Home > Editorial > మిత్రులే కానీ.. శత్రువులు

మిత్రులే కానీ.. శత్రువులు

మొబైల్ ఫోన్లలో దూరిన మనిషి
కొనసాగుతున్న మోడీ, షా జైత్రయాత్ర

bjp-tdp-apduniaపశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ, బీజేపీ పక్షాల మధ్య ఉన్నది మిత్రత్వమా.. శతృత్వమా, పైపైన నటిస్తున్నారా.. లోలోన ఉడికిపోతున్నారా.. రాజకీయ అవగాహన వున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ రెండు పక్షాల మధ్య చాన్నాళ్ల నుంచి మిత్రత్వం మాటున శతృత్వమే పెరిగింది. రాజకీయాల్లో ఆరితేరిన సోము వీర్రాజు వంటి నేతలు పెదవి విప్పి, గొంతు పెంచి, తెలుగుదేశంపై విరుచుకుపడిన ప్రతీసారి టీడీపీ అంతకంటే దీటుగానే ఈ తరహా నేతలను ఢీకొంటున్నది. ఇప్పుడు అది మరింత ముదిరింది. టీడీపీ అధిష్ఠానం తమ కేడర్‌కు బీజేపీ పట్ల నోరు జారవద్దు అంటూ హెచ్చరిస్తూనే ఉంది. కాని బీజేపీ నాయకత్వంలో ఇలాంటి వాతావరణం మాత్రం కనిపించడం లేదు. అధికార టీడీపీపై విమర్శలు, ఆరోపణలు, వివాదాస్పద కామెంట్లు కొనసాగిస్తూనే ఉన్నారు.

వాస్తవానికి 2014 ఎన్నికల తరువాత రెండు పార్టీల మధ్య స్నేహపూరిత వాతావరణం ఎక్కడా వివాదం లేకుండా కొనసాగింది. రానురాను రెండు పార్టీల నేతల మధ్య కొంత అగాథం ఏర్పడింది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం వ్యవహార శైలిపై అప్పట్లోనే బీజేపీ నేతలు అంతర్గతంగా విరుచుకుపడేవారు. అప్పట్లో నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గోకరాజు గంగరాజుపై ఆచంట ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి పితాని సత్యనారాయణ వర్గీయులు అసంతృప్తి జెండా ఎగురవేశారు. రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు ఇలాంటి గొడవలను ఆదిలోనే తుంచివేసే ప్రయత్నం చేశాయి. కాని ఆ తరువాత కూడా టీడీపీ-బీజేపీల మధ్య చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల పొత్తు పెద్దగా పొసగలేదు. జిల్లాలో బీజేపీ-టీడీపీ పొత్తు సక్సెస్‌ కావడంతో కొన్నాళ్ళపాటు అందరూ సైలెంట్‌ అయ్యారు. తామంతా ఒక్కటే అన్నట్టు వ్యవహరించారు. తెలుగుదేశం మాత్రం బీజేపీని తమ పంచన ఉండే పార్టీగానే భావిస్తూ వచ్చింది. ఇది తెలిసొచ్చిన తరువాత సీనియర్‌ కమలనాథులు తెలుగుదేశం వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయారు.

ఏదొక రోజు స్నేహితులుగా ముందడుగు వేస్తామని విశ్వసించారు. ఆలోపే మా పార్టీ మద్ధతుతో తెలుగుదేశం విజయాలు అందుకుంది కాబట్టి నామినేటెడ్‌ పదవుల భర్తీలో బీజేపీకి ఒకింత వాటా ఇవ్వాల్సిందేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు వంటి నేతలు బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. మాకూ కార్యకర్తలు ఉన్నారు, ఎన్నికల సమయంలో కష్టించి పనిచేసిన వారూ ఉన్నారు. అలా కాకుండా తెలుగుదేశం అనుకూలురుకు మాత్రమే నామినేటెడ్‌ పోస్టులు ఇవ్వాలనుకోవడం ఏ మాత్రం సరికాదంటూ ఆయన ప్రతిసారి వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో మార్కెట్‌ యార్డులు, దేవాలయ కమిటీలతో సహా మరికొన్నింటిని వాటాగా మాకూ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. అప్పట్లో బీజేపీ నాయకత్వం ఈ దిశగా పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో బీజేపీ జిల్లా నాయకత్వం నిస్సహాయ స్థితిని ఎదుర్కొంది. మరోవైపు ఎంతోకాలం నుంచి కష్టపడితేనే గాని జిల్లాలో అపూర్వ విజయాలను అందుకోవడం సాధ్యం కాలేదు, అలాంటిది ఇప్పుడు గనుక కేడర్‌ను గాలికి వదిలేసి నామినేటెడ్‌ పదవుల్లో బీజేపీకి వాటా ఇస్తే అంతర్గతంగా అసంతృప్తి తలెత్తే ప్రమాదం లేకపోలేదనే నిర్ణయానికి టీడీపీ వచ్చింది. బీజేపీ డిమాండ్లను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆఖరుకి ఇదే జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి బీజేపీ కేడర్‌ పలుమార్లు తీసుకువెళ్ళింది.

ఇదే తరుణంలో ‘నిట్‌’ ప్రస్తావన వచ్చింది. మొదట్లో ఏలూరు లేదా పరిసరాల్లో ప్రతిష్టాత్మకమైన నిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిపుణుల కమిటీ ఏలూరును ప్రామాణికంగా తీసుకుని ఇక్కడ నిట్‌ ఏర్పాటైతే విజయవాడ నగరానికి చేరువగా ఉంటుందని, జాతీయస్థాయిలో జరిగే అడ్మిషన్లు కాబట్టి రానూ పోనూ దూర ప్రయాణానికి గన్నవరం విమానాశ్రయం మరింత దగ్గరగా ఉంటుందని భావించారు. ఇలాంటి తరుణంలోనే మంత్రి మాణిక్యాలరావు తన సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో నిట్‌ను ఏర్పాటు చేయాలని పట్టుపట్టడం, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పట్లో సానుకూలంగా వ్యవహరించారు. ఇదే తరుణంలో ఏలూరుకు రావాల్సిన నిట్‌ను బీజేపీ తాడేపల్లిగూడెంకు తన్నుకుపోయిందంటూ టీడీపీ నేతలంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బీజేపీ-టీడీపీల మధ్య కొంత అగాధం ఏర్పడింది. ఉన్నత స్థాయిలో రెండు పక్షాలు మిత్రులుగా కొనసాగినా.. స్థానికంగా మాత్రం శతృవులుగానే మారారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వచ్చే సరికి జడ్పీ చైర్మన్‌ బాపిరాజు, మంత్రి మాణిక్యాలరావు మధ్య మూడేళ్ళుగా రాజకీయం ఉప్పు-నిప్పుగా మారింది. కొన్ని అంశాల్లో వైరుద్యం కొనసాగింది. ఇదే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జోక్యం చేసుకుని విజయవాడలో ఇద్దరి నేతలతో ముఖాముఖి మాట్లాడారు. అప్పట్లో ఇక ఇద్దరూ ఏకమైనట్టుగానే భావించారు. కాని ఇది మూడు రోజుల ముచ్చటగానే మిగిలింది. ఈ విషయంలో ఇద్దరి నేతలను తప్పుపట్టాల్సిన పనిలేదు. పార్టీకి కష్టపడి పనిచేసిన కేడర్‌ను వదులుకోలేం, వారి పక్షాన నాయకత్వం వహించడం నేను చేస్తున్నది తప్పా.. అంటూ జడ్పీ చైర్మన్‌ బాపిరాజు ఒకవైపు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు తనకు ఉందని, దీనిని కాదని ప్రతీ దానికి అడ్డుతగిలే ప్రయత్నం చేయడం తెలుగుదేశం ధర్మమా అంటూ మంత్రి మాణిక్యాలరావు మొండికేశారు.

ఇలా మొదలైన పట్టుదలలు ఆసాంతం కొనసాగుతూనే వచ్చాయి. ఈలోపే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అడపా దడపా తాడేపల్లిగూడెంకు రావడం, మీడియా ముందు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఇరు పక్షాలకు పుండు మీద కారం జల్లినట్టే. అందుకనే సోము వీర్రాజు నేరుగా టీడీపీపై విరుచుకుపడినా ఇంతకు ముందు ఆయన మాటలకు వ్యతిరేకంగా టీడీపీ స్థానిక కేడర్‌ మాత్రమే జవాబు ఇచ్చేది. కాని అది కాస్తా ముదిరి తాజాగా తమ నేత చంద్రబాబు నాయుడునుద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసేంత వరకు సోము వీర్రాజు చేసిన కామెంట్లపై తెలుగుదేశంలో సహజంగానే సెగలు రేగాయి. అందుకనే మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌తో సహా మిగతా నేతలు బీజేపీపై విరుచుకుపడ్డారు. మీ గెలుపు మా దయ కాదా అంటూ మంత్రి మాణిక్యాలరావుపై గురి పెట్టారు.

బీజేపీ శ్రేణులన్నీ గడచిన ఏడాదిన్నరగా తెలుగుదేశం వ్యవహార శైలిని వీలైనప్పుడల్లా నిలదీస్తూనే ఉన్నాయి. తమంతట తాముగా బలపడేందుకు క్షేత్రస్థాయి సన్నాహాలు చేశారు. కమిటీలను నియమించారు. క్షేత్రస్థాయి సభ్యత్వ నమోదు పూర్తిచేశారు. గతంకంటే తమ బలం రెండింతలు పెరిగినట్టు అంచనాకు వచ్చారు. ఇదే తరుణంలో వరుసగా జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం సహజంగానే దాని ప్రభావం ఇక్కడ కూడా ఉన్నట్టు కమలనాధులు అంచనాకు వచ్చారు. దీంతోపాటు బీజేపీ సీనియర్‌ నేతలు సైతం పార్టీకి పూర్తిగా ఉండడం వీరికి ధైర్యాన్ని ఇచ్చింది. దీని ఫలితంగానే ఇప్పుడు బీజేపీ నాయకత్వం కాలు దువ్వేస్థాయికి ఎదిగింది. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు తమ మిత్రపక్షమైన బీజేపీకి అధికారిక కార్యక్రమాల్లో చోటు ఇచ్చేందుకు సిద్ధపడడం లేదు. రెండు పార్టీలు ఎవరుమటుకు వారుగా వ్యవహరిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com