Home > Health > పల్లెల్లో పొంచి ఉన్న డెంగ్యూ, మలేరియా

పల్లెల్లో పొంచి ఉన్న డెంగ్యూ, మలేరియా

వైద్యానికి జబ్బు
వణికిస్తున్న పెట్యా వైరస్

dengue_apduniaపల్లెజనానికి జ్వరమొచ్చింది. పట్నం జనం రోగాల భయంతో వణుకు తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో దోమల స్వైర విహారం బయపెడుతుంది. ప్రతి ఏటా డెంగీ, మలేరియా వణికిస్తుండగా ఈ ఏడాది అదే భయంలో ప్రజలు ఉన్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సుల కొరత మరింత భయపెడుతుంది. వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తత కాకుంటే జనం రోగాల బారిన పడి చావాల్సిందే. జనగామ, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జయశంకర్‌, మహబూబాబాద్‌ జిల్లాల పరిధిలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు 590 ఉప ఆరోగ్య కేంద్రాలు, 16 కమ్యూనిటీ హాస్పత్రులతో పాటు ఆరు ఏరియా ఆస్పత్రులు, సీమాంక్‌ నెంటర్లు, 24 గంటల ఆస్పత్రులు ఉన్నాయి. 325 మంది హెల్త్‌ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా 175 మంది మాత్రమే ఉన్నారు. 150 హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 75 హెల్త్‌ సూపర్‌వైజర్లు ఉండాల్సి ఉండగా 50 మంది మాత్రమే ఉన్నారు. 25 హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 132 ఏఎన్‌ఎం పోస్టులు, 32 ఫార్మాసిస్టు, 32 ల్యాబ్‌ టెక్నీషన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డాక్టర్‌ ఉంటే హెడ్‌ నర్సు ఉండరు హెడ్‌ నర్సు ఉంటే డాక్టర్‌ ఉండరు. ఇలా ఐదు జిల్లాల్లో ఆస్పత్రులు నడుస్తున్నాయి. ఏజెన్సీల్లోనూ అదే పరిస్థితి. హెల్త్‌ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం పట్టిచుకోవడం లేదు. వర్షాకాలంలో ప్రధానంగా విషజ్వరాల బారినపడి ప్రజలు ఇబ్బందులు పడడం సర్వసాధారణమైపోయింది. ఐదు జిల్లాలను ప్రతి ఏటా డెంగ్యూ, మలేరియా వణికిస్తుంది. మలేరియా, డెంగ్యూలో చనిపోయిన వారు సైతం అనేకం. అధికారులు మాత్రం లెక్కల్లో చూపడం లేదు. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోనే నమోదయ్యాయి. ప్రతిఏటా డెంగ్యూ, మలేరియా కేసులు సైతం పెరుగుతున్నాయి. మలేరియా, డెంగ్యూ బారిన పడిన వారితో పాటు విషజ్వరాలు సోకిన వారికి సైతం రక్తకణాలు తగ్గడంతో చనిపోతున్నారు.పచ్చదనం, పరిశుభ్రత నినాదం ఉన్నా పట్టణాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. దీంతో దోమలు పెరిగాయి. ఇంట్లో దోమల మోత బయట పందుల గోల ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా పట్టణాల్లో పారిశుధ్య సమస్య మూలంగా దోమలు పెరిగాయి. ఫాగింగ్‌ చేయాల్సి ఉండగా చేయడం లేదు. ఐదు జిల్లాల పరిధిలో గ్రేటర్‌ వరంగల్‌తో పాటు భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, జనగామ, మహబూబాబాద్‌, ములుగు కేంద్రాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పట్టణాల్లో దోమల్ని తరిమేస్తే ప్రజల్ని రోగాల బారినుంచి రక్షించే అవకాశం ఉంటుంది. ఇక ఏజెన్సీపై ప్రత్యేకదృష్టి పెట్టాల్సి ఉంది. ప్రతి ఏటా ఏజెన్సీలోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఏజెన్సీ ప్రజల్ని రక్షించడం కోసం దోమతెరలు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలి. 366 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నందున వాటిపై దృష్టిపెట్టాలి. రెండు, మూడు గ్రామాలకు కలిపి వైద్యశిబిరం ఏర్పాటుచేయాలి. ఇలా చేయడం వలన ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *