Home > Editorial > అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో

అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో

ఇస్రో మరో అడుగు
టీ కప్పులో సుప్రీం తుఫాను

isroapduniaభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని దాటింది. పీఎస్‌ఎల్‌వీ- సీ40ని జనవరి 12 ఉదయం వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి భారత కీర్తిపతాకను సమున్నతంగా నిలిపింది. ఒకేసారి 31 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష పరిశోధనలో మన ఘనతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ దఫా పంపిన 31 ఉపగ్రహాల్లో 28 వివిధ దేశాలకు చెందినవి కాగా, మూడు భారత్‌కు చెం దిన కార్టోశాట్-2ఇ, మైక్రో, నానో (ఐఎన్‌ఎస్) ఉపగ్రహాలున్నాయి. ఈసారి పూర్తిగా దేశీయంగా ఉపగ్రహాన్ని నిర్మించి భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించటం మరో విశేషం. ఒకేసారి పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను పంపటంలో అమెరికా, రష్యాలాంటి అగ్రరాజ్యాల ను సైతం వెనక్కునెట్టి అంతరిక్ష పరిశోధనలో భారత్ అత్యున్నత శిఖరాన నిలుస్తున్నది. 2013 లో అమెరికా 29 ఉపగ్రహాలను, ఆ మరుసటి సంవత్సరంలో రష్యా 37 ఉపగ్రహాలను పంపి తమ అంతరిక్షశక్తిని ఘనంగా చెప్పుకున్నాయి. ఆ క్రమంలోనే భారత్ గత ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి తాము ఎవరికీ తీసిపోమని చాటిచెప్పింది ఇస్రో. ఈ విజయం అంత సులువుగా అందలేదు. విక్రమ్ సారాబాయి చేసిన కృషి, ఆయన కన్న కలలు సాకారం కావడానికి ఎంతో కాలం పట్టింది. అణుశక్తి పితామహుడు హోమీ బాబా పర్యవేక్షణలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మెట్టుమెట్టుగా ముందుకు సాగింది. భారత అంతరిక్ష విజయాల వెనుక ఎంతో కృషి ఉన్నది. ప్రారంభంలోనే రాకెట్లను గగనతలంలోకి పంపడం సాధ్యమయ్యే పనికాదు. మొదటి దశలో రష్యా, అమెరికా సాయంతో రాకెట్లను నిర్మించి, అంతరిక్షంలోకి పంపిన ఇస్రో ఆ క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న ది. వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకొని ముందుకు పోయింది. గత నెలలో ప్రయోగించతలపెట్టిన నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్-1హెచ్ విఫలమైంది. దీంతో పోలార్ ఉపగ్రహ వాహకనౌక సీరీస్‌లో పీఎస్‌ఎల్‌వీ-సీ39 ప్రయోగం విఫలమైంది. అయినా ఆ ఓటమితో కుంగిపోక నాలుగు నెలలు తిరుగకమందే అకుంఠితదీక్షతో పీఎస్‌ఎల్‌వీ-సీ40ని దిగ్విజయవంతంగా ప్రయోగించి అవరోధాలెన్ని ఎదురైనా ఆగేది లేదని చాటిచెప్పింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది కార్టోశాట్ సిరీస్‌లో భాగంగా పం పించిన ఉపగ్రహం కార్టోశాట్-2ఇ. ఇది అంతరి క్షం నుంచి భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించిన స్పష్టమైన) చిత్రాలను అందించగలుగుతుంది. ఒక చదరపు మీటర్ పరిధిలోని ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధంగా చిత్రాలు తీసి పంపగలిగే శక్తి ఉండటం కార్టోశాట్-2ఇ ప్రత్యేకత. ఈ ఉపగ్రహం భారత్‌కు సరిహద్దు ల వెంట ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సహకరించనున్నది. చైనా, పాకిస్థాన్ దేశాలతో సుదీర్ఘమైన సరిహద్దు కలిగి ఉన్న భారత్ సరిహద్దు రక్షణలో కార్టోశాట్-2ఇ ప్రత్యేక పాత్రను పోషించనున్నది. అదను దొరికితే సరిహద్దును దాటేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు, చొరబాట్లకు పాల్పడుతున్న పాకిస్థాన్ కుయుక్తులకు కార్టోశాట్ ఉపగ్రహం చెక్ పెట్టనున్నది. దీని సాయంతో సరిహద్దు రక్షణ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.ఇప్పటిదాకా వంద ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి పంపిన ఇస్రో ఆధునిక జీవనానికి పునాది వేసింది. శాస్త్ర, సాంకేతిక ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేసి సమాచార, ప్రసారమాధ్యమాల్లో పెద్ద విప్లవాన్నే ఆవిష్కరించింది. ఇంకా జనజీవితానికి ఎదురవుతున్న ఎన్నో సవాళ్లను పరిష్కరించింది. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యావరణం.. ఇలా ఏ రంగమైనా కచ్చితమైన లక్ష్యాలతో సమస్యలకు పరిష్కారాలను ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు చూపుతున్నాయి. తుఫాను, సునామీలాంటి ప్రమాదకర విపత్తుల రాకపోకల గురించి ముందస్తుగా సమాచారమిచ్చి మన మనుగడకు ఇస్రో ఉపగ్రహాలు అండగా నిలుస్తున్నాయి. ఉపగ్రహాలు ఇస్తున్న సమాచారంతోనే ఎక్కడ ఎంత జల సిరులు ఉన్నదీ, సముద్రాల్లో మత్స్యసంపద ఎక్క డ ఎక్కువగా ఉన్నదీ తెలుసుకోగలుగుతున్నాం. నేల స్వభావాన్ని సులభంగా అంచనా వేయగలుగుతున్నాం. అంతరించి పోతున్న జీవరాశిని గుర్తించి కాపాడుకోవడానికి అంతరిక్షంలోని మన ఉపగ్రహాలు ఇస్తున్న సమాచారమే దిక్కు. ఇస్రో శాస్త్ర ప్రయోగాల్లోనే కాదు, ఆర్థిక ఫలితాల్లోనూ ముందున్నది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించిపెడుతున్నది. విదేశీ ఉపగ్రహాలను అమెరికా కన్నా తక్కువకు ఇస్రో అంతరిక్షంలోకి పంపిస్తూ ఇతర దేశాల మన్ననలను పొందటం గమనార్హం. ఈ విజయపరంపరలోనే రానున్న రోజులు ఇస్రోకు మరింత కీలకం కానున్నాయి. వరుసగా అనేక ప్రయోగాలున్నాయి. జీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టులు ఈ పరంపరలో ఉన్నాయి. చంద్రయాన్-2ను ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లోకానీ చేపట్టే ఆలోచనలో ఇస్రో ఉన్నది. అలాగే ఆదిత్య-1 పేరుతో సౌర వ్యవస్థ అధ్యయనం కోసం రాకెట్ల ప్రయోగానికి ఇస్రో కసరత్తు ప్రారంభించింది. వీటికి తోడుగా హైత్రోపుట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో ప్రణాళికలు రచిస్తున్నది. దీంతో మరింతగా సమాచార, సాంకేతిక పరిజ్ఞానం మనకు చేరువ కానున్నది. నాలుగు దశాబ్దాల క్రితం ఆర్యభట ఉపగ్రహంతో ఆరంభమైన ఇస్రో ప్రయా ణం శతాధిక లక్ష్యాలతో దూసుకెళ్తున్నది. నిప్పులు చిమ్ముతూ నింగికెగురుతున్నది మన ఉపగ్రహాలే కాదు, మన ఘనతా, మన సత్తా. ఇస్రోకు శత వందనాలు.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *