Home > Editorial > తమిళ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్

తమిళ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్

ప్రకృతి విలయతాండవంతో తీరని నష్టం
కాలానికి అనుగుణంగా అందరూ మారాలి

tamilnadu-politics-apduniaతమిళనాడులో జయలలిత మరణానంతరం పాలక ఎఐఎడిఎంకెలో తలెత్తిన గందరగోళానికి తెరదించే విలీన ప్రయత్నాలు చరమఘట్టానికి చేరాయి. ముఖ్యమంత్రి ఎడప్పడి కె.పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం గ్రూపులను ఐక్యం చేసేందుకు బిజెపి జాతీయ నాయకత్వం కొన్ని నెలలుగా సాగిస్తున్న తెరవెనుక రాజకీయం ఫలప్రదమైంది. ముందుగా రెండు గ్రూపులను విలీనం చేయటం, ఆ తదుపరి ఎఐఎడిఎంకెను ఎన్‌డిఎలో, మంత్రివర్గంలో చేర్చుకోవటం, తద్వారా తమిళనాడులో సొంతబలం లేకపోయినా మిత్రపక్షం అండతో కేంద్రంలో బలగాన్ని, బలాన్ని పటిష్టవంతం చేసుకోవటం బిజెపి వ్యూహం. ప్రతిపక్ష డిఎంకె కాంగ్రెస్ కూటమిలో ఉన్నందున, ఎఐఎడిఎంకెని ఎన్‌డిఎలోకి తెచ్చుకోవటానికి బిజెపి చేసిన ప్రయత్నాలు జయలలిత జీవించి ఉండగా ఫలించలేదు.తిరుగుబాటుదారు ఒ.పన్నీర్ సెల్వం వెంట ఉన్నది 9 మంది ఎమ్మెల్యేలే. విలీనానికి ఆ గ్రూపు డిమాండ్‌లకు ముఖ్యమంత్రి గ్రూపు తలొగ్గటానికి ప్రధాన కారణం ఆ ప్రయత్నం వెనుక కేంద్రప్రభుత్వం ఉండటమే. కొద్దినెలల క్రితం ఆరంభమై అర్థాంతరంగా నిలిచిపోయిన విలీన ప్రయత్నాలు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారానికై ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ప్రధానితో చర్చలు జరిపిన అనంతరం ఊపు అందుకున్నాయి. పన్నీర్ సెల్వం మూడు కోర్కెలను ముఖ్యమంత్రి చాలా మేరకు నెరవేర్చారు. జయలలితకు చికిత్స, మరణంపై సిబిఐ విచారణ డిమాండ్‌కు బదులు రిటైర్డ్ హైకోర్టు జడ్జీతో విచారణ, పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను పార్టీనుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌కు బదులు, ఆమె జైలుకెళుతూ ఉపప్రధాన కార్యదర్శిగా నియమించిన దినకరన్‌ను పార్టీనుంచి తొలగించటం, పోయిస్ గార్డెన్‌లోని జయలలిత నివాస గృహం ‘వేదనిలయం’ను ఆమె స్మారక మందిరంగా మార్చటంముఖ్యమంత్రి అంగీకరించిన అంశాలు. అయితే పన్నీర్ సెల్వం గ్రూపులోని కొద్దిమంది సీనియర్లు సిబిఐ దర్యాప్తుకు పట్టుబడుతున్నందున విలీనం ప్రక్రియకు బ్రేక్ పడినట్లు కనిపిస్తున్నప్పటికీ, సెల్వం గ్రూపుకు మంత్రిపదవుల సంఖ్య, పార్టీ పదవులపై ఏర్పడ్డ ప్రతిష్టంభనకు పదవులు ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టేశారు.జయలలిత అవినీతి కేసుల్లో శాసనసభ్యత్వానికి అనర్హత పొందినపుడు ఆమె వీరవిధేయునిగా ముఖ్యమంత్రి బాధ్యతల్లో నియమించబడిన పన్నీర్ సెల్వం, ఆమె మరణించిన డిసెంబర్ 6 అర్థరాత్రి బిజెపి కేంద్ర నాయకుల సలహాపై తిరిగి ముఖ్యమంత్రి అయినారు. అయితే కొద్దివారాల్లోనే ఆ పదవిని చేబట్టి పార్టీపై, ప్రభుత్వంపై పూర్తిపట్టు సాధించాలనుకున్న శశికళ ఆదేశంతో రాజీనామా సమర్పించాడు. అప్పటికే ఆమె పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైనారు. అయితే జయలలిత అవినీతి కేసులో సహముద్దాయిగా జైలుశిక్షకు గురైన శిశకళ ఇ.కె.పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. తన సోదరుని కుమారుడు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పార్టీపై శశికళ ప్రభావాన్ని పూర్తిగా తొలగించటం ధ్యేయంగా పన్నీర్ సెల్వం పావులు కదిపారు.బిజెపి కేంద్రనాయకత్వం మొదటినుంచీ ఆయన వెనుక ఉంది. అయితే ఎమ్మెల్యేల బలం పళనిస్వామి గ్రూపులో ఉన్నందున పార్టీని ఐక్యం చేయటమే తమకు ప్రయోజనకరమని భావించిన బిజెపి ఆ దిశగా రెండు గ్రూపులతో చర్చిస్తూ వారిని సన్నిహితం చేసింది. విలీనం జరిగితే, ఎన్నికల కమిషన్ స్తంభింపచేసిన పార్టీ ఎన్నికల గుర్తు ‘రెండాకులు’ తిరిగి వస్తుంది. అయితే శశికళ సలహాతో పనిచేస్తున్న దినకరన్ ఈ విలీనం అవకాశవాదం, అశాశ్వతం అంటున్నారు. ఏదిఏమైనా, ఎఐఎడిఎంకెకు జయలలితలాంటి జనాకర్షక నాయకుడు లేడు. డిఎంకెలో నాయకత్వ మార్పిడి జరిగి స్టాలిన్ నాయకత్వంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 98సీట్లు గెలుచుకుంది. మరొక్క కుదుపు కుదిపితే అధికారం చేతికి వస్తుందన్న ఆశల్లో ఉంది. అందువల్ల తమిళ రాజకీయాలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పువరకు ఆసక్తికరంగానే కొనసాగుతాయి.ప్రభుత్వం నిలబడాలంటే పళనిస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం ఆయనవైపు 112 మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా పళనిస్వామిని ఆదేశించాలని గవర్నర్‌ను డీఎంకే ఇప్పటికే కోరడం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ కూడా పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ నేతలు విద్యాసాగర్‌కు బుధవారం ఓ లేఖ రాశారు. పళనిస్వామి మాత్రం విశ్వాస పరీక్ష పెట్టినా తమ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదని ధీమాతో ఉన్నారు. ఈ దశలో గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలసి అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అరియలూరులో జరిగిన ఈ సభలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ పార్టీని ఎవ్వరూ ధ్వంసం చేయలేని ఓ కోటగా జయలలిత మలిచారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *