Home > Politics > నిందలు వేసి పబ్బం గడుపుకుంటున్న చంద్ర‌బాబు

నిందలు వేసి పబ్బం గడుపుకుంటున్న చంద్ర‌బాబు

పవన్ ప్లాన్ ఏంటి..?
స్విట్జర్లాండ్ లో టీఆర్ ఎస్ పార్టీ శాఖ ఆవిర్భావం

kvp-ramachandrarao-apdunia-మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు మంచి నటుడు
-సుదీర్ఘ లేఖలో కేవీపీ విమర్శలు

విభజన హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్న తమను అభివృద్ధి నిరోధకులుగా, సీమాంధ్ర ప్రజల ద్రోహులుగా చిత్రీకరించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారని, ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నామని తమపై నిందలు వేసి నాలుగేళ్లు పబ్బం గడుపుకొన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. ఈ మేరకు శనివారం చంద్రబాబుకు బహిరంగ లేఖను రాశారు. ఆ సుదీర్ఘ లేఖలో కేవీపీ ఏమన్నారంటే..‘2019 ప్రథమార్ధంలో లోక్ సభకు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ కు జరగవలసిన సాధారణ ఎన్నికలు 2018 రెండో అర్ధభాగంలోనే జరగవచ్చుననే వార్తలు ప్రచారంలో పెట్టిన వారికి ధన్యవాదాలు తెలియచెపుతూ నా ఈలేఖను ప్రారంభిస్తున్నాను. ఆ వార్తలలో వాస్తవం సంగతి పక్కనపెడితే, మీకు మరోసారి విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టం గుర్తుకు రావడంతో పాటు, ఏ ఏ విభజన హామీల అమలులో కేంద్రం ఇప్పటికీ చేయవలసినది ఏమిటో సూచిస్తూ, ఒక 16 పేజీల వినతి పత్రాన్ని తయారు చేసుకొని ప్రధాని వద్దకు హఠాత్తుగా పరిగెత్తుకెళ్లవలసిన అవసరాన్ని ఈ వార్తలు కల్పించాయి. అంతే కాదు, విభజన అశాస్త్రీయంగా జరిగిందని, అవసరమైతే విభజన హామీల సాధన కోసం కోర్టులకు కూడా వెళతానని బీరాలు పలుకవలసిన పరిస్థితిని కూడా ఈ వార్తలు కల్పించాయి. ఇక అధికారాన్ని బాధ్యతగా కాకుండా, అవకాశంగా భావించి ఆనందిస్తున్న మీలాంటి కొందరికి అధికారంలోకి వచ్చి అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయాయా అని ఆశ్చర్యం గా అనిపించినా – ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు వచ్చి తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగ యువతకు, పోలవరం పూర్తయి తమకు సాగునీరు, త్రాగునీరు లభిస్తుందని భావించిన రైతులకు, తమకు ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి వచ్చి తమ జీవితాలు బాగుపడతాయి అని ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర- రాయలసీమ వాసులకు, ప్రత్యేక రైల్వే జోన్ రావడం వల్ల ఉత్తరాంధ్ర ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని భావించిన ఉత్తరాంధ్ర ప్రజలకు, కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి అయితే రాయలసీమ వాసులకు ఉపాధి లభిస్తుందని కలలుగన్న ఆ ప్రాంత ప్రజలకు, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ పూర్తి అయితే తమ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని భావించిన కోస్తా ఆంధ్ర ప్రజలకు, దుగరాజపట్నం పోర్ట్ తమ జాతకాలు మారుస్తుందని ఆశించిన ఆప్రాంత ప్రజలకు, విభజన వల్ల అన్యాయానికి గురై- విభజన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్ల తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూసిన సీమాంధ్ర ప్రజలకు మాత్రం ఈ నాలుగేళ్లు క్షణమొక యుగంగా గడిచాయి. ఇక నాలుగేళ్లు అధికారం చెలాయించిన తరువాత, కొలంబస్ అమెరికాను, వాస్కోడగామా ఇండియా ను కనిపెట్టినట్లు విభజన అశాస్త్రీయం గా జరిగిందని పరిశోధించి కనిపెట్టి.. మొసలి కన్నీరు కారుస్తున్న మీ నటనా చాతుర్యాన్ని చూసి- ఆస్కార్ అవార్డు పొందిన నటులు సైతం మీరు రాజకీయాలకు రాకుండా నటనా రంగానికి వచ్చి ఉంటే వారి పరిస్థితి ఏమయ్యేదోనని బెంబేలెత్తుతున్నారు. అశాస్త్రీయ విభజన అనివార్యమైనందున, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగకూడదనే .. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి కేంద్ర ఖర్చుతో పూర్తి చేయడం, వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ను త్వరితగతిన పూర్తిచెయ్యడం, దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ల నిర్మాణం, వైజాగ్ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడం, రాయలసీమ – ఉత్తరాంధ్రల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ఇవ్వడం, అనేక కేంద్ర విద్యా సంస్థలను ఆంధ్ర లో ఏర్పాటు చేయడం, ఆర్ధిక లోటు భర్తీ వంటి అనేక నిబంధనలు విభజన చట్టంలో పెడితే..అవన్నీ నెరవేర్చమని మోడీ ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేక..ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.. అశాస్త్రీయ విభజన అంటూ నాలుగేళ్ళ తరువాత ఇప్పుడు కన్నీరు కార్చడం చూసి జనం ముక్కున వేలేసుకొంటున్నారు. కుటుంబం ఉన్నా పట్టించుకోకుండా ప్రతిక్షణం రాష్ట్రాభివృద్ధికే అంకితం చేస్తున్నానని డప్పు వాయించు కొంటున్నమీరు, కుటుంబాన్నే గాలికి వదిలివేసి జాతి సేవకు అంకితం అయ్యానని చెప్పుకొంటున్న మోడీ గారు – అశాస్త్రీయం జరిగిన విభజనను సరిదిద్దడానికి గత నాలుగేళ్లు శాస్త్రీయంగా చేసిన మరమ్మతులు ఏమిటని జనం చర్చించుకొంటున్నారు. అధికారంలో ఉన్న నాలుగేళ్లు బీజేపీతో అంటకాగుతూ, విభజన హామీలను తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పణంగాపెట్టి- మీరు స్వంతలాభాలను చూసుకొన్నారనేది కాదనలేని సత్యమని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. పోలవరం నిర్మాణ భాధ్యతను విభజన చట్టానికి వ్యతిరేకంగా మీ చేతులలోకి తీసుకోవడంలోనూ, హెరిటేజ్ ను “సకాలంలో” ఫ్యూచర్ గ్రూపునకు అమ్మడంలోనూ, డీమానిటైజేషన్ సమయంలో పాతనోట్లను ఫ్యూచర్ గ్రూప్ నకు చెందిన బిగ్ బజార్ లలో మార్పిడికి కేంద్రం అనుమంతించేలా చేయడంలోనూ.. మీరు చూపిన చొరవ – ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ వంటి విభజన హామీల సాధనలలో మీరు చూపి ఉంటే.. ఈరోజు తమ పరిస్థితి వేరుగా ఉండేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోలవరం కాంట్రాక్టర్ ను మార్చడం విషయంలోనో, కాంట్రాక్టు రేట్ లను మార్చుకోవడం విషయం లోనో, రాజధాని చుట్టుపక్కల భూములను కారుచౌకగా అస్మదీయులకు అంపకాలు చేసే విషయంలోనో, వివిధ పథకాల క్రింద కేంద్రం ఇస్తున్న నిధులలో దామాషా ప్రకారం ఎవరికి రావాల్సిన వాటాలు వారికి దక్కడం లేదనో, ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ.. మీకు ఈ పరిస్థితి కల్పించిన బీజేపీపై కోపంతోనో..తరుముకొస్తున్న ఎన్నికలలో మళ్ళీ బీజేపీతో అంటకాగితే అధికారం దూరం అవుతుందేమో అన్న బాధతోనో మీకు ఆంధ్ర ప్రజలపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చి..ఆంధ్ర కు విభజన వల్ల జరిగిన అన్యాయానికి ముక్కుచీదుతూ, కేంద్రం పై బయటకు కన్నెర్ర చేస్తునట్లు నటించడం ప్రారంభించారని, హామీలు అమలు చేయని పాపాన్ని బీజేపీ నెత్తిపై పడవేసి..ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మీరు ఇప్పుడు గుండెలు బాదుకొంటూ జనం సానుభూతిని పొందాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా అధికారాన్ని అనుభవిస్తూ, విభజన హామీలు అమలు చేయడంలో మీ బాధ్యత ఏమీ లేనట్లు..కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో మీకు సంబంధమే లేనట్లు-మీరు అమాయకత్వాన్ని అతిరమ్యంగా అభినయిస్తున్నా…ఆ పాపంలో మీభాగం ఎవరూ తీసుకోవడానికి సిద్ధంగా లేరని గుర్తించలేక పోతున్నారని అనుకొంటున్నారు. ఇప్పుడు విభజన హామీల అమలు చేయని నేరాన్ని పూర్తిగా బీజేపీ పై పడవేసి మరో మారు రాబోయే ఎన్నికల ముందు బీజేపీని వదిలించుకొని ఈ తప్పులో మీ పాత్రే లేనట్లు ప్రజల ముందు నటించి పులుకడిగిన ముత్యంలా బయటపడాలని మీరు ప్రయత్నం చేస్తూ- ఎన్నికల ముందు ఇలా విడిపోయి, జనం సానుభూతి తో ఎన్నికలలో విజయం సాధించి.. మళ్ళీ కేంద్రంలో ఒకవేళ బీజేపీ గెలిస్తే దానితో అంటకాగవచ్చున్నదే మీ పన్నాగమని – అయితే గతంలో యన్.టి.రామారావు గారిని వారి కుటుంబసభ్యులను, కమ్యూనిస్ట్ పార్టీలను, ఒకసారి ఇదే బీజేపీ పార్టీని మీ “యూజ్ అండ్ త్రో” రాజకీయాలలో భాగంగా అవసరానికి వాడుకొని వదిలివేయడం వల్ల మీ రాజకీయ జీవితం పై గాఢంగా ముద్రింపబడిన “పాపాల మచ్చలు” ప్రస్ఫుటంగా కనిపిస్తుండడం వల్ల మీ ఈ కొత్త పన్నాగం ఫలించకపోవచ్చునని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం గానీ, హామీల సాధనలో మీరు గానీ గత నాలుగు సంవత్సరాలుగా చేసింది ఏమిలేదని మొన్న మీరు ప్రధానమంత్రి గారికిచ్చిన వినతిపత్రంతో రుజువు అయింది. కనీసం ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల ముందు రాష్ట్రానికి చెందిన ఎంపీలందరిని సమావేశపరచి రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న విషయాలను వారికి తెలియజేసిి, వాటిని సాధించడానికి వారిని కార్యోన్ముఖులను చేసే సంప్రదాయం గత ప్రభుత్వాల హయాంలో ఉంటే.. దాన్ని తుంగలో తొక్కి, కనీసం మీ పార్టీ ఎంపీలను కూడా హామీల విషయంలో పోరాడకుండా చేయడంతో పాటు – ప్రతిపక్షంలో ఉంటూ విభజన హామీల విషయంలో మా వంటి వారు కేంద్రంతో పోరాటం చేస్తుంటే సహకరించకుండా ఉండాలని మీ ఎంపీలకు సూచనలు పంపించిన పాపం కారణంగా ఈ రోజు విభజన హామీలు అమలుకాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విభజన హామీల సాధనకు కేంద్రంతో పోరాడుతున్న మమ్మల్ని అభివృద్ధి నిరోధకులుగా, సీమాంధ్ర ప్రజల ద్రోహులుగా చిత్రీకరించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తూ, మేము ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నామని నిందలు వేసి నాలుగేళ్లు పబ్బం గడుపుకొన్నారు.వరకు పోలవరానికి ఎటువంటి కండీషన్లు పెట్టకుండా పూర్తి ఖర్చును కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని నేను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తే.. ప్రాజెక్ట్ ను ఆపడానికి కోర్టులకు వెళుతున్నారని శాసనసభ సాక్షిగా నాపై నిందలు మోపారు. అసలే లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న రాష్ట్రం పై ‘పోలవరం’ ఖర్చు భారం కూడా పడకూడదని నేను వేసిన ఈ వ్యాజ్యంలో హై కోర్టులో కౌంటర్ వేయడానికి ఇచ్చిన గడువు దాటి రెండు నెలలు గడిచి పోయినా, ఇంత వరకు విభజన చట్టం ప్రకారం ‘పోలవరం’ పూర్తి ఖర్చు ప్రస్తుత ధరల ప్రకారం కేంద్రమే భరించాలని, ఈ ఖర్చును భరించడంలో కేంద్రం అనవసరమైన కండిషన్ లు పెడుతున్నదని చెప్పటానికి భయపడుతున్న మీరు.. ఇక ఇప్పుడు మీకు ఎన్నికలు గుర్తు రాగానే అవసరమైతే విభజన హామీల సాధనకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని సన్నాయి నొక్కులు నొక్కారు. అలాచెప్పిన ఇరవై నాలుగు గంటలు గడవకముందే, మోడీ ప్రభుత్వం బెదిరించిందో, భయపెట్టిందో, లేక ప్రలోభపెట్టిందో గానీ, ఇంతలోనే మాటమార్చి కేంద్రంపై కేసులు వేస్తానని అనలేదని, కేసులు వేస్తానంటే బీజేపీని వ్యతిరేకించినట్లు కాదని కొత్త పల్లవి అందుకొన్నారు. అసలు మీరు కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎందుకు ఇంత భయపడుతున్నారా అన్నది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు. కేసులు వేస్తామని అంటున్నారు.. మోడీ ప్రభుత్వంపై వెయ్యరు. భయం! కేసీఆర్ ప్రభుత్వంపై వెయ్యరు. ఇంకా భయం!! ఇక బీజేపీ ని వ్యతిరేకించరు. ఎందుకంటే అమిత్ షా గారంటే భయంతోకూడిన గౌరవం!!! మరి విభజన హామీల సాధనకు ఏ న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు? ఎవరిమీద కేసు వేస్తారు? మీ కేసులలో ప్రతివాదులు ఎవరు? చట్టం ప్రకారం ఆస్తుల పంపకానికి ఒప్పుకోవాల్సిన కేసీఆర్ ప్రభుత్వాన్నిగానీ, రెండు రాష్ట్రాల మధ్య పంపకాలలో ప్రతిష్టంభన ఏర్పడితే పరిష్కరించాల్సిన కేంద్రాన్ని గానీ, చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావలసినవి ఇవ్వడంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న మోడీ గారి ప్రభుత్వాన్నిగానీ ప్రతివాదులుగా చేయకుండా, మీరు కేసులు ఎవరిమీద వేస్తారో తెలుసుకోవాలని మాలాంటి అమాయకులు మొదట్లో కొంత కుతూహలపడ్డాం. కానీ, చెమటోడ్చి, శ్రమించి, ఒంటిచేత్తో పార్టీని నిర్మించిన యన్ టి రామారావు గారు, పార్టీలో ఏదో ఒక మూల ఉండి ప్రజలకు సేవ చేస్తారనుకొని మిమ్ములను చేరదీస్తే, తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు ఆయనకే వెన్నుపోటు పొడిచి, చివరకు పార్టీనే ఆయననుంచి లాక్కొని, ఆయన్నే దోషిగా చిత్రీకరించిన చరిత్ర మీది. అదేవిధంగా ఇప్పుడుకూడా మీరు ఎదో చేస్తారని మిమ్మల్ని ఎన్నుకొన్న ప్రజలనే ప్రతివాదులుగా/ దోషులుగా చిత్రీకరించి.. ప్రజలు విభజన హామీలు సాధించడానికి ధర్నాలు, హర్తాళ్లు ఆందోళనలు, బంద్ లు చేయక పోవడం వల్లే కేంద్రం అవి నెరవేర్చలేదని..ఇందులో మీ తప్పేమి లేదని చెప్పినా చెప్పగల మీ వంచనా చాతుర్యాన్ని మరోసారి ప్రదర్శించినా.. ప్రతిసారి ప్రజల కళ్ళకు ఇలా గంతలు కట్టగలననుకోవడం మీ భ్రమే కాగలదు. గుర్తుంచుకోండి .కాబట్టి ఎన్నికల కోసం వేసే ఈ నాటకాలు కట్టి పెట్టండి. సాధారణ ఎన్నికలలోపు కేంద్రం ప్రవేశపెట్ట బోయే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది అని మర్చిపోకండి. ఈ బడ్జెట్ లో పోలవరానికి పూర్తి నిధులు, రాజధానిలో మౌలిక సదుపాయాలకు సంబందించిన నిధులు, రిసోర్స్ గ్యాప్ నకు సంబంధించిన నిధులు వంటివి సాధించలేకపోతే .. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని గ్రహించలేని అమాయకులు కాదు మీరు. రాకపోతే నష్టం ప్రజలకే కదా..నాకేమిటి అని నిర్లక్ష్యం వహించకండి. బడ్జెట్ సమావేశాల లోపు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరిని పార్టీలకు అతీతంగా సమావేశపరచండి. కేంద్రం నుంచి సాధించవలసిన వాటికోసం ఉమ్మడి పోరాటం చేయమని మీ ఎంపీలకు సూచించండి. అంతేకాక, రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని కూడా ప్రధాని వద్దకు తీసుకు వెళ్లి..విభజన హామీలు అన్ని నెరవేర్చవలసినదేనని, వాటికి సంబంధించిన పూర్తి స్థాయి నిధులు ఈ బడ్జెట్ లో కేటాయించవలసినదేనని పట్టుపట్టి – మీరు పదేపదే చెప్పుకొంటున్నట్లు “పోలవరం ముంపు మండలాలను” ఆంధ్రాలో కలిపి తీరవల్సిందేనని బెదిరించి, మోడీ మెడలు వంచి సాధించిన విధానం ఒక్కసారి గుర్తు తెచ్చుకొని, ఒకవేళ నిజంగా అది నిజమే అయితే, అదేవిధంగా మరొక్క సారి జూలు విదిల్చండి..మోడీ ప్రభుత్వం పై సింహంలా లంఘించి విభజన హామీలు సాధించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇక సీమాంధ్ర ప్రజలు పాలన తమ మధ్య నుంచే సాగించమంటున్నారనే నెపంతో హఠాత్తుగా రాజధానిని హైద్రాబాదు నుంచి తరలించుకుపోవడానికి దారితీసిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ముంపు మండలాల విషయంలోలా ఇప్పుడు మీరు జూలు విదిల్చలేననుకొంటే కనీసం మీ ఎంపీలనైనా దువ్వి కేంద్ర ప్రభుత్వంపై వదలండి. మీరు గానీ, మీ ఎంపీలు గానీ కొత్తగా మోడీ గారిని మెప్పించి, ఒప్పించి సాధించవలసినవి ఏమీ లేవు. కనీసం చట్టంలో ఉన్నవి కచ్చితంగా అమలు చేయమని మాత్రం కోరి మీరు సాధించగలిగితే చాలు.ఒకవేళ, దీనికి మీరు సిద్ధం కాకపోతే..విభజన హామీల సాధనలో మీ వైఫల్యం మీ రాజకీయ జీవితానికి మరొక మచ్చ అవుతుంది. గ్రహించండి. ఉన్నమచ్చలకు తోడు ఇది మరొక మచ్చ నాకు నష్టమేముంది అనుకొంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నిర్లక్ష్యం చేయడానికి, వదిలివేయడానికి ఇది మీ కుటుంబ వ్యవహారమో, మీ పార్టీ వ్యవహారమో లేదా మీ ‘హెరిటేజ్’ కు సంబంధించిన వ్యవహారమో కాదు. హామీల పట్ల మీ నిర్ల్యక్షం వల్ల, వాటిని సాధించడంలో మీ నిష్క్రియాపరత్వం వల్ల, ఆంధ్ర ప్రదేశ్ కు న్యాయంగా రావాల్సినవి కూడా కేంద్రం ఇవ్వకుండా నాటకాలు ఆడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాటిని ఇవ్వమని గట్టిగా డిమాండ్ చేయకపోవడం వల్ల, మీ వ్యక్తిగత తప్పుల వల్ల మీరు కేంద్రానికి భయపడి అణిగిమణిగి ఉండడం వల్ల వ్యక్తిగతం గా మీకు, మీ కుటుంబానికి, మీ వ్యాపారానికి ఏ ఇబ్బంది లేకపోయినా.. అసలే విభజన వల్ల నష్టపోయిన ప్రస్తుత ఆంధ్ర ప్రజలతో పాటు, హామీలు సకాలంలో అమలు చేయకపోవడం వల్ల భవిష్యత్తు తరాల వారు, ముఖ్యంగా యువత, విద్యార్థులు, రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. హామీల సాధనకు మీ అనుభవం ఉపయోగపడుతుందని ఆశించి, మిమ్మల్ని ఎన్నుకొన్న పాపానికి ప్రజలకు పెద్ద శిక్ష వేశారు. వారి భవిష్యత్తును అంథకార బంధురం చేశారు. మీ వ్యక్తిగత స్వార్ధం వల్ల ఇప్పటికే నాలుగు విలువైన సంవత్సరాలు వృధా అయినాయి. ఒకవేళ పదవిలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పోలవరానికి నిధులు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్ట్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటివి చట్టంలో చెప్పిన విధంగా ఆరు నెలల్లో మొదలు పెట్టాలని పట్టుపట్టి ఉంటే, అవన్నీ ఇప్పటికి పూర్తి అవడమో లేదా తుది దశలో ఉండి ఉంటే ఈరోజు ఆంధ్ర ప్రాంత పరిస్థితి వేరుగా ఉండేది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేవి. ఈ ప్రాంతాలు సస్యశ్యామలమై రాష్ట్రం ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందేది. కానీ, రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి మీ స్వప్రయోజనాలకు పెద్దపీట వేసి మీరు ప్రజలకు తీరని నష్టం చేశారు. మీ నిర్వాకం వల్ల, మీ భయం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ స్వార్ధం వల్ల విభజన కంటే ఎక్కువ స్థాయిలో సీమాంధ్ర ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారు. మిమ్మల్ని ఎన్నుకొంటే వారి భవిష్యత్ బాగుంటుందని ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేస్తే మీరు కేంద్రంతో కుమ్మకై ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి మీ వ్యాపారాలను సుస్థిరం చేసుకొని ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. హామీల అమలులో ఇప్పటికే జరిగిన జాప్యం వల్ల జరిగిన నష్టాన్ని మీరు కానీ, మీ పార్టీ కానీ, మీతో అంటకాగుతున్న బీజేపీ గానీ, మోడీ గాని పూడ్చలేరు. కాబట్టి ఇకనైనా మేల్కొనండి. లేదంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి క్షమించరు, క్షమించలేరు, క్షమించబోరు. గుర్తుంచుకోండి’ అని ఆ లేఖలో కేవీపీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *