Home > Editorial > కమలానికి గుజరాత్ పరీక్షే

కమలానికి గుజరాత్ పరీక్షే

అన్నంపై జీఎస్టీ భారం
తమిళ రాజకీయ శూన్యతకు పరిష్కారం

bjp-apduniaగుజరాత్‌లో డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడి ఉంది. మరో పక్క బిజెపికి ఇంతకు ముందు బాగా ఓట్లు వేసిన వర్గాలలో మద్దతు పడిపోతుండటంతో గెలుపు ఆ పార్టీకి అంత సులువు కాదని భావిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలోనే గుజరాత్ ఎన్నికలు జరుగుతాయని గాంధీ జయంతి రోజున బిజెపి అధ్యక్షులు అమిత్ షా పోర్‌బందర్‌లో జరిగిన ఒక పార్టీ ర్యాలీలో ప్రకటించారు. దీనితో బిజెపి ప్రచారానికి గాంధీజయంతి రోజున ఆయన బీజం నాటినట్లయింది. ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ఇంకా అధికారికంగా ప్రకటించకముందే షా ఇటువంటి ప్రకటన చేశారు.ప్రతిష్ఠాత్మక రాష్ట్రంగా మోడీషా ద్వయం భావించే గుజరాత్‌ను బిజెపి 22 ఏళ్లుగా అప్రతిహతంగా పరిపాలిస్తోంది. ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపడం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నాంది పలకాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందువల్ల గుజరాత్‌లో నువ్వానేనా అన్న తీరులో పోటీకి రంగం సిద్ధమైంది. గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో బలహీనంగా ఉంది. అందుచేత ఆ పార్టీ నియోజకవర్గాలపై నూతన పంథాలో దృష్టిపెట్టి వ్యూహరచన చేయాల్సి ఉంది. ఆసక్తికరంగా అమిత్‌షా ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ అంశాన్ని బలంగా తెరమీదకి తెచ్చారు. దానిని కాంచలేని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారని దెప్పిపొడిచారు. ఇటాలియన్ కళ్ళద్దాలతో చూడడంవల్లే గుజరాత్ అభివృద్ధికి నమూనా అయిన సంగతి ఆయనకు కనపడటం లేదని విమర్శించారు. రాజకీయ పరిశీలకులు మాత్రం అమిత్ షా ఎన్నికల ప్రచార ఘట్టానికి చాలా బలహీనంగా నాంది పలికారని వ్యాఖ్యానిస్తున్నారు.ఒబిసిలు, పటీదార్లు, ఠాకూర్లు, రాజఫుట్‌లు వంటి కుల బృందాలతో కూటమిని కట్టి బిజెపి అక్కడ అధికారంలోకి వచ్చింది. బిజెపి రాష్ట్ర నాయకత్వంలో కూడా ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గట్టు ఉంది. మునుపటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాధవ్ సింగ్ సోలంకిని దీటుగా బిజెపి ఎదిరించగలిగింది ఈ సంకీర్ణం వల్లనే.సోలంకి క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లింలను ఏకంచేసి పార్టీగొడుగు కిందకు తెచ్చే సూత్రాన్ని ఆయన నమ్ముకున్నారు. దానిని బిజెపి గట్టి దెబ్బే తీసింది. అయితే గత రెండేళ్లుగా కనపడుతున్న ధోరణులను పరిగణిస్తే ఒబిసిలలో పెద్ద భాగం ఓట్లు బిజెపికి వ్యతిరేకంగా పడవచ్చునని తోస్తోంది. పటీదార్లు, ఠాకూర్లు ఇటీవల చాలాబలమైన ఆందోళనలను జరిపారు. పెరుగుతున్న నిరుద్యోగం, వ్యవసాయరంగంలో కనీవినీ ఎరుగని సంక్షోభం ఆ ఇరువర్గాలను ఏకం చేశాయి. సాధారణంగా అవి ఒకదానికొకటి పడని వర్గాలు. సౌరాష్ట్ర ప్రాంతంలో పటీదార్లు, ఠాకూర్లకు పట్టు ఉంది. ఆ ప్రాంతంతోపాటు మధ్య గుజరాత్‌లో 60దాకా స్థానాలు ఉన్నాయి. 182మంది సభ్యుల అసెంబ్లీలో ఆ ప్రాంతపు ప్రాతినిధ్యం కీలకమైనది. గత ఎన్నికలలో బిజెపికి బాగా అనుకూలించిన ఆ ప్రాంతాలు ఇప్పుడు ఎదురుతిరిగినట్లు కనిపిస్తున్నాయి. అక్కడ బిజెపి బలం బాగా తగ్గింది. గోసంరక్షణ నిఘా పేరుతో జరుగుతున్న దారుణాలపట్ల రాష్ట్రప్రభుత్వ స్పందన తగినంత లేకపోవడంతో దళితులు ఆందోళన బాటపట్టారు. గోరక్షకుల అన్యాయాలవల్ల పశువుల పెంపకం, వాణిజ్యం దెబ్బతిన్న పరిస్థితిని రాష్ట్రప్రభుత్వం తగినంతగా పట్టించుకోవటంలేదన్నది వారి ఆరోపణ. ఇటువంటి మౌలిక అంశాలను ‘గుజరాత్ నమూనా అభివృద్ధి’ అంతగా పట్టించుకోలేదన్న వాస్తవం రోజురోజుకూ బలపడుతోంది.చాలాకాలంపాటు పాలించిన ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో మోడీ తనకు అనుకూలంగా వ్యక్తిపూజను పెంచుకున్నప్పటికీ ఆ ప్రయోజనాలకు బిజెపి ఇప్పుడు దూరమైంది. అయితే ఆయన ప్రధానమంత్రి కావడంతో బిజెపికి రాష్ట్ర నాయకత్వం తలనొప్పిగా మారింది. మోడీ ఎంపిక చేసుకున్న ముఖ్య మంత్రి ఆనందీ బెన్ పటేల్‌ను అర్థాంతరంగా అవినీతి ఆరోపణలపై పదవినుంచి తప్పించాల్సి వచ్చింది. ఆమె స్థానం లో సౌరాష్ట్ర నాయకుడు, ఆర్‌ఎస్‌ఎస్ విధేయుడు విజయరూపానీకి రాష్ట్ర సారథ్యం అప్పగించారు. రూపానీ అంతగా వినపడని, కనపడని నాయకుడు. తన రాజకీయ పునాదిని ఆయన పదిలపరుచుకోలేక పోతున్నారు. పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రూపులను ఏకం చేసేదిగా పార్టీవర్గాలు షా ప్రకటనపై ఆశలు పెట్టుకున్నాయి. ఆ పిలుపు వల్ల పార్టీపై ప్రస్తుతంగల సామాజిక వర్గాల ఆగ్రహం మాయమవుతుందని వారు ఆశిస్తున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడుతూ, గుజరాత్ అభివృద్ధికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ఏదీ ఓటర్ల ముందు ఉంచకపోవడం ఆ పార్టీని దెబ్బతీయగలదని వారునమ్మకం పెంచుకున్నారు.ప్రచారంలో ఓ అడుగు ముందున్న కాంగ్రెస్ అయితే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో బిజెపి కంటె కాంగ్రెస్ ముందుంది.సెప్టెంబర్ ఆఖరివారంలో సౌరాష్ట్ర పర్యటన ద్వారా రాహుల్ గాంధీ బిజెపిని ప్రచారంలో వెనక్కితోశారు. ఆ ప్రాంతం పటీదార్ల గట్టిపట్టులో ఉంది. ముందునుంచీ తమ పార్టీ బలహీనంగా ఉన్న సౌరాష్ట్ర నియోజకవర్గాలను తన పర్యటనకు ఎంచుకోవడం ద్వారా ఆయన అక్కడ ఓటర్లను సానుకూలంగా తిప్పుకున్నారని పార్టీవర్గాల్లో ఆశలు చిగురించాయి. అన్ని ప్రసంగాలల్లో రాహుల్‌గాంధీ ఘాటైన పదజాలంతో రూపానీ ప్రభుత్వతీరును ఎండగట్టారు. సకాలంలో వేరుశెనగ, ప్రత్తి పంటల సేకరణలో ప్రభుత్వం వెనుకబడిందని విమర్శించారు. గుజరాత్‌లో ఆ రెండూ ముఖ్యమైన పంటలు. ప్రభుత్వ తప్పిదంవల్ల ఆ పంటల ధరలు బాగా తక్కువకు పడిపోయాయి. ఆ పంటల రైతులు అధికంగా ఒబిసి కులాలకు చెందినవారు. వారంతా గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుపుతున్నారు. మోడీ ప్రభుత్వం జియస్‌టి పన్నుల వ్యవస్థను అనాలోచితంగా, తొందరపాటుతో ప్రవేశపెట్టిందని కూడా రాహుల్ చేసిన విమర్శలు వాణిజ్య, వ్యాపార వర్గాలకు బాగా రుచించినట్లే కనిపిస్తోంది.ప్రభుత్వ వ్యతిరేకత గుజరాత్‌లో బలంగా ఉన్నా దానిని అనుకూలంగా తిప్పుకునే రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్‌కు కొరవడిందని రాహుల్ సహాయకులలో ఒకరు తెలిపారు. రాహుల్ పర్యటన ఊహించనంతగా విజయవంతమైంది. ఓటర్లలో ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబకడం స్పష్టంగా కనిపించింది.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com