Home > Editorial > అన్నంపై జీఎస్టీ భారం

అన్నంపై జీఎస్టీ భారం

మోడీలో కనిపిస్తున్న మార్పులు
కమలానికి గుజరాత్ పరీక్షే

gst-rice-apduniaఒకే దేశం.. ఒకే పన్ను విధానం అమలై రెండు నెలలు గడుస్తున్నా ధరల్లో మాత్రం మార్పు లేదు. బియ్యం ధరలను అడ్డగోలుగా పెంచి వినియోగదారుల నడ్డివిరుస్తుంటే సంబంధిత శాఖలు మొద్దు నిద్ర నటిస్తున్నాయి. వస్తు సేవల పన్ను నుంచి బియ్యాన్ని మినహాయించగా ధరలు మాత్రం తగ్గకపోవడం అధికారులు, బియ్యం వ్యాపారులకున్న విడదీయరాని బంధాన్ని తెలియజేస్తోంది. జులై మొదటి తేదీన వస్తు సేవల పన్ను అమలు కాగా అంతకు ముందు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది. ప్రస్తుతం సదరు పన్నే లేకపోవడం ధరలు దిగిరాకపోవడం సామాన్యులను కలవరానికి గురిచేస్తోంది.

ఎకాఎకిన ధరలు పెంచుతూ వినియోగదారుల శ్రమను పిండేస్తున్నారు. ఇదేంటంటే బ్రాండ్‌ బియ్యంపై 5 శాతం పన్ను ఉందని మాటల గారడీతో బురిడీ కొడుతున్నారు. వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతున్న జిల్లా కేంద్రం అక్రమాలకు అడ్డాగా మారింది. ఇంతే ధరకు బియ్యం విక్రయించాలని నిర్ణయించినా వ్యాపారులు ఎక్కడికక్కడ దోచేస్తున్నారు. ఇక కాలనీల్లో విక్రయించే చిరువ్యాపారులు మాత్రం క్వింటాల్‌కు రూ.400 ఎక్కువ వసూలు చేస్తూ మరింత సొమ్ము చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 12 లక్షల కుటుంబాలున్నాయి. ఒక్కో కుటుంబంలో ముగ్గురు నుంచి 5 గురు వరకు గరిష్ట సభ్యులుండగా బియ్యం వినియోగం తప్పనిసరి. దొడ్డు బియ్యానికి కాలం చెల్లడంతో అంతా సన్నబియ్యం వినియోగిస్తున్నారు. ఈక్రమంలో సన్నబియ్యం ధరలను శాసిస్తూ చక్రం తిప్పుతున్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసే 10 మంది వ్యాపారులు వారనుకున్నదే ధర. వాస్తవానికి వస్తు సేవల పన్ను నుంచి మినహాయింపు లభించినపుడు విరివిగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ధరల సరళిని వివరించాల్సి ఉండగా తదనుగుణంగా చర్యలే కరవయ్యాయి.  వ్యాపారులతో ఉన్న మామూలు బంధమే అందుకు కారణం కాగా జీఎస్టీ అమలై మూడు నెలలు కావస్తున్నా వినియోగదారులకు ఒరిగింది సున్నా. మూడు నెలల వ్యవధిలో సుమారు 10 లక్షల క్వింటాళ్ల వరకు బియ్యం విక్రయాలు జరగగా ఉమ్మడి జిల్లా ప్రజలు దాదాపు రూ.80 కోట్లు అదనంగా చెల్లించారు. ఇదిలా ఉంటే నాణ్యత ప్రమాణాల ప్రకారం బస్తా బరువు కిలో నుంచి రెండు కిలోలు తక్కువగా ఉండటం విశేషం.

అధికారుల సమాచారం ప్రకారం ఉమ్మడి జిల్లాలో హోలోగ్రామ్‌ ఉన్న బియ్యం బ్రాండ్‌ ఒక్కటి కూడా లేదు. దీంతో పాటు హోలోగ్రామ్‌ లేకుండా బ్రాండ్‌ రిజిష్టర్‌ అయినవీ లేవు. మార్కెట్‌లో మాత్రం వివిధ రకాల పేర్లతో కొన్ని వందల నాన్‌ బ్రాండ్లు పుట్టుకొస్తున్నాయి. హోలోగ్రామ్‌ అంటే నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సరకును విక్రయించాల్సి ఉంటుంది. ప్రమాణాల ఉల్లంఘన జరిగితే కేసు నమోదు చేసే అవకాశముంది. రిజిస్ట్రేషన్‌, హోలోగ్రామ్‌ లేని వారు రకరకాల పేర్లతో సంచులు తయారు చేసుకుని ఏదో ఒక రకం బియ్యాన్ని అధిక ధరకు వినియోగదారులకు అంటగడుతున్నారు. ఆకర్షణీయ సంచులతో అందినంత దండుకుంటున్నారు. కరీంనగర్‌లో రెండేళ్ల కిందట 300ల వరకు రైస్‌ డిపోలుండేవి. కాలక్రమేణా వెయ్యి వరకు వెలిశాయి. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం గడించే వ్యాపారం కావడంతో పలువురు వ్యాపారులు, మిల్లర్లు కలిసి దందాకు తెరలేపారు. దీంతో నిజాయితీగా విక్రయించే వ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూపర్‌ ఫైన్‌ క్వాలిటీ ఉండే బియ్యాన్ని కిలో రూ.30 మించి బహిరంగ మార్కెట్లో విక్రయించకూడదు. ఇది మచ్చుకైనా అమలు కావడం లేదు. రకరకాల పేర్లు పెట్టుకుని ఎవరి ఇష్టమొచ్చినట్లు వారు ధరలు నిర్ణయించుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఓ పేరు మోసిన బ్రాండ్‌ కిలో బియ్యాన్ని రూ.60లకు అమ్ముతుంటే ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేని మరికొంత మంది బ్రాండ్‌ అమ్మకందారులు కిలో బియ్యం రూ.55 తక్కువ కాకుండా విక్రయిస్తున్నారు. 25కిలోల బియ్యం రూ.1100ల నుంచి రూ.1300ల వరకు పలుకుతోంది. పంట పండించే రైతు నుంచి 75 కిలోల ధాన్యం బస్తాను రూ.900లకు మించి కొనుగోలు చేయని వ్యాపారులు వారు తయారు చేసే బియ్యం విషయంలో మాత్రం ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించుకుని నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు.
మిల్లులే రంగు సంచులకు అడ్డాలుగా మారుతున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో సంచులను మిల్లులో నిల్వ చేసుకుని కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరాడించి వీటిలో నింపుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని పలుమార్లు పాలిషింగ్‌ చేసి సన్నబియ్యంగా నమ్మిస్తున్నారు. ఇటీవల కాలంలో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విభాగం కఠినంగా వ్యవహరిస్తుండటంతో పలువురు ఈ దందాకు తెరలేపారు. వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో ఉన్న సంచులు వందల సంఖ్యలో మిల్లుల్లో కనిపిస్తున్నాయి.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *