Home > General > కణితిలో అంతా అవినీతి

కణితిలో అంతా అవినీతి

పిల్లలకు తిండి కూడా సరికా పెట్టలేరా..?
మన నీళ్లు రావా...
 
Vizag_steel_plant_entrance_apduniaస్టీల్‌ ప్లాంట్‌ అవసరాల కోసం 90 రోజుల పాటు సరిపడే నీరు నిల్వ ఉంచేందుకు కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌–1ను మూడు దశాబ్దాల కితం నిర్మించారు. హుద్‌హుద్‌ దెబ్బకు రిజర్వాయర్‌ ధ్వంసమైంది. ఫలితంగా స్టీల్‌ ప్లాంట్‌కు నీటి కొరత ఏర్పడింది. దీంతో రిజర్వాయర్‌ మరమ్మతు పనులను పూర్తి స్థాయిలో చేపట్టాలని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం భావించింది. భవిష్యత్తులో హుద్‌హుద్‌ వంటి విలయాలు వచ్చినా తట్టుకునే విధంగా రిజర్వాయర్‌ పునర్నిర్మాణం పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నీటిపారుదల శాఖను సంప్రదించగా అధికారులు డిజైన్లు రూపకల్పన చేసి అప్పగించారు. ఆ తర్వాత నిర్మాణపనుల బాధ్యతను నీటిపారుదల శాఖకే కట్టబెట్టారు.
ఈ మేరకు ఇరిగేషన్‌ అధికారులు నిర్మాణ పనులను హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో 2016 ఫిబ్రవరిలో రూ.53.85 కోట్ల పనుల వ్యయంతో పనులు మొదలయ్యాయి. రిజర్వాయర్‌ ఎర్త్‌వర్క్, రివిట్‌మెంట్‌ పనులతో పాటు రిజర్వాయర్‌ చుట్టూ రోడ్ల నిర్మాణ పనులన్నీ తొమ్మిది నెలల్లో పూర్తికావాలని కాంట్రాక్టర్‌కు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఈ ఏడాది చివరి వరకు పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పనుల్లో తీవ్ర జాప్యంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయన్న వాదనలు బలంగా ఉన్నాయి. నిబంధనలకు ప్రకారం.. రివిట్‌మెంట్‌ పునర్నిర్మాణ పనుల్లో పాత మెటిరీయల్‌ను కూడా వినియోగించాల్సి ఉంది. ఉదాహరణకు 100 క్యూబిక్‌ మీటర్ల పనిలో 40శాతం పాత రివిట్‌మెంట్‌ మెటీరియల్‌… 60శాతం కొత్త మెటీరియల్‌ ఉండాలి. కానీ ఇక్కడ నిర్మాణæ పనుల్లో మొత్తం నూతన మెటీరియల్‌ వినియోగిస్తున్నట్టు తెలిసింది. పాత మెటీరియల్‌ ఏం చేస్తున్నారన్న లెక్క ఇప్పటికీ తేలలేదు. ఇక రివిట్‌మెంట్‌కి సంబంధించి 450మిల్లీ మీటర్ల థిక్‌నెస్‌ ఉన్న సింగిల్‌ స్టోన్లతో నిర్మాణం చేపట్టాలి. కానీ ఇక్కడ నిర్మాణ పనుల్లో రెండు, మూడు స్టోన్లు వినియోగిస్తున్నారు. రివిట్‌మెంట్‌కు ఒకటే లేయర్‌తో నిర్మాణం జరగాల్సి ఉండగా, రెండు మూడు లేయర్లతో నిర్మాణం జరుగుతోంది. ఏపీఎస్‌ఎస్‌ (ఏపీ స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌) నిబంధనల ప్రకారం లేయర్లు.. లేయర్లుగా రివిట్‌మెంట్‌ నిర్మించకూడదు.. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోందని చెబుతున్నారు.. రూ.53 కోట్ల నిర్మాణ పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయని తెలిసినప్పటికీ ఆ పనుల పర్యవేక్షణ అధికారి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ అధికారిపై ఇప్పటికే లెక్కకు మించిన ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన అధికారిగా ముద్రపడ్డ ఈయన జోలికి వెళ్లేందుకు ఉన్నతాధికారులు సైతం హడలెత్తిపోతున్నారు. దీంతో సదరు అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని, కాంట్రాక్టర్‌కు కొమ్ముకాస్తూ.. కోట్లలో నజరానాలు తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. రిజర్వాయర్‌ నిర్మాణ పనులు నిబంధల మేరకు జరగడం లేదని నీటిపారుదలశాఖకే చెందిన ఓ మహిళా అధికారి గుర్తించారు. ఈ మేరకు ఆమె సదరు పర్యవేక్షణ అధికారికి నివేదిక కూడా ఇచ్చారు. కానీ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కైన ఆ అధికారి తన సబ్‌ ఆర్డినేట్‌ అయిన ఆ మహిళా అధికారిని టార్గెట్‌ చేశారు. ఆమెను అక్కడి నుంచి బదలీ చేయించేందుకు సదరు ప్రబుద్ధుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు ఇరిగేషన్‌ వర్గాల్లోనే చర్చకు వచ్చింది. మరి ఇంత జరుగుతుంటే విజిలెన్స్‌ అధికారులు ఏం చేస్తున్నారన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. నిర్ణీత కాలానికి మించి పనులు జరుగుతున్నా… కాంట్రాక్టర్, అధికారి కుమ్మక్కై నాసిరకం పనులు చేస్తున్నారని కిందిస్థాయి అధికారులు నివేదికలిచ్చినా ఉన్నతాధికారులు.,. విజిలెన్స్‌ అధికారులు ఇంతవరకు దృష్టి పెట్టకపోవడం వివాదాస్పదమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *