్రక్రియ అని కూడా చెప్పాడు. ఇది ఒక్క రోజులో పూర్తయ్యే కార్యక్రమం అని ఆయన కూడా ఎక్కడా చెప్పలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *