Home > Health > ఇలా చేస్తే ఆయుష్షు పెరుగుతుంది..!

ఇలా చేస్తే ఆయుష్షు పెరుగుతుంది..!

కీళ్ల నొప్పుల పాలిట వరం
వైద్యశాస్త్రంలోనే అద్భుతం...తలలు మార్చేసిన వైద్యుడు!

fruits-apduniaజపాన్‌లో వందేళ్లకు పైబడిన వాళ్లు ఎక్కువ.. గ్రీస్‌లో సగటు ఆయుష్షు 90 ఏళ్ల పైమాటే.. కోస్టారికాలోనూ దీర్ఘకాలం జీవించే వారు బోలెడు మంది..! పత్రికల్లో అప్పుడప్పుడూ కనిపించే ఈ వార్తలు చూస్తే ఏమనిపిస్తుంది? బ్లూ జోన్‌లుగా పిలిచే ఈ ప్రాంతాల్లోనే మనుషులు ఎక్కువ కాలం ఎలా బతకగలుగుతున్నారనేగా? ఈ విషయం తెలుసుకోడానికే డాక్టర్‌ డాన్‌ బుట్‌నెర్‌ నేతృత్వంలోని ఓ బృందం ఇటీవల అధ్యయనం చేసింది. వైద్యులు, మానవ పరిణామ శాస్త్రవేత్తలు, జనాభా, పౌష్టికాహార, వ్యాధి వ్యాప్తి నిపుణులున్న ఈ బృందం.. అన్ని బ్లూ జోన్‌ ప్రాంతాల్లో తిరిగి అక్కడి వారి జీవన విధానాలు పరిశీలించింది.దీర్ఘాయుష్షుకు తొమ్మిది కారణాలు ఉన్నాయని సూత్రీకరించింది.

అవేంటంటే..
– 1. రోజువారీ పనుల్లో భాగంగా శరీరానికి శ్రమనిచ్చే పనులు చేయడం.. టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడమన్నది ఇక్కడి వారికి తెలియదు.
– 2. జీవితానికి పరమార్థం వెతుక్కోవడం.. జపానీస్‌ భాషలో దీన్ని ఇకగాయి అంటారట.
– 3. వృద్ధాప్య సమస్యలకు ప్రధాన కారణమైన ఒత్తిడిని దూరంగా ఉంచడం. అలవాటుపడిన వేగంతో కాకుండా భిన్నంగా రోజువారీ పనులు చేసి మరిన్ని పనులకు సమయం సృష్టించుకుంటే ఒత్తిడిని దూరంగా ఉంచడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదనంగా చేసే పనులు ఏవైనా కావచ్చు.. ఓ కునుకు తీయడం మధ్యధరా ప్రాంత వృద్ధులకు అలవాటైతే.. జపాన్‌లోని ఒకినావా ద్వీపవాసులు తేనీటి ఉత్సవాల్లో మునిగి తేలతారు. కొంతమంది ప్రార్థనలు చేసి ఒత్తిడి తగ్గించుకుంటారు.
– 4. పొట్టకు పట్టేంత కాకుండా కొంచెం ఖాళీ ఉండేలా తినడమనే సూత్రాన్ని దీర్ఘాయుష్షు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజలు ఆచరిస్తున్నారు.
– 5. శాఖాహారం ఎక్కువగా.. మాంసాహారం, చేపలు, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవడం ఎక్కువ కాలం బతికేందుకు సాయపడతాయి.
– 6. మద్యపానం చేయని వారి కంటే ఓ పరిమితికి లోబడి తాగే వారు ఎక్కువ కాలం బతుకుతారు.
– 7. ఆరోగ్యకర అలవాట్లను ఆచరించే, ప్రోత్సహించే వారితో సంబంధాలు కలిగి ఉండటం.
– 8. మతపరమైన గ్రూపుల్లో భాగస్వామి కావడం.
– 9. భార్య, పిల్లలే కాకుండా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులతో మంచి సంబంధాలు ఉండటం.
ఏ ప్రాంతంలో ఎంత‌కాల‌మంటే?
– వందేళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉన్న ప్రాంతం బార్బాగ్లియా. మధ్యధరాలోని ద్వీపప్రాంతమిది. కోస్టారికాలోని నికోయా రెండో స్థానంలో ఉంది.
– అత్యంత వయోవృద్ధులైన మహిళలున్న ప్రాంతం జపాన్‌లోని ఒకినావా ద్వీపం.
– వయోవృద్ధులైనా తక్కువ మతిమరపు లక్షణాలున్న వారు ఇకారియాలో ఎక్కువగా ఉన్నారు. గ్రీస్, టర్కీల మధ్య సముద్రంలోని చిన్న ద్వీపం ఇది.
– అమెరికాలో లాస్‌ ఏంజిలెస్‌ తూర్పున లోమాలిండ అనే ప్రాంతం ఉంది. సెవెన్త్‌ డే అడ్వెంటిస్ట్‌ చర్చి విధానాలు అనుసరించే ఇక్కడి ప్రజల సగటు ఆయుష్షు ఆ దేశంలోని ఇతర ప్రాంతాల వారి కన్నా పదేళ్లు ఎక్కువ!

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com