Home > Politics > కారులోనే ఉంటారా.. లేక కాషాయ కలరింగ్ ఇస్తారా..

కారులోనే ఉంటారా.. లేక కాషాయ కలరింగ్ ఇస్తారా..

ఏఐడీఎంకేనుంచి శశికళ, దినకరన్ ఔట్
తెలంగాణలో కమలానికి, సైకిల్ మధ్య పెరుగుతున్న దూరం

d-srinivas-apduniaరాజ్యసభ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నేత డి.శ్రీనివాస్‌ రాజకీయ పయనంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తనయుడు కమల దళంలో చేరనుండటంతో డీఎస్‌ రానున్న రోజుల్లో బీజేపీ వైపు మొగ్గు చూపడం అనివార్యం కానుందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. కాగా తండ్రి ఒక పార్టీలో, తనయుడు మరో పార్టీలో కొనసాగితే ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న అరవింద్‌ తన తండ్రిని కూడా అదే పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు డీఎస్‌ అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది.
డీఎస్‌ పార్టీ మారుతారనే ప్రచారం నెల రోజుల క్రితం జోరుగా సాగింది. దీంతో తాను టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని ఢిల్లీ, హైదరాబాద్‌లలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా ఆయన కుమారుడు అరవింద్‌ బీజేపీలో చేరనుండటంతో మళ్లీ ఈ అంశం చర్చకొస్తోంది. ఈనెల 17న గానీ, అంతకు ముందేగానీ అరవింద్‌ బీజేపీలో చేరనున్నారు.

2014 ఎన్నికల్లో డి శ్రీనివాస్‌ నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల్లో ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మొదట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడి పదవి లభించగా, తర్వాత రాజ్య సభ సభ్యునిగా పదవి వరించింది. కాంగ్రెస్‌లో ఉండగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన డీఎస్‌ టీఆర్‌ఎస్‌లోకి వచ్చాక దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎంపీ పదవిలో ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌లో చెప్పుకోదగిన ప్రాధాన్యత దక్కడం లేదనే వాదన ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో స్తబ్ధుగా ఉండటం ఆయన అనుచరవర్గాన్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదనే వాదన ఉంది.

మరోవైపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న డీఎస్‌ పెద్ద కుమారుడు, మాజీ మేయర్‌ సంజయ్‌ కూడా ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే యోచనలో ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. డీఎస్‌ టీఆర్‌ఎస్‌ తరపున ఎంపీగా ఉన్నప్పటికీ.. సంజయ్‌ మాత్రం ఈసారి పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సంజయ్‌ ఏ పార్టీలోకి వెళతారనేది మరో చర్చకు దారితీస్తోంది. మొత్తం మీద తనయుల రాజకీయ ప్రవేశం, పునఃప్రవేశం డీఎస్‌కు ఒక రకంగా ఇరకాటంలోకి నెట్టేలా తయారవుతోందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *