Home > World News > ఉక్కు మహిళకు నాలుగోసారి పట్టం

ఉక్కు మహిళకు నాలుగోసారి పట్టం

ఉత్తక కొరియాపై చర్యలకు సిద్ధం
మెక్సికోలో భారీ భూకంపం

engela-merkel-apduniaజర్మనీలో మళ్ళా జాత్యభిమాన పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ 13.3 శాతం ఓట్లతో దాదాపు తొంభై సీట్లు గెలుచుకుంది.జర్మనీ ఛాన్సలర్‌గా నాలుగవ పర్యాయం అధికారం చేపడుతున్న ఏంజెలా మెర్కెల్‌కు ఈ సారి పరిపాలించడం కత్తిమీద సాము. ఎఫ్‌డీపీ వ్యాపారస్తుల అనుకూల పార్టీ. గ్రీన్ పార్టీ వ్యాపార విధానాలను వ్యతిరేకిస్తున్నది. ఈ రెండు పరస్పర భిన్న పార్టీల మద్దతుతో నెట్టుకరావాలె. ఇంతకాలం అధికార కూటమిలో ఉన్న వామపక్ష ఎస్‌డీపీ ప్రతిపక్షంగా గొంతు విప్పుతుం ది. ఇక జాత్యభిమాన పార్టీ ఏఎఫ్‌డీ కొత్తగా పార్లమెంటులో ప్రవేశించిన ఊపులో ఉన్నది. ఏఎఫ్‌డీ లో జాత్యభిమానులు ఎంత కరుడుగట్టి ఉన్నారం టే, తమ నాయకురాలు ఫ్రాక్ పెట్రీ మెతకదనాన్ని కూడా వారు ఆమోదించడం లేదు. దీంతో పెట్రీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడక ముం దే తమ పార్టీని వీడిపోయారు. యూరప్‌లోకెల్లా జర్మనీలో రాజకీయ స్థిరత్వం ఎక్కువ. జాత్యభిమాన పోకడలు పెరుగకుండా ఎప్పుడూ రాజకీయ వ్యవస్థ జాగ్రత్తలు తీసుకుంటుంది. దేశ ఆర్థిక వ్యవ స్థ పటిష్టంగా ఉన్నది. మిగతా యూరోపియన్ దేశాలతో పోలిస్తే నిరుద్యోగం తక్కువగా ఉన్నది. అమెరికా- బ్రిటన్ బలహీనపడిన క్రమంలో యూరప్ లో జర్మనీ ప్రాభవం పెరిగిపోతున్నది. ప్రపంచ రాజకీయాలలో కూడా జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కాలంలో ఏనాడూ లేనంత కీల కపాత్ర పోషిస్తున్నది. అయినప్పటికీ జర్మనీలో జాత్యభిమాన పార్టీ పార్లమెంటులో మూడవ ప్రబల శక్తిగా ఆవిర్భవించింది. ఛాన్సలర్ మెర్కెల్ జాత్యభిమానుల వాదనలు కూడా వింటూ తమ విధానాలను కొంతైనా మార్చుకోకతప్పదు. గతంలో మూడు పర్యాయాలు జర్మనీ ఛాన్సలర్‌గా చక్రం తిప్పిన ఉక్కు మహిళ ఏంజెలా మెర్కెల్ మళ్ళా పగ్గాలు చేపట్టడం ఖాయమైనప్పటికీ, ప్రధాన పార్టీల బలం తగ్గిపోయింది. జర్మనీలోని భావసారూప్యం గల రెండు కన్సర్వేటివ్ పార్టీలు క్రిస్టియన్ డెమొక్రాటిక్ పార్టీ (సీడీయూ) క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమికి ఏంజెలా మెర్కెల్ నాయకురాలు. 2013 ఎన్నికల తరువాత మెర్కెల్ తన కూటమికి నాయకత్వం వహిస్తూనే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ (ఎస్‌పీడీ)ని కూడా చేర్చుకొని ఛాన్సలర్‌గా అధికారం నెరిపారు. కానీ తాజా ఎన్నికలలో అధికార కూటమి అయిన సీడీయూ/సీఎస్‌యూ బలం 8.6 శాతం తగ్గిపోయింది. వామపక్ష భావజాలం కలిగిన ఎస్‌పీడీ బలం కూడా 5.2 శాతం తగ్గిపోయింది. ఈ రైటు, లెఫ్టు మధ్యేవాద పార్టీల బలం తగ్గిపోయి, జాత్యభిమాన పార్టీ ఏఎఫ్‌డీ బలం పార్లమెంటులో మూడవ శక్తిగా అవతరించింది. అధికార పక్షం ప్రజలలో అప్రతిష్ఠపాలైందని తెలిసిపోవడంతో వామపక్ష సోషల్ డెమొక్రాటిక్ పార్టీ తాను ఇక ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించింది. దీంతో మెర్కెల్ రెండు చిన్న పార్టీలు ఎఫ్‌డీపీ, గ్రీన్స్ మద్దతు పొందగలిగితే తప్ప మెజారిటీ సాధించలేదు. జర్మనీలో ఓటరు రెండు ఓట్లు వేయవలసి ఉంటుంది. ఒకటి తమ నియోజకవర్గం అభ్యర్థికి, మరొకటి ఏదైనా ఒక పార్టీ కి. 299 సీట్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిండుతాయి. మిగతావి ఆయా పార్టీలకు వేసిన ఓట్ల దామాషా ప్రకారం వాటి ప్రతినిధులతో నిండుతాయి. ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ఉండటం వల్లనే చిన్న పార్టీలకు ప్రాతినిధ్యం లభిస్తున్నది. జాత్యభిమాన పార్టీ ఏఎఫ్‌డీ దాదాపు తొంభై సీట్లు తెచ్చుకోగలిగింది.జాత్యభిమాన పార్టీ ఏఎఫ్‌డీ బలపడటానికి కారణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. జర్మనీ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఆర్థిక వ్యవస్థ బాగుపడటం వేరు, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందడం వేరు. ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఆదాయం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతమవుతున్నది. ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. యూరోపియన్ యూనియన్ బలపడే కొద్దీ ప్రజల బాగోగులు పట్టించుకునే జాతీయ ప్రభుత్వాలు బలహీనపడుతున్నాయి. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు దేశ ఆర్థిక విధానాలపై అధికారం కోల్పోతున్నది. దీంతో ప్రజల్లో జర్మనీ అస్తిత్వం ప్రమాదంలో పడ్డదనే ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌కు వ్యతిరేకంగా 2013లో జాత్యభిమాన ఏఎఫ్‌డీ అవతరించింది. ఆర్థిక కారణాలతో అవతరించిన ఏఎఫ్‌డీ క్రమంగా ఇతర ఉద్వేగభరిత సమస్యలపై దృష్టి సారించి బలపడ్డది. ఆఫ్రికా, అరబ్బు దేశాలలో సంక్షోభం నేపథ్యంలో జర్మనీలోకి భారీగా శరణార్థులు వచ్చి చేరారు. ఈ శరణార్థుల అంశమే ఏఎఫ్‌డీని బలోపేతం చేసింది. ఇస్లామిక్ శరణార్థుల వల్ల జర్మనీకి ప్రమాదం ఏర్పడుతుందనే భావనను రెచ్చగొట్టింది. బుర్ఖాలు కాదు బికినీలు మాకిష్టం అనే నినాదంతో వేసిన యువతుల పోస్టర్ ఈ ఎన్నికలలో బాగా పనిచేసింది. 2008 లో ఆర్థిక సంక్షోభం మొదలైన తరువాత వామపక్ష శక్తులు బలపడతాయని భావించినవారున్నారు. కానీ యూరప్‌లో వామపక్ష శక్తులు బలహీనంగా మారి జాత్యభిమాన శక్తులు బలపడుతున్నాయి. ఈ పరిణామం జర్మనీలోనూ కనబడుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com