Home > Editorial > విద్యార్ధుల్లో కొరవడుతున్న సాఫ్ట్ స్కిల్స్

విద్యార్ధుల్లో కొరవడుతున్న సాఫ్ట్ స్కిల్స్

వ్యూహా, ప్రతివ్యూహాలతో రాష్ట్రపతి ఎన్నికలు
ట్రైనీ నుంచి సీఈవో స్థాయికి ఎదిగిన చందా

students4_apduniaమంచి ర్యాంకుల్లో మార్కులు వస్తున్న ప్రెజంట్ విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్ తక్కువగా ఉంటున్నాయి. పిల్లల తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సాఫ్ట్‌స్కిల్స్‌లో వెనుకబడిపోతున్నారని కంపెనీ నిర్వాహకులు అంటున్నారు. తగిన శిక్షణ, సాధనతో వీటిని నేర్చుకోవచ్చు. త్వరితగతిన నిర్ణయాలు, నాయకత్వ లక్షణాలు, సంభాషణా చాతుర్యం, సమయస్ఫూర్తి,క్రమశిక్షణ,బాధ్యతాయుత ప్రవర్తన,టాలెంట్, అందరితో కలిసి ఉండడం ఇవన్నీ మీకు ఉంటే..ఈజీగా రాణించేయచ్చ..సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో సరైన నిర్ణయాలను త్వరితగతిన తీసుకోవాల్సి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ ఎంత వేగంగా తీసుకోగలరు, విభిన్న రీతుల్లో ఆలోచిస్తారా, సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారా అనే విషయాలపై కంపెనీ దృష్టి పెడుతుంది. దాన్ని బట్టి అభ్యర్థిని అంచనా వేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది.బృందానికి నాయకత్వం వహించాల్సి వస్తే చేయగలరా? అందరినీ ఒక తాటిపై నడిపించగలరా? వంటి విషయాలను కంపెనీలు గమనిస్తున్నాయి. అందుకనే చిన్నప్పటి నుంచే నాయకత్వం వహించే లక్షణాలు పెంపొందించేలా వారికి తల్లిదండ్రులు శిక్షణ ఇవ్వాలి. నాయకత్వం వహించే వారు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం కూడా ముఖ్యం. భేషజాలకు పోకుండా ఆచరించగలిగేవాడే నాయకులుగా ఎదగగలుగుతారు.చాలా మంది ఉద్యోగార్థులకు అన్ని అర్హతలు ఉంటాయి. విషయ పరిజ్ఞానం కూడా ఉంటుంది. కానీ సంభాషణా నైపుణ్యం ఉండదు. అభ్యర్థులు సంభాషణా చాతుర్యం లేకపోవడం వల్ల క్లైంట్‌తో సరిగా మాట్లాడలేకపోతున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్ స్కిల్స్‌లో భాగంగా అందరూ మెచ్చే విధంగా సంభాషణ చేయగలడా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. కంపెనీ నిర్వాహకులు ఉద్యోగార్థుల సమయస్ఫూర్తిని పరిశీలిస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వనరులను వినియోగించుకోవటంలో ఎలా వ్యవహరించగలరు అనే కోణంలో అభ్యర్థులను సునిశితంగా పరీక్షిస్తున్నారు. ఏదైనా చేయగలననే ఆత్మస్థైర్యం వారిలో ఉందా అనే విషయాన్ని గమనిస్తున్నారు.కంపెనీలు ఎప్పుడూ పర్యవేక్షణ లేకపోయినా, సమర్థవంతంగా పని చేయగలవారిని కోరుకుంటాయి. పనిపట్ల నిబద్ధత కలిగిన వారి అధిక ప్రాముఖ్యత ఇస్తాయి. వృత్తిపట్ల అంకిత భావం కలిగి ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేసుకుంటున్నాయి కంపెనీలు పని పట్ల బాధ్యత ఎంత వరకు తీసుకుంటున్నాయి అనే విషయాన్ని గమనిస్తున్నాయి. పనిలో తప్పులు దొర్లితే తమ ఉద్యోగులు సహోద్యోగులపైకి నెట్టేయకుండా, తప్పిదాన్ని గుర్తించి నేనే చేశాను. దీన్ని సవరించే అవకాశం ఇవ్వండి అనే దృక్పథం కలిగి ఉన్నవారిని ఎంపిక చేసుకుంటున్నాయి. కంపెనీ నిజాయితీతో, బాధ్యతాయుత ప్రవర్తనను అభ్యర్థుల నుంచి ఆశిస్తుంది. అభ్యర్థులు పనిలో వచ్చే క్లిష్ట అంశాలను ఎలా ఎదుర్కోగలరు అనే విషయాన్ని కంపెనీలు గమనిస్తున్నాయి. ఐటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రాజెక్ట్ డెడ్‌లైన్ దగ్గరపడుతున్న కొద్దీ అది తీవ్రమవుతుంది. ఒక్కోసారి ఎన్నో సంక్లిష్ట పరిస్థతులు రావచ్చు. వాటిని ఎంత వరకు అధిగమించగలరు అనే విషయాన్ని బేరీజు వేస్తున్నారు. అభ్యర్థి సృజనాత్మకంగా ఆలోచించగలడా, చేసే పని విభిన్నంగా అందరూ మెచ్చేవిధంగా చేసే సామర్థం కలిగి ఉన్నాడా ? సమస్య సాధనలో ప్రత్యేకతను చాటుకునే వారికి ఐటీ రంగంలో మంచి భవిషత్తు ఉంటుంది. విధి నిర్వహణలో సమస్యను గుర్తించటం, సమస్యను పరిష్కరించటం రెండూ ముఖ్యమే. సమస్యలకు తార్కికంగా పరిష్కార మార్గాలు కనుగొంటే ఈ రంగంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయగలిగే వారికి ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రీయమైన సమయపాలనతోనే సంస్థ విజయం ఆధారపడి ఉంటుంది. అందుకే సమయపాలనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి సమయపాలన పాటిస్తాడా లేదా అనే విషయాన్ని గమనిస్తున్నారు. ఈ రంగంలో ఎక్కువగా బృందంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సంస్థ ఉన్నతి ఇలాంటి బృందాల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. అందరితో కలివిడిగా ఉంటేనే ఈ రంగంలో రాణించగలం. అందుకే ఇటీవలి కాలంలో బృంద చర్చలను కూడా ఉద్యోగ నియామకాల్లో భాగంగా చేశారు. నిర్థేశించిన లక్షాలను సాధించాలంటే బృందం సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. బృందంలో ఇమడగలిగేలా అభ్యర్థి ఉండాలి. పని విషయంలో సలహాలు ఇస్తూ, ఆదేశాలను స్వీకరిస్తూ బృందంతో సాగాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక సూచనలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కలివిడిగా ఉండి పనిచేయగలగటం కూడా సాఫ్ట్ స్కిల్స్‌లో భాగం. ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వివిధ సంస్థలు సంప్రదాయ నియామక విధానానికి స్వస్తిపలికింది. తెలివిగల విద్యార్థులు సైతం వీటిలో వెనుకబడుతున్నారు. సాఫ్ట్ స్కిల్స్ రాత్రికి రాత్రే నేర్చుకోవటం సాధ్యం కాదు. శిక్షణ, సాధన ద్వారానే సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com