Home > Editorial > టీ కప్పులో సుప్రీం తుఫాను

టీ కప్పులో సుప్రీం తుఫాను

అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో
ఆధార్ వ్యక్తిగత వివరాలకు చెక్

supreme-court-apduniaదేశ పౌరులందరికీ న్యాయం ప్రసాదించాల్సిన న్యాయాదీశులే న్యాయాన్ని అర్థిస్తూ ప్రజల ముందుకు రావడం ఆశ్చర్యకరమే కాదు ఆందోళనకరం కూడా. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు అత్యంత సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గగోరు, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ శుక్రవారం పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేయడమే ఒక అసాధారణ పరిణామం. సుప్రీంకోర్టులో చోటుచేసుకుంటున్న విపరీత పోకడల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు భారత ప్రధానన్యాయమూర్తి వ్యవహరిస్తున్న తీరును ఈ నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగానే ప్రశ్నించడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయముర్తి దీపక్ మిశ్రా కేసుల కేటాయింపుల్లో అసంబద్ధంగా వ్యవహరిస్తున్నారని కీలక, సంచలనాత్మక, సున్నితమైన కేసుల కేటాయింపుల్లో సీనియారిటీని కాదని ఉద్దేశ్యపూర్వకంగా జూనియర్ జడ్జీలతో కూడిన బెంచ్లకు అప్పగిస్తున్నారంటూ జస్టిస్ చలమేశ్వర్ రావుతో పాటు మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రచ్చ కెక్కిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు అవాంఛనీయమని, న్యాయవ్యవస్థకు మంచిది కాదని ప్రముఖ న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో వైపు ఇది సుప్రీంకోర్టు అంతర్గత వ్యవహారమని తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపులపై ” టైమ్స్ ఆఫ్ ఇండియా” దృష్టి సారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నలుగురు న్యాయముర్తులు ఆరోపిస్తున్నట్లుగా గత రెండు దశాబ్దాల్లో దేశ చరిత్రను మార్చిన అతి కీలక, సంచలనాత్మక, సున్నితమైన కేసుల విషయంలో ఆ నలుగురు జడ్జీలు చెప్పిందే నిజమని తేలింది.దేశంలో న్యాయవ్యవస్థ దుస్థితికి ఈ పరిణామం నిలువెత్తు నిదర్శనమని న్యాయకోవిదులు చేస్తున్న విశ్లేషణ సహేతుకంగానే కనిపిస్తోంది. న్యాయవ్యవస్థలో ప్రతికూల ప్రభావాలపై ప్రధానన్యాయమూర్తికి లేఖ రాసినా గోడు పట్టించుకోనందునే మరో దారిలేక మీడియా ముందుకొచ్చామని న్యాయమూర్తులే ఘోషిస్తుంటే అంతకన్నా దిగ్భ్రాంతికర అంశం మరొకటి ఏముంటుంది? సర్వోన్నత న్యాయస్థానాదీశులుగా ఉన్న వీరి పరిస్థితే ఇలావుంటే ఇక దేశంలో సామాన్య పౌరుల గోడు పట్టించుకొనే దిక్కేముంటుంది. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సహచర న్యాయమూర్తుల్లో ప్రథముడే కానీ, ఆయనకంటూ ప్రత్యేకంగా అపరిమిత అధికారాలు లేవని, న్యాయ పరిపాలనలో కేసుల బదలాయింపుల్లో సీనియారిటినీ పక్కన బెట్టి వ్యవహరించారంటూ ఇప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను ఈ నలుగురు న్యాయమూర్తులు విమర్శించడం, ఒకటి రెండు కేసులను కూడా వారు బహిరంగంగానే ఉదహరించడం పెద్ద చర్చకు దారితీసేదే. ప్రధానంగా కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ మెజార్టీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును వమ్ము చేయడానికి మరో బెంచ్‌ ఏర్పాటు చేయడం న్యాయమూర్తుల నియామకాలపైనే తీవ్ర ప్రభావం చూపిందని న్యాయమూర్తులు ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. వైద్య ప్రవేశాలకు సంబంధించి వీరు ఉదహరించిన మరొక కేసు విషయంలోనూ సంప్రదాయాలకు, మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి ప్రధానన్యాయమూర్తి వ్యవహరించిన తీరు ఆందోళన కల్గించేదే. న్యాయమూర్తులుగా ఉంటూనే ఇలా బహిరంగంగా దేశ ప్రధానన్యాయమూరిని విమర్శించడం సరైనదా కాదా అనే చర్చ పక్కనబెడితే న్యాయవ్యవస్థ గాడితప్పుతున్న విషయాన్ని ఈ పరిణామం గుర్తుచేస్తోంది. అన్యాయాలు, అక్రమాలు రాజ్యమేలినప్పుడు, హక్కులు కాలరాయబడినప్పుడు, అధికార మదంతో పౌరుల స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించినప్పుడు ‘మీ పక్షాన మేమున్నామంటూ’ కొండంత అండగా నిలవాల్సిన న్యాయవ్యవస్థే ‘ధర్మం దేహీ’ అని న్యాయాన్ని అర్థించాల్సిన దుస్థితికి కారణం ఎవరు,,,. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేనాటికే జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై అవినీతి ఆరోపణలు ఉన్నమాట కూడా యథార్థం. న్యాయకోవిదులు అనేక మంది ఆయన నియామకంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.మొదటి రెండు వ్యవస్థలు చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటే వాటిని న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని రాజ్యాంగ రక్షణకు పూనుకోవాల్సివుంటుంది. యితే కొంత మంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆ నలుగురికే మద్ధతు ఇస్తుండడంతో రానున్న రోజుల్లో ఈ అంశం మరింత హాట్ టాపిక్ కాబోతోందని తేలిపోయింది. అయితే అటు సుప్రీంకోర్టు బెంచ్ కు ఇటు న్యాయవాదులకు మధ్యవర్తిత్వం వహించే ” బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ” కూడా పెద్దగా పెదవి విప్పడం లేదు. ఇది న్యాయవ్యవస్థ అంతర్గత సమస్యని త్వరలోనే అంతా సర్దుకుంటుందని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.అయితే గతంలో పలు సంచలనాత్మక కేసులతో పతాకశీర్షికలకు ఎక్కిన సుబ్రమణ్యస్వామి మాత్రం తప్పంతా ఆ నలుగురు న్యాయమూర్తులదే అని తేల్చిపారేశారు. కేసుల కేటాయింపుల్లో ప్రధాన న్యాయమూుర్తి వివక్ష పాటిస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని అన్నారు. న్యాయమూర్తుల దృష్టిలో కేసులున్ని ఒకటే అయినప్పుడు ప్రధానమైన కేసులని, అప్రధానమైన కేసులను ఎలా విడగొడతారని చురక అంటించారు. ఆ దృష్టితో చూడడం సరికాదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *