Home > Editorial > అన్నింటికి ఆధారమేనా……

అన్నింటికి ఆధారమేనా……

కాలానికి అనుగుణంగా అందరూ మారాలి
డిజిటిల్‌ అక్షరాస్యత అంతా మిధ్య

aadhar cards(1)_apduniaసకల రోగ నివారిణి జిందా తిలస్మాత్’ అన్న చందాన తయారైంది కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహార శైలి. నిన్న మొన్నటి వరకు నల్లడబ్బు పేరుతో నానా హంగామా చేసిన వారు తాజాగా ఆధార్ కార్డు పేరుతో రచ్చ చేస్తున్నారు. ఆధార్ కార్డు వ్యవహారం ఎంతగా శృతి మించిందంటే ప్రజలపై ప్రభుత్వానికి నమ్మకం లేనంతగా..అలాగే ప్రజలకు ప్రభుత్వంపై అపనమ్మకం పెరిగేంతగా..మొదట కేవలం గుర్తింపు కార్డుగానే పరిగణిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రజల నుంచి తమకు కావాల్సిన వివరాలు సేకరించుకునేందుకు ఉపయోగిస్తుందా అన్న అపోహలు తలెత్తేలా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఆధార్‌లో ఇచ్చిన ఆధారాల ప్రకారం సబ్సిడీలు ఎత్తివేస్తారనే ప్రచారం జరిగింది. ఎన్నికల సందర్భంగా కేవలం ఆధార్‌ను మాత్రమే గుర్తింపు కార్డుగా పరిగణిస్తామని ప్రకటించిన ఎన్నికల సంఘం కూడా తర్వాత తమ అభిప్రాయం మార్చుకుని మిగతా గుర్తింపు కార్డులకు కూడా అనుమతిచ్చింది. ఆధార్ కేవ లం గుర్తింపు కార్డు మాత్రమేనని, దాన్ని తప్పనిసరి చేయాల్సిన పనే లేదని అత్యున్నత న్యాయస్థానం రెండేళ్ల క్రితమే స్పష్టం చేసినా కేంద్రం మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. చివరకు ఆధార్ వ్యవహారం ప్రాథమిక హక్కుల భంగం వరకు వెళ్లి దానిపై రాజ్యాంగ ధర్మాసనం విచారించే వరకు వచ్చింది. ఆధార్ గురించి చర్చించే ముందు దాని పూర్వాపరాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడ ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ప్రజలందరికీ ఒకే గుర్తింపు కార్డు ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ ప్రారంభించారు. నిజానికి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలోనే దేశ పౌరులందరికీ ఒకే గుర్తింపు కార్డు ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే 2003లో అప్పటి హోంమంత్రి అద్వానీ సిటిజెన్ షిప్ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిలో కొన్ని సవరణలు ప్రతిపాదించి చివరకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని నేతృత్వంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా  నెలకొల్పారు. ఆధార్ సృష్టికర్తగా భావించే నిలేకని కూడ తాను అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది ఒకటి అని వ్యాఖ్యానించడం జరిగింది. అనేక గందరగోళాల నడుమ ఎట్టకేలకు దేశ వ్యాప్తంగా ఆధార్ నమోదు ప్రక్రియను చాలా విస్తృతంగా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు దీనికి ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది.ఆధార్‌పై ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేస్తూ సుప్రీం కోర్టు 2015లోనే విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆధార్‌ను కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే చూడాలని, అవసరమైనంత మేరకే సమాచారం తీసుకోవాలని, ప్రజల గోప్యతకు ఎక్కడా భంగం వాటిల్లకూడదని ధర్మాసనం ఆనాడే స్పష్టం చేసింది. ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని సుప్రీం ఆనాడే స్పష్టం చేసింది.సుప్రీం కోర్టు మార్గ దర్శకాలను సైతం పక్కన పెట్టి ప్రభుత్వంలో భాగమైన ఆదాయ పన్ను శాఖతో సహా బ్యాంకులు, ఇతర సేవా సంస్థ లు చివరకు సెల్‌ఫోన్ సంస్థలు కూడ ఆధార్ అనుసంధానం చేయాలని, లేకుంటే లావాదేవీలు నిలిపి వేస్తామని హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. మోడీ సర్కార్ నల్లధనం పేరుతో చేసిన ప్రహసనాల తర్వాత ఆదాయ పన్ను శాఖ మరీ రెచ్చిపోవడమే కాదు ప్రజలంతా దొంగలనే భావన కలిగేలా చేస్తోంది. పన్ను ఎగవేతదారులను, సాధారణ ప్రజలకు ఒకే గాటన కట్టి కేవలం ఒక ప్రభుత్వ శాఖగా కాకుండా సర్వం తానే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇక ప్రభుత్వ ఆజమాయిషీలో పని చేయాల్సిన బ్యాంకుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.ఖాతాదారులు మా దేవుళ్లనే బోర్డులను మూలననెట్టి బ్యాంకులకు వచ్చిన వారిని దోషులుగా చూస్తున్నారు. ఆధార్ లేనిదే అసలు ఖాతాలు తెరవని బ్యాంకులు ఇప్పుడు అనుసంధానం పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపాయి. బ్యాంకులకూ చివరకు సెల్‌ఫోన్ కంపెనీలకు కూడా ఆధార్‌లోని వ్యక్తిగత వివరాలు ఎంతవరకు అవసరమో ఎవరికీ అంతుచిక్కని రహస్యం. వ్యక్తిగత వివరాలు వెల్లడించాలని ఒత్తిడి చేయడం ప్రాథమిక హక్కులకు భంగకరమంటూ దాఖలైన పలు పిటీషన్లను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ఖేహార్ నేతృత్వంలో విచారణ మొదలుపెట్టింది. వ్యక్తిగత వివరాలు ప్రాథమిక హక్కులో భాగం కాకపోయినా ఆధార్ అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి మాత్రం కచ్చితంగా ప్రజల హక్కులకు భంగకరమే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *