Home > Politics > తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే..యమునే తీరే

తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే..యమునే తీరే

మోడీ, బాబు భేటీపై సర్వత్రా ఉత్కంఠ
జగన్ యాత్రకు మైలేజ్ ఎక్కడ

congressసంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్‌లో కొత్తగా చేరే నాయకులు ఎవరు?, ఏయే పార్టీలో నుంచి రానున్నారు?, అధికార పార్టీకి ‘చిల్లు’ కొట్టనుందా? అనే ఆసక్తికరమైన చర్చ, ఉత్కంఠ ఆరంభమైంది. ఇటీవల టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా వివిధ సభల్లో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఉత్తమ్ ఒక అడుగు ముందుకేసి సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో సంక్రాంతి పండుగకు ముందు మంచి రోజులు (పీడ దినాలు) కావని భావిస్తారు కాబట్టి, పండుగ తర్వాత భారీగా చేరికలు ఉంటాయని ఆయన చెప్పారు. నిజానికి కాంగ్రెస్‌లో చేరేదెవరూ? అని ఆలోచిస్తే అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ను వదిలి చేరేందుకు ఎవరూ సాహసించరు. ఒకవేళ వివిధ కారణాలతో కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరి, అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతున్న ఒకరిద్దరు నేతలు ఎవరైనా సాహసించి వెనక్కి వస్తారేమోనన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించి, టిఆర్‌ఎస్‌లో కలకలం సృష్టించేందుకే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆ ప్రకటన చేసి ఉంటారని మరి కొందరి భావన.నిజానికి కాంగ్రెస్ నేతల్లో అనైక్యత, అభద్రతాభావం కారణంగా కొంత మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ నాయకులు టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయిస్తున్నా, పార్టీ నాయకత్వం అడ్డుకట్ట వేయలేక పోయింది. టిఆర్‌ఎస్‌లోకి ఫలానా నాయకుడు ‘జంప్’ కానున్నట్లు మీడియా ద్వారా ముందుగానే వెల్లడైనా, వారిని ఆపడంలో జిల్లా, నాయకులు, రాష్ట్ర నాయకులు విఫలమయ్యారని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా వేరే పార్టీల నుంచి వచ్చే నాయకులు కూడా వెనుకాడుతున్నారని  వారంటున్నారు. ఉదాహరణకు ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్ధన్ ప్రభృతులు వచ్చారు. కానీ మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి విషయంలో నల్లగొండ కాంగ్రెస్ నాయకులు పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో ఆమె చివరి నిమిషంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా వివిధ జిల్లాల్లోనూ నేతల మధ్య సమన్వయం లేక కాంగ్రెస్‌లో చేరాల్సిన ఇతర పార్టీల నాయకులు టిఆర్‌ఎస్‌కో, చివరికి బిజెపికో వెళుతున్నారని సొంత పార్టీ నాయకులు అంటున్నారు. కాబట్టి ఇకనైనా జిల్లా పార్టీ నాయకులు సమన్వయంతో ఉంటేనే పార్టీ మరింత బలపడుతుందని, పార్టీ శ్రేణులకూ మనోధైర్యం కలుగుతుందని నాయకులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com