Home > Editorial > తాడా…పేడా..

తాడా…పేడా..

కాంగ్రెస్ కు పునర్ వైభవం సాధ్యమేనా
వన్ నేషన్ .. వన్ ఎలక్షన్స్

naredramodi-chandrababu-apduniaమోడీ ప్రభుత్వ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆశలను అడియాస చేయటంతో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఎంపిలు సైతం ఆయన ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమంటున్నారు. మరోవైపున, రాష్ట్ర బిజెపి నాయకులు కొంతకాలంగా టిడిపి ప్రభుత్వంపై విమర్శలకు పదునుపెట్టారు. చంద్రబాబునాయుడుకు సంవత్సరంన్నర తర్వాతగాని ప్రధాని నరేంద్రమోడీతో ముఖాముఖి భేటీ అవకాశం లభించకపోవటంతో టిడిపి శ్రేణుల అసంతృప్తి అప్పటికే ఆగ్రహపు అంచులకు చేరి ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయించక పోవటం, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడినప్పటికీ నిధుల మంజూరులో తాత్సారం, రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూ లోటు భర్తీకి అంగీకరించిన సహాయం అరకొరగా విడుదల చేయటం వగైరా మౌలిక అంశాలపై ముఖ్యమంత్రి అప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని, సంబంధిత మంత్రులందరినీ కలిసి విజ్ఞాపనలు సమర్పించినా బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవటం గోరుచుట్టుపై రోకటిపోటులా తగిలింది. ఎన్‌డిఎ కూటమిలో ఉండి ఏమి లాభం? రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోలేనపుడు బయటకు రావటమే మంచిదనే మాటలు వినిపించాయి. తెగతెంపులకు సిద్ధమవుతున్నట్లు లీకు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అధినేత మాత్రం తన అసంతృప్తిని బాహాటపరుస్తూనే, కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, పోరాటం చేసి కోర్కెలు సాధించాలని ఎంపిలను ఆదేశించారు. బిజెపితో తెగతెంపులు చేసుకోవలసివస్తే అధినేత ‘సరైన సమయంలో సరైన నిర్ణయం’ తీసుకుంటారని, ఆ అవకాశాన్ని అట్టేపెట్టుకున్నట్లుగా ముఖ్యమంత్రి తరఫున వ్యూహాత్మక ప్రకటన చేశాడు కేంద్రమంత్రి సుజనాచౌదరి. ఆదివారం ఎంపిల సమావేశం ముగుస్తుండగా, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేశారట. ఏమైతేనేం, కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా టిడిపి ఎంపిలు సోమవారం పార్లమెంటు ఆవరణలో ప్లెకార్డుల ప్రదర్శన చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు రాబట్టుకోవాలెగాని ఎన్‌డిఎ నుంచి బయటకువచ్చి ఏం లాభం అన్న భావన చంద్రబాబు నాయుడిలో ఉంది. బిజెపి మిత్రపక్షం శివసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో టిడిపి కూడా వైదొలిగితే బిజెపి ప్రతిష్ట దిగజారుతుందని పరోక్ష హెచ్చరికగానె ఆయన తెగతెంపుల పదాలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లో బిజెపితో ప్రయాణం కొనసాగించటం లాభమా, నష్టమా అన్న మీమాంసలో చంద్రబాబు నాయుడున్నారు. తాము తెగతెంపులు చేసుకుంటే జగన్ పార్టీ బిజెపి బండెక్కుతుందనే భయాందోళన ఉంది. బిజెపి రాష్ట్ర నాయకత్వం కూడా వైసిపిపై విమర్శలు చేయకపోగా సన్నిహితమవుతున్న సంకేతాలిస్తూ, అలయెన్స్ పక్షం టిడిపిపై మిత్రధర్మం లక్ష్మణరేఖను చెరిపేసి బాహాటంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి రాజకీయంగా తమకు ఏది లాభమో నిర్థారించుకునేవరకు చంద్రబాబునాయుడు సస్పెన్స్ కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదాపై బిజెపితో రాజీపడి ఆయన ఒక మెట్టు కిందకు దిగారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని రాష్ట్రానికి ఏదో ఒరుగుతుందని జనాలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అంకెల గారడీతో అరచేతిలో స్వర్గం చూపారు. నిధులు ఇస్తామంటూ భ్రమల్లోపెట్టి బిగబట్టి గుంజీళ్లు తీయిస్తున్నారు. రాజధానిఅమరావతి నిర్మాణాన్ని వెండితెరపై పంచరంగుల ఊహాచిత్రంగా చూపుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను భ్రమల్లో పెడుతుండగా, డబ్బు మాదిరాజకీయ ప్రయోజనం మీకా అన్నట్లు బిజెపి అవసరమైన నిధులివ్వకుండా చుక్కలు చూపిస్తున్నది. వచ్చే ఎన్నికలకు రాజకీయ బేరసారాలకు ఇదొక ఎత్తుగడ కావచ్చు. ఏమైతేనేం టిడిపి, బిజెపి ప్రయోజనాల ఘర్షణవల్ల రాష్ట్ర అభివృద్ధి నష్టపడుతున్నది. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో సజీవంగా ఉంది. ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసిన టిడిపి, బిజెపిలు రాజకీయ నాటకాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలకు, ప్రత్యేక హోదాకు బదులు అంగీకరించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రబడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవటానికి నిరసనగా ఆ రాష్ట్ర పాలక పార్టీ టిడిపి, ప్రతిపక్షపార్టీలు పార్లమెంటులోపల, వెలుపల ఆందోళన చేస్తుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘బిజెపి తలబిరుసు ధోరణి’ పట్ల ఎట్టకేలకు విమర్శనాస్త్రాలు సంధించింది. వామపక్షాల పిలుపుపై గురువారం ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవంతంగా జరిగింది. వైసిపి,కాంగ్రెస్ బలపరిచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశంపై టిడిపి శ్రేణులు కూడా వేరుగా నిరసన ప్రదర్శనలు జరిపాయి. కేంద్రప్రభుత్వంలో భాగస్వామి అయిన టిడిపి తరఫున మంత్రి సుజనాచౌదరి, సానుకూల స్పందనకొరకు కేంద్రప్రభుత్వానికి 15రోజులు సమయమిస్తున్నామని చెప్పటం బిజెపితోవారి తెరవెనుక చర్చలకు నిదర్శనం. ప్రతిపక్షాల ఆందోళన ఏ రూపం తీసుకుంటుందీ, టిడిపి, బిజెపి రాజీపడతాయా, ఘర్షణ తెగతెంపులకుదారితీస్తుందా అనేవి వచ్చే ఎన్నికలకు ఆయా పార్టీల రాజకీయ వ్యూహం, ఎత్తుగడలపై ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనను టిఆర్‌ఎస్ లోక్‌సభ వేదిక మీద గతంలోలాగే ఇప్పుడూ బలపరిచింది. లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి బుధవారం ప్రసంగిస్తూ తమ పొరుగురాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. అదేసమయంలో, రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటాన్ని గుర్తు చేశారు. కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *