Home > Editorial > వైట్ ఎలిఫెంట్స్ గా ఐఐటీలు

వైట్ ఎలిఫెంట్స్ గా ఐఐటీలు

వ్యవసాయానికి సాయం అవసరం
రాహూల్ రాటుదేలుతున్నారు....

iiit-apduniaమన దేశంలో సాంకేతిక విద్యకు చెరగని చిరునామాగా వర్ధిల్లిన ఐఐటిలు చాలా ఏళ్లుగా పతనదశలో పయనిస్తున్నాయి. ఇప్పుడు మానవవనరుల మంత్రిత్వశాఖ విధానాలు వాటిని మరింత లోతుల్లోకి పాతేసేలా ఉన్నాయి. వాటిని దేశంలోని అతిముఖ్యమైన ఉన్నత విద్యాసంస్థలుగా నిన్నటిదాకా పరిగణించారు. ఇప్పుడు ప్రజల నుంచి అవి తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. క్యూఎస్ టైమ్స్ ప్రపంచ స్థాయి ఉన్నత విద్య ర్యాంకింగ్ సాధించిన తొలి వంద యూనివర్శిటీల్లో వాటికి ఈసారి చోటు లేకపోవడంతో విమర్శలు మరింత జోరందుకున్నాయి.ఎంహెచ్‌ఆర్‌డి ఆధ్వర్యంలో ఇచ్చే భారత దేశపు 10 ర్యాంకింగ్‌లలో వాటికి చోటు లభించడం విస్మయం గొలుపుతోంది. ఐఐటిలు ప్రపంచ ర్యాంకింగ్‌ల కోసం ఇంజినీరింగ్ వర్గీకరణ కింద పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. సాధారణంగా అవి యూనివర్శిటీలుగా పాల్గోవడం ఆనవాయితీ. అవి ప్రజల డబ్బుతో సంపన్న విదేశాలకు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేసి పంపుతున్నాయని, అక్కడ చదివిన గ్రాడ్యుయేట్ల దృష్టి దేశాభివృద్ధిపై కాకుండా విదేశాల అభివృద్ధికి సహాయపడ్డంపై ఉంటోందని ప్రజలు విమర్శిస్తున్నారు. కొరగాని ఐరావతాలుగా మారాయని యుజిసి చైర్మన్ వేద్ ప్రకాశ్ విచారం వెలిబుచ్చారు. పెద్ద సైజు ఇంజినీరింగ్ కాలేజీలుగా మారిపోయాయని విమర్శించారు.1946లో వెలువడిన ఎన్‌ఆర్ సర్కార్ కమిటీ నివేదిక సిఫారసుల మేరకు 1950లో ఖరగ్‌పూర్‌లో తొలి ఐఐటి ఏర్పడింది. ఆ తర్వాత దశాబ్దకాలంలో మరి నాలుగు ఐఐటిలు ముంబాయ్, మద్రాస్, కాన్పూర్, ఢిల్లీలలో ఏర్పడ్డాయి. దేశ పారిశ్రామిక, శాస్త్రీయ, సాంకేతిక నిర్మాతలను తయారు చేసే సౌధాలుగా వాటి రూపశిల్పి నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భావించారు. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థకు కావలసిన సాంకేతిక నిపుణులను అందించేవని కూడా వాటి గురించి ఆయన కలగన్నారు. రానురాను అవి కేవలం భారతీయ పరిశ్రమకు కావలసిన ఇంజినీర్లను మాత్రమే అందించే మామూలు విద్యాసంస్థలుగా దిగజారాయి.1961 ఐఐటిల చట్టం ఆ రకంగా లక్షాలను కోల్పోయింది. ఉద్యోగాలనే లక్షం చేసుకుని, పరిశోధనలకు ప్రాధాన్యత తగ్గించడంతో ఐఐటిలు నెలకొల్పడం వెనుక ఆదర్శం నీరు కారింది. ప్రస్తుతం ఐఐటి లు నాణ్యమైన ఇంజినీర్లను అందిస్తున్నా అనేక రంగాలలో దేశాన్ని ఓటమిపాలు చేస్తున్నాయి. వర్తమాన భారతదేశం తక్షణ ఆందోళనలను చల్లార్చే ఆలోచనాపరులను సృష్టించడం బదులు ఫక్తు సాంకేతిక నిపుణులను మాత్రమే దేశానికి అవి అందిస్తున్నాయి. నిరక్షరాస్యులు అధికంగా ఉన్న దేశానికి విద్యాపరమైన సారథ్యాన్ని అందించేవారు వాటిలో తయారవడం లేదు.దేశ సమస్యలపట్ల పట్టనట్లుగా వ్యవహరించే వారేతప్ప దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేసే మేధావులు వాటిలో రూపొందడం లేదు. వాటి వైఫల్యాలు స్థూలంగా ఇవి : 1) సామాన్య ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనా సరళిని పెంపొందించలేకపోవడం. 2. మానవ, సామాజిక శాస్త్ర విభాగాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వనందువల్ల సమాజానికి అవసరమైన మార్పులు తీసుకురావడంలో వెనుకబాటు.సునిశిత దృష్టిగల రాజకీయ వేత్త కాబట్టి నెహ్రూ ఈ దుస్థితిని ముందే ఊహించారు. కేవలం సాంకేతికతపై ఆధారపడుతూ ఈ సంస్థలు సంకుచిత ధోరణులకు గురవుతాయని ఆయన భావించారు. సాంకేతిక నిపుణులు కేవలం పారిశ్రామిక సంస్థలకు సేవ చేయడానికే పరిమితం కాకుండా మంచి మానవులుగా స్త్రీ, పురుషులను తీర్చిదిద్దగలగాలని ఆయన పథ నిర్దేశం చేశారు. లోపభూయిష్టమైన ఉన్నత విద్యా విధానాలు మన ఐఐటిలను దారి తప్పేలా చేశాయి. సాంకేతిక శాస్త్రానికి మానవతా దృష్టి ఆపాదించడం కాకుండా, మానవ దృక్కోణానికి సాంకేతికతను అద్దేదిగా మన ఉన్నత విద్యా విధానం తయారయింది.

మన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం నుంచి వస్తూత్పత్తి రంగాన్ని, తర్వాత సేవలరంగాన్ని ఆధా రం చేసుకొనే స్థితికి పరిణామం చెందింది. 1990 దశకం నుంచి ఆర్థిక విధానాల రూపకల్పనలో అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలయింది. సేవలరంగంలో, ముఖ్యంగా ఐటి, ఆర్థికరంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చేయడం మన విధానాలకు మూలలక్షం అయింది. స్వలాభ దృష్టితో ఎక్కువ జీతం సంపాదించిపెట్టే ఉద్యోగాలపై, విలాసవంతమైన జీవితంపై దృష్టిపెట్టడం విద్యావంతుల్లో పెరగడంతో మన ఆర్థిక విధానాలు కూడా అదే బాటపట్టాయి.స్థూల దేశీయ ఉత్పత్తి కి సేవల రంగం విస్తృత వాటాను అందించడం నిజమే అయినప్పటికీ, వ్యవసాయ వస్తూత్పత్తి రంగాల వృద్ధికి అది అడ్డంకిగా మారింది. దీనితో ఐఐటి విద్యార్థులకు అంతగా అవకాశాలు లేకుండాపోయాయి. ముఖ్యంగా వ్యవసాయ, వస్తూత్పత్తి రంగాలలో దీర్ఘకాలంపాటు ప్రతిష్టంభన నెలకొనడంతో ఆ చదువుల ఐఐటి విద్యార్థులకు మంచి హోదాగల ఉద్యోగ అవకాశాలు మరింత క్షీణించాయి. సేవల రంగంలో పెద్ద జీతంతో ఉద్యోగాలు లభిస్తున్న నేపథ్యంలో కీలక ఇంజినీరింగ్ చదువులను విడిచిపెట్టి ఐటి ఇంజినీరింగ్‌పై విద్యార్థులు దృష్టిపెట్టడం ఎక్కువయింది. ఐఐటి గ్రాడ్యుయేట్లు కూడా సేవల రంగంపైనే దృష్టి పెట్టారు. ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో పని సామర్థం సంపాదించడానికి కాకుండా ఉద్యోగాలు ఏ విద్యను కోరుతాయో దానిని నేర్చుకోడానికి విద్యార్థులు ఎగబడడం మొదలయ్యాక ఐఐటి విద్య పట్టాలు తప్పింది. ఐటి విద్యా సంస్థల మీడియా ప్రచారాలు, సామాజిక ఒత్తిళ్లు కూడా తోడయ్యాయి. ఐఐటి విద్యా సంస్థలకు పూర్వ వైభవం తెచ్చిపెట్టే ఆశలను వమ్ముచేస్తూ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఐఐటి విద్యార్థుల ట్యూషన్ ఫీజులను పెంచే నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రూ. 90 వేల నుండి రూ. 2 లక్షలకు ఆ ఫీజును కేంద్రం పెంచింది. ఇది సమాజాన్ని కులాలు, వర్గాలు, లింగ భేదాలతో మరింతగా చీల్చే నిర్ణయమేఅని చెప్పక తప్పదు. 2011లో అనీల్ కకోద్కర్ కమిటీ ఫీజుల హెచ్చింపును సూచించినప్పుడు యుపిఎ ప్రభుత్వం ఆ సిఫార్సును పక్కనపెట్టింది. ఫీజులు పెంచితే ఐఐటి విద్యను ఆశించే అనేకమంది అవకాశాలు దెబ్బతింటాయని యుపిఎ ప్రభుత్వం పేర్కొంది. సమాజంలోని బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అత్యున్నత విద్యావకాశాలను ఆ నిర్ణయం దూరం చేస్తుందని కూడా అప్పటి ప్రభుత్వం భావించింది. నేటి ప్రభుత్వానికి లోపించింది. ఇప్పటి బిజెపి ప్రభుత్వం ఫీజుల హెచ్చింపుకి తలూపి విద్యను వ్యాపారపరం చేయడాన్ని బలపరిచింది. దేశంలోకి విదేశీ యూనివర్శిటీల ప్రవేశాన్ని సులభతరం చేయడానికే ఆ నిర్ణయం తీసుకున్నట్లు నీతి ఆయోగ్ ఇటీవల ప్రధాని కార్యాలయానికి సమర్పించిన ఒక నివేదికలో పేర్కొంది. రిజర్వుడు వర్గాల విద్యార్థులను ఫీజుల చెల్లింపు నుంచి మినహాయించినప్పటికీ వాటి పెంపు వారిపై ద్వేషాన్ని పెంచి రిజర్వేషన్ వ్యతిరేక వాదనలు పెరిగే ప్రమాదం తల ఎత్తుతుందని నిపుణులు చెబుతున్నారు.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *