Home > Editorial > సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ

సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ

స్కూళ్లలో కొరవడుతున్న రక్షణ
చంద్రులు ఇద్దరు దొందు..దొందే

abthukamma-apduniaబతుకును అమ్మగా భావించి జరుపుకునే పండుగే బతుకమ్మ. ఇలా బతుకును అమ్మగా భావించి పండుగ జరుపుకోవడం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఒక్క తెలంగాణలో తప్పా. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే నవరాత్రుల వేడుకే బతుకమ్మ. అతివలు తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ప్రకృతితో ముడిపడి ఉంది. ఆ విశిష్టత ఏమిటీ..? బతుకమ్మ నేపథ్యం చారిత్రక అంశాలపై స్పెషల్ ఫోకస్…మట్టిలోనే పుట్టి… మట్టిలోనే కలవాలనే తత్వం కనిపించే పండుగ బతుకమ్మ. ఈ పండుగలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మికత, పర్యావరణ స్పృహ, మానవత్వం కలగలిసిన పండుగ ఇది. భగవంతుడిని మనం పూలతో పూజిస్తాం. ఇవే పూలు ఈ పండుగలో పూజలందుకుంటాయి. పాటలు పాడి.. ఆటలాడి.. ఆనందంగా బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ పూలు నీటిలో కరిగిపోతాయి. మట్టిలో ఇంకిపోతాయి. పూల పుట్టుక కూడా మట్టిలోనే ప్రారంభమవుతుంది. నీటితోనే ఎదుగుతుంది. ఈ జీవన సత్యాన్ని బతుకమ్మ పండుగ చెబుతుంది. ప్రకృతిలో మనకు అనేక రకాల వస్తువులు దొరుకుతాయి. కానీ ప్రకృతి సిద్దంగా సహజంగా దొరికే వాటి పట్ల ఓ చులకన భావం ఉంటుంది. అడవిలో దొరికే తంగేడు, గునుగు, కట్ల లాంటి పువ్వులను ఎవరుపెద్దగా పట్టించుకోరు. వాటిని జెడలో పెట్టుకోరు. పూజకు పట్టుకోరు. కానీ అలాంటి వాటిలో కూడా దైవత్వాన్ని చూసే అరుదైన దృశ్యం బతుకమ్మ పండుగలో కనిపిస్తుంది. ఈ పూలు నీటిలో కలవడం వల్ల నీటిలోని మలినాలు తొలగిపోతాయి. స్వచ్చంగా మారుతాయి. బతుకమ్మ పండుగ సామాజిక అంతరాలు లేని పండుగ. పేద గొప్ప అనే తేడా లేదు. మతాచారాలు పెద్దగా కనిపించవు. కులబేధం ఉండదు. ఊళ్లో ఆడోళ్లంతా కలిసి ఆడుకునే చక్కని పండుగ బతుకమ్మ. అక్కడ దైవత్వం కన్నా.. ఎక్కువ మానవత్వం కనిపిస్తుంది.మహిళల సౌభాగ్యానికి ఆడబిడ్డల ఆదరణకు కూడా ఈ పండుగ దర్పణం పడుతుంది. ఎక్కడున్నా సరే ఏ పండుగకు పిలిచినా పిలవకున్నా, బతుకమ్మ పండుగకు మాత్రం ఆడబిడ్డలను తప్పకుండా పుట్టింటికి పిలుస్తారు. ఉన్నంతలో బిడ్డను మంచిగా చూసుకుంటారు. పుట్టింటి సౌభాగ్యానికి గుర్తుగా బతుకమ్మ నాటి ఆడపడుచు కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన ఆడబిడ్డలు కూడా బంధువులు, చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈ పండుగ చేసుకుంటారు. ఏటా ఓకొత్త పాట పాడాలనే కూతుహాలం రోజుకో రకంగా బతుకమ్మను పేర్చాలనే ఆరాటం మహిళల్లో సృజనాత్మకతను పెంచుతుంది. తెలంగాణలో జరుపుకునే పండుగలు దాదాపు సామూహిక పండుగలే ఎవరి ఇంట్లో వారు సంతోషంగా పూజలు చేసుకున్నా.. సామూహికంగా కలిసి ఉత్సవం చేసుకుంటేనే ఇక్కడ పండుగ. దసరా, బతుకమ్మ ,గణపతి ఉత్సవాలు, పిరీల పండుగ, దీపావళి,, ఇలా ఏ పండుగైనా సరే అందరితో కలిసి జరుపుకోవడంతోనే ఇక్కడ ఆనందంగా ఉంటుంది. మిగతా పండుగలకన్నా గొప్పగా ఊరంతా కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మబతుకమ్మ పండుగ ఆవిర్భావానికి సంబంధించి కాల నిర్ధారణ చేయడం కష్టం. జానపద రచనను ఆచారానికి కాలనిర్ధారణ చేయడానికి ఇప్పుడున్న ఆకారాలు మాత్రమే సరిపోవు. అయితే ఈ పండుగ నేపథ్యాన్ని వివరించే నాలుగైదు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పౌరాణికంలో.. శ్రీగౌరి మహిషాసురుని చంపిన తర్వాత అలసటతో మూర్చపోతుంది. ఆమెను మూర్చ నుంచి తుర్చటానికి స్త్రీలంతా గుమిగూడి పాటలు పాడుతుండగా.. సరిగ్గా పదవ రోజున ఆమె మూర్చ నుంచి తేరుకుని స్పృహలోకి వస్తుంది.. మూర్చలోని ఆమెను తిరిగి బతుకమ్మా అని పాడితే బతికింది. కనుక ఆ 10రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకుంటారని పురాణాల్లో ఉన్నట్లు చెబుతారు.చారిత్రక గాథల్లో మరో రకంగా ప్రచారంలో ఉంది. చోళ దేశాన్ని ధర్మాంగదుడనే రాజు పాలించేవాడు. అతని భార్య సత్యవతి. వాళ్లకు 100 మంది కొడకులు యుద్ధంలో అందరూ చనిపోయారు. వారు దుఖించి లక్ష్మి దేవి ప్రాప్తి కోసం.. అడవులకు వెళ్లి సంతానం కోసం తపస్సు చేశారు. లక్ష్మిదేవి ప్రత్యక్షమై వరమడుగుమంటే… ఆమెనే తమ కూతురుగా జన్నించమని కోరుతారు. వాళ్లకు జన్మించిన లక్ష్మిదేవిని మునులు సందర్శించి బతుకమ్మ అని పేరు పెట్టి ఉత్సవం జరిపించారు. యవ్వనవతి అయిన బతుకమ్మను చక్రం పేరున వెలిసి శ్రీ మహావిష్ణు పెండ్లాడి సంతానం పొందారు. అప్పటి నుంచి బతుకమ్మ పేరు మీద ఈ పండుగ జరుపుకుంటారనేది ప్రచారంలో ఉంది.సామాజిక కోణంలో మరో ప్రచారం ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కరువు కాటకాలు. భయంకర వ్యాధులు సోకి చాలా మంది ప్రాణాలు కొల్పోయారు. పల్లెలన్నీ ఆపసోపాలు పడ్డాయి. ఈ తిప్పల నుంచి ప్రాణాలు కాపాడమని బతుకునిమ్మని ప్రజలు పండగ చేశారు. బతుకు నిలిపిన దేవతే బతుకమ్మ కథగా చెప్పుకుంటారు. చాలా ఏళ్ల తర్వాత వానలు కురిసి చెరువు కట్ట తెగిపోయింది. గండి పూడ్చడానికి గ్రామ ప్రజలు ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. విఫలమయ్యారు. కన్యగా ఉన్న బతుకమ్మ గండి పడిన చోట బతికి సిద్దపడి ఊరి ప్రజలను బతికించింది. ఆట పాటలతో ఆమెను ఆరాధించడమే బతుకమ్మ పండుగ.పూర్వం ఒక కాపు దంపతులకు పుట్టిన పిల్లలు పుట్టిన వెంటనే చనపోసాగారు. వారి ఎనిమిదోసంతానం ఆడపిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు. పాప బతికింది. పెరిగి పెద్దయిన ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఏడాది తర్వాత ఆమె పుట్టింటికి వచ్చినప్పుడు ఆమె వదినతో కలిసి చెరువు స్నానానికి వెళ్లింది. చీరల విషయంలో గొడవ పడిన వదిన, మరదలు బతుకమ్మను చంపేసి ఆ మృతదేహాన్ని తంగేడు పొదల్లో పాతిపెట్టింది. వృతాంతంతా తెలిసిన ప్రజలు కంటతడి పెట్టి తంగేడు పూలతో ఆమె పేరుమీద శాంతి పూజల చేశారు. అదే బతుకమ్మ పండుగగా నిలిచిపోయింది. ఇలా రకరకాల కథలు అక్కడక్కడా ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతికి దర్పణంగా ప్రాచుర్యం పొందింది. పెత్తరమాస రోజున మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూలు అంటారు. బతుకమ్మ రెండోరోజు నుంచి కుటుంబంలోని మగపిల్లలు పువ్వు తేవడానికి కంచెకు వెళతారు. సాయంత్రం అతివలు కొత్తచీరుల కట్టుకుని బతుకమ్మతో పసుపు- గౌరమ్మపెట్టి పట్టుకొని బయలుదేరుతారు. గుడి ప్రాంగణంలోనో, వీధి కూడలిలోనో తెచ్చిన బతుకమ్మలు పెట్టి బతుకమ్మల చుట్టు గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడుతు పాటలందుకుంటారు. చీకటి పడేదాకా ఆడి బతుకమ్మలు పట్టుకొని గంగమ్మ చెంత చేరుస్తారు. ఆడవాళ్లు గౌరమ్మ పాటలు పాడుతూ వెంట తెచ్చిన ప్రసాదం పప్పులు ఫలహారాలను ఒకరినొకరు వాయనాలుగా పంచుకుంటారు. ఇలా ఐదు రోజుల హుషారుగా సాగిపోతుంది. ఆరోరోజు అర్రెం.. బతుకమ్మలు పేర్వరు. పనులు చూసుకోవడానికి యాంత్రికం కాకుండా ఒకరోజు విరామం 7,8 రోజులు మరింత హుషారుగా ఆడతారు. తొమ్మిదో రోజు బతుకమ్మను పెద్ద బతుకమ్మ అనీ సద్దుల బతుకమ్మ అని అంటారు.మొదటి రోజు.. అమావాస్య రోజున ప్రారంభం అవుతుంది. ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. ప్రసాదంగా నువ్వులు, నూకలు బెల్లం చేస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. సప్పటి పప్పు, బెల్లం అటుకులతో ప్రసాదం చేస్తారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బెల్లం పాలతో ప్రసాదంగా చేస్తారు. నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ అంటారు. పాలు బెల్లం నాన వేసిన బియ్యంతో ప్రసాదం పంచుతారు. ఐదోరోజు అట్ల బతుకమ్మ అంటారు. బియ్యం నానబెట్టి తీసి, లేదా విసిరిన అట్లు దోశల ఫలహారం గా ఇస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఈరోజు బతుకమ్మను ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు. సకినాలు చేసే పిండి పదార్ధాన్ని చిన్నచిన్న వేపకాయలంత పరిమాణంలో వేపకాయలుగా ముద్దలుగా చేసి నూనేలో వేయించన వంటకం ఈ నాటి ప్రసాదం. ఏనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ నువ్వులు, వెన్న బెల్లం నెయ్యితో తయారు చేసిన ఫలహారం ఇక చివరిరోజు సద్దుల బతుకమ్మ ఐదు రకాల సద్దులు పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర సద్ది నిమ్మకాయ కొబ్బరి తురుము సద్ది, నువ్వుల పొడి కలిపిన సద్ది ఇట్లా ఏమైనా తమకు తోచిన సద్దులుచేస్తారు. దీంతో బతుకమ్మ సంబురం ముగుస్తుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ చేసి, ఫలహారాలతో ఇంటి ముంగిట పెట్టి ఆడుకోని ఆ తర్వాత గ్రామ బొడ్రాయి వద్ద అందరి బతుకమ్మ లుంచి స్త్రీలందరూ చుట్టు వలయాకారంగా ఆడుతారు. డప్పు చప్పుళ్ల దరువులు ఉత్సాహంగా ఊరిని కదిలిస్తుంటాయి. అన్ని కులాల వారు చేరి ఐక్యతను స్నేహాన్ని గ్రామ బంధుత్వాన్ని కళ్లకు కడతారు. తెలంగాణ పండుగ ఇప్పుడు విదేశాల్లోను జరుపుకుంటున్నారు. అమెరికాతో పాటు అనేక దేశాలలో ఇప్పుడు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు. వాషింగ్టన్ లో ఏటా కన్నుల పండువగా వేడుకలు జరుగుతున్నాయి. తంగేడు పూలు.. గుమ్మడిపూలు.. ఆకు, గోరంత పువ్వులు, రుద్రాక్ష పూలు, కట్ల పువ్వులు, గునుగు పూలు ఇంకా ఈ పండుగ సమయంలో దొరికే తీరొక్క పూలను గోపురాకారంలో పేర్చి పిల్లలు ముస్తాబై గౌరీ పూజ చేయడం బొడ్డెమ్మ పేర్చడం అందరూ ఒకేచోట చేరి ఆడుతూ పాడడం లాటరీ పనుల వల్ల వీరికి తెలియకుండానే సంస్కృతి సంప్రదాయాలకు ఐక్యంగా పనులు చేయడానికి అలవాటుపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *