Home > Bhakti > దుర్గమ్మ గుడిలో నత్తనడక దసరా ఏర్పాట్లు!

దుర్గమ్మ గుడిలో నత్తనడక దసరా ఏర్పాట్లు!

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు
పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

vijayawada-durgamma-apduniaసెప్టెంబర్ 21వ తేది నుంచి 30 వ తేది వ‌ర‌కు నిర్వహించ‌నున్న ద‌స‌రా ఉత్సవాలకు సంబంధించి బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారగణం ఇప్పటికే షెడ్యూల్ ప్రక‌టించింది. రాష్ట్ర పండుగా ప్రక‌టించిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల దృష్టి ఈ ఉత్సవాలపై కేంద్రీకరించింది. అయితే సంబంధిత అధికారుల‌కు మాత్రం ఈ విష‌యం గుర్తు లేన‌ట్లే ఉందని భక్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఎటువంటి ప‌నులు పూర్తి కాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విజ‌య‌వాడ‌ న‌వ్యాంధ్ర రాజ‌ధానిగా మారిన త‌రువాత మొద‌టి సంవ‌త్సరం ద‌స‌రా ఉత్సవాలు మామూలుగానే జ‌రిగాయి. కాని రెండ‌వ సంవ‌త్సరం నుంచి రాష్ట్ర పండుగ‌గా ప్రకటించారు. అప్పటి నుంచి ద‌స‌రా ఉత్సవాల‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో బ‌తుక‌మ్మ పండుగ‌..ఆంధ్రలో ద‌స‌రా ఉత్సవాల‌ను రాష్ట్ర పండుగా ప్రక‌టించారు. దీంతొ రెండు ఉత్సవాల‌పై తెలుగు ప్రజలు ఆస‌క్తి క‌న‌బరుస్తున్నారు. కానీ గ‌తేడాదితో పోల్చితే ఈ సంవ‌త్సరం పనులు నత్తనడకన సాగుతున్నాయని పలువురు అంటున్నారు.

ఆలయ పరిస్థితి చూస్తున్నవారు అమ్మవారి సన్నిధిలో అసలు దసరా ఉత్సవాలు నిర్వహిస్తారా? అన్న సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అర్జున వీధిలో రోడ్లు, నిర్మాణంలో ఉన్న కారిడార్లు, కొలను, షాపింగ్ కాంప్లెక్స్ వంటి వన్నీ అసంపూర్ణంగానే మిగిలిపోయాయి. సెప్టెంబర్ 4వ తేదిన నిర్వహించిన పాల‌క మండ‌లి రెండ‌వ స‌మావేశంలో ద‌స‌రా ఉత్సవాలపైనే విస్తృతంగా చర్చించారు. అయితే 10 రోజుల్లోనే అన్ని ప‌నులు పూర్తి అవుతాయా? అన్న అనుమానాలు భక్తుల్లో మొదలయ్యాయి. అయితే ఆలయ అధికారులు మాత్రం అనుకున్న సమయానికి అన్నీ పూర్తవుతాయని, ఆందోళన పడాల్సిన పనిలేదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆలయంలో యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నులు నిర్వహిస్తే త‌ప్ప పండుగ సమయానికి పూర్తికావు. కాని ఆల‌యంలో ఎక్కడ చూసినా మొండి గోడలు, మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పనులన్నీ దస‌రా స‌మ‌యానికి పూర్తి కావ‌ల్సిన అవ‌స‌రం ఏముందని పాలక మండ‌లి స‌భ్యురాలు సూర్యల‌త ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా దసరా ఉత్సవం నాటికి నిర్దేశించుకున్న పనులు పూర్తై.. కనులపండుగా వేడుకలు సాగాలని అంతా ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *