Home > Editorial > ఆధార్ వ్యక్తిగత వివరాలకు చెక్

ఆధార్ వ్యక్తిగత వివరాలకు చెక్

టీ కప్పులో సుప్రీం తుఫాను
మొబైల్ ఫోన్లలో దూరిన మనిషి

aadhaar-apduniaపౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో, ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) కొత్త భద్రతా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవలే ఒక పాత్రికేయురాలు ఆధార్ వివరాలను సులభంగా పొందవచ్చునని ఆధారాలతో వెల్లడించడం సంచలనం రేపింది. ఈలోగా ఆర్‌బీఐ అధ్యయనంలో కూడా ఆధార్ వివరాలు వ్యాపారులకు, శత్రువర్గాల కు చేరవచ్చుననే అభిప్రాయం వ్యక్తమైంది. యూఐడీఏఐ ప్రవేశపెడుతున్న కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకున్నది. కొత్త విధానం ప్రకారం- పౌరుడి వ్యక్తిగత వివరాలకు రెండురకాలుగా భద్రత లభిస్తుందని తాజా వార్తలను బట్టి తెలుస్తున్నది. ఆధార్ నంబర్ పొందాలంటే ఇప్పటి వరకు మనం కంటి రెటీనా, వేలిముద్రలు మాత్రమే ఇచ్చేవాళ్లం. ఇకపై ముఖ గుర్తింపు (ఫేషియల్ అథెంటికేషన్) కూడా చేసుకోవాలి. ఈ మేరకు ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్తగా ఫేషియల్ అథెంటికేషన్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో ప్రజలకు వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకే ఈ కొత్త విధానాన్ని కూడా తీసుకువస్తున్నట్లు యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.ముఖ గుర్తింపు ఫీచర్‌ను వేలిముద్రలు, ఐరిస్ లేదా ఓటీపీల్లో ఏదో ఒకదానితో కలిపి పనిచేసేలా తీర్చిదిద్దుతున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది. చాలా మంది వృద్ధులు, ఎక్కువగా పనిచేసేవారు తమ వేలిముద్రలను కోల్పోతున్నారు. అలాంటి వారికి బయోమెట్రిక్ గుర్తింపు పరీక్ష కష్టమైపోతోంది. కొన్ని సమయాల్లో అసలు వారి వేలిముద్రలు పనిచేయడం లేదు. ఇలాంటి వారికి ముఖ గుర్తింపు ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని యూఐడీఏఐ తెలిపింది.ఇదిలా ఉంటే.. ఆధార్ సిస్టమ్‌లో భద్రపరిచిన వేలిముద్రలు, ఐరిస్ డాటాను దొంగిలించడం అసాధ్యమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవలే భరోసా ఇచ్చారు. ‘ఆధార్ సిస్టమ్‌లో నా వేలిముద్రలు, ఐరిస్‌ను భద్రంగా ఉన్నాయి. కొన్ని లక్షల సార్లు ప్రయత్నించినా దొంగిలించలేనంత భద్రంగా ఉన్నాయి. అదీ ఇండియన్ టెక్నాలజీ అంటే’ అని ఆయన వివరించారు. ఆధార్ డాటా చోరీకి గురైందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.ఆధార్ వివరాలను బ్యాంకులు, టెలికం సంస్థలు మొదలైన వాటికి ఇవ్వవలసి వస్తున్నది. వీటి ద్వారా పౌరుడి వ్యక్తిగత వివరాలు బయటకు పొక్కే అవకాశం ఉన్నది. అందువల్ల వినియోగదారుడు ఆధార్ నెంబర్ ఇవ్వకుండా, వర్చువల్ ఐడీని అందించవచ్చు. ఇష్టం వచ్చినప్పుడు ఎన్నిసార్లయినా ఆ వర్చువల్ ఐడీని మార్చుకోవచ్చు. కొత్త వర్చువల్ ఐడీ తీసుకుంటే, పాతది రద్దయిపోతుంది. ఆధార్ మూల నెంబర్ నిక్షిప్తమై ఉంటుందే తప్ప బయటికి తెలువదు. ఇది మొదటి భద్రతా విధానం. వర్చువల్ ఐడీతోపాటు అన్ని వివరాలను కాకుండా పేరు, చిరునామా, ఫొటో అందిస్తే సరిపోతుందనేది రెండవ భద్రతా విధానం. ఈ రెండు విధానాల వల్ల వ్యాపార సంస్థలు తమ వినియోగదారుల వివరాలను పూర్తిగా సేకరించలేవు. అందువల్ల పౌరుడి వ్యక్తిగత వివరాలు బయటికి పొక్కే అవకాశం ఉండదనేది యూఐడీఏఐ అభిప్రాయమై ఉంటుంది. ఆధార్ వివరాలు గోప్యంగా లేవని తాజాగా ఒక పాత్రికేయురాలు నిరూపించిన నేపథ్యంలో ఈ గోప్యతా వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల ఒక పాత్రికేయురాలు ఐదు వందల రూపాయలు చెల్లించడం ద్వారా అతి సులభంగా ఆధార్ వివరాలు సేకరించవచ్చునని వెల్లడించింది. ఇందుకు తాను సేకరించిన విధానాన్ని వివరించింది. ఈ వార్తాకథనం వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వం ఆధార్ గోప్యతను కాపాడటం ఎట్లా అనే విషయమై కూలంకష అధ్యయనం జరిపి, తగు జాగ్రత్తలు చేపట్టవలసింది. కానీ పాత్రికేయురాలిపైన, ఈ కథనాన్ని ప్రచురించిన ఆంగ్ల పత్రికపైన చర్యల కోసం కేసు నమోదుచేసింది. ఇది పత్రికాస్వేచ్ఛకు భంగకరమంటూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈలోగా ఆర్బీఐ అధ్యయ న నివేదిక బయటకు వచ్చింది. ఆధార్ వివరా లు భద్రంగా లేవనేది ఈ అధ్యయన నివేదిక సారాంశం. వ్యాపార సంస్థలు ఏ విలువలకు స్థానం లేకుండా పోటాపోటీగా వ్యవహరిస్తున్న తరుణంలో అవి వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ఆధార్ ద్వారా సేకరించడం కష్టమే మీ కాదు. వ్యాపారులే కాకుండా శత్రువులు కూడా ఒకేచోట అన్ని వివరాలు పొందవచ్చు. ఈ వివరాల ఆధారంగా ఇక్కడి వ్యాపారాలను, పరిపాలనను దెబ్బకొట్టవచ్చునని ఆర్బీఐ నివేదిక పేర్కొన్నది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కొత్త భద్రతా విధానాన్ని ముందుకుతెచ్చింది. కొత్త భద్రతా విధానం వల్ల వ్యాపార సంస్థలకు వ్యక్తిగత వివరాలు అందవు. కానీ ఆధార్ సంస్థ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, పౌరుల వివరాల ను ఇతరులకు అందకుండా భద్రపరుచడం సాధ్యమా అనే సందేహం కూడా ఉన్నది. ప్రభు త్వం ఇంత సమగ్రంగా పౌరుల వివరాలను సేకరించడం అవసరమా అనే ప్రశ్నను కొందరు వేస్తున్నారు. బ్యాంకు ఖాతా మొదలుకొని ప్రతి అవసరానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వం అందరి వివరాలను తన గుప్పెటలో పెట్టుకుంటున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆధార్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనాలు లేవని కాదు. దేశవ్యాప్తంగా పలు సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్న విషయం తెలిసిందే. ఒకే వ్యక్తి ఎక్కువ పేర్లతో సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. బోగస్ పేర్లతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. అవినీతి మూలంగా, పారదర్శకత లేకపోవడం వల్ల పేదరిక నిర్మూలనా పథకాలు ఫలితా లను ఇవ్వడం లేదు. ఆధార్‌కార్డు ద్వారా అవినీతిని, ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టాలనే ప్రయత్నం సాగుతున్నది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పారదర్శకతను ప్రవేశపెట్టడానికి ఆధార్‌ను వినియోగించుకుంటున్నది. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడు ఆరోపణలకు ఆస్కారం ఉండదు. ఆధార్ దేశవ్యాప్తంగా కచ్చితంగా సద్వినియోగం మాత్రమే అవుతుందనే హామీ ఇవ్వలేం. ఈ చర్చ అమెరికాలో కూడా సాగుతున్నది. ప్రభుత్వం తాజా పరిజ్ఞానం తోడ్పాటుతో ప్రజల ప్రతి చర్యను నమోదు చేయాలనే ప్రతిపాదన ఉన్నది. పౌరుడు పంపుకొనే మెసేజ్‌లు, ఎక్కడ ఏయే వస్తువు లు కొనుగోలు చేసిందీ మొదలుకొని ప్రతి ఒక్కటీ నమోదవుతుంది. పౌరులపై మితిమీరిన నిఘా ప్రజాస్వామ్య విరుద్ధమని, నిరంకుశ లక్షణమని విమర్శలు వినబడుతున్నాయి. పౌరుడి సమాచారం దుర్వినియోగం కాకూడదు, పౌరుడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగకూడదనే కోణంలో ఆధార్‌పై చర్చించడం కూడా అవసరం.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *