Home > Editorial > ప్రభుత్వానికి మాయని మచ్చగా లీకేజీలు

ప్రభుత్వానికి మాయని మచ్చగా లీకేజీలు

కరోనా కథ కంచికేనా..?
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో మైలు రాయి...

kcr4_apduniaఐదు వేళ్లు ఎలా అయితే స‌రిగా ఉండ‌వో… స‌ర్కారు అన్నాక కొన్ని స‌మ‌స్య‌లుండ‌క‌పోవు. కేసీఆర్ ఈ మూడేళ్ల పాల‌న‌పై కొన్ని మెరుపులతో పాటు మ‌ర‌క‌లు కూడా ఉన్నాయి. ఆయ‌న తీసుకొన్న కొన్ని నిర్ణ‌యాలు, వ్య‌వ‌హ‌రించిన తీరు పార్టీకి కొంత ఇబ్బందిక‌రంగా మారింది. దూకుడు తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల కోర్టుల నుంచి మొట్టికాయ‌లు తీనాల్సివ‌చ్చింది. కొన్ని అంశాల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. అధికారంలోకి రాక‌ముందు కేసీఆర్ అనేక హామీల‌నిచ్చారు. వ‌చ్చాక వాట‌న్నింటిని తీర్చేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. రాక‌ముందు చేసిన ప్రామిస్ లు అధికారంలోకి వ‌చ్చాక చేయాలంటే కొన్ని ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఎదుర‌య్యాయి. అందుకే కొన్నింటిని ఆయ‌న చేయ‌లేక‌పోయారు. దీంతో ఆయ‌న పెద్ద‌యెత్తున విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొవాల్సివ‌చ్చింది. ప్ర‌ధానంగా అధికారంలోకివ‌స్తే…ద‌ళితులే సీఎం అన్న కేసీఆర్… ఆత‌రువాత ఆ పీఠంపై ఆయ‌నే కూర్చున్నారు. నాటినుంచి నేటి దాకా విప‌క్షాల‌కు ఇదోక అవకాశ‌మిచ్చిన‌ట్టు అయింది. టైమ్ దొరికినప్పుడల్లా కేసీఆర్ ను ఇదే అంశంపై తిట్టేస్తున్నారు. ఉద్య‌మ కాలంలో తెలంగాణ కోసం ప‌న్నెండు వంద‌ల మంది అమ‌రుల‌య్యార‌ని ప‌దేప‌దే గులాబీ నేత‌లు వేదిక‌ల‌పై దంచికొట్టారు. అధికారమొస్తే..వారి కుటుంబాల‌ను ఆదుకుంటామ‌న్నారు. కానీ చెప్పిన లెక్క‌ల‌కు ఇచ్చిన లెక్క‌కు చాలా తేడా ఉంది. సుమారు నాలుగైదు వంద‌ల కుటుంబాల‌కు త‌ప్ప మిగిలిన వాటి జోలికి వెళ్ల‌లేదు. అమ‌రులంద‌ర్నీ ఆదుకుంటామ‌న్నహామీ విషయంలో ఇదో విమ‌ర్శ‌ను నిత్యం ఎదుర్కొవాల్సివ‌స్తోంది కేసీఆర్ స‌ర్కారుకు. ఇక అన్న‌దాత‌ల‌కు అధిక ప్రాధాన్య‌మిస్తున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్యహ‌త్య‌ల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. వీటిని ఒక్క‌రోజులోనో, ఏడాదిలోనే నివారించే వీలు లేకున్నా… వారిలో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ప్ర‌య‌త్నం స‌ర్కారు చేయ‌లేద‌న్న అప‌వాదును మూట‌క‌ట్టుకోవాల్సివ‌చ్చింది. తొలి రెండేళ్లు రైతులు పెద్ద‌యెత్తున చ‌నిపోయారు. దీనికితోడు ఈ ఏడాది మిర్చికి మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో స‌ర్కారు స‌రైన స‌మ‌యంలో స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌….రైతుల‌కు ఎక‌రానికి ఎనిమిది వేలు ఇస్తామని వ‌చ్చిన మైలేజ్ అంతా… మిర్చి రైతుల‌కు సంకేళ్లు వేయ‌డంతో పోయింది. ఆ త‌రువాత న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. తొలిరెండేళ్లు వ‌చ్చిన క‌రువును కూడా కేసీఆర్ స‌ర్కారు స‌మ‌ర్ద‌వంతంగా ఎదుర్కొన‌లేక‌పోయిందన్న విమ‌ర్శ‌వుంది. అలాగే సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ఏర్పాటుకోసం చేప‌ట్టిన భూసేక‌ర‌ణ అంతా వివాదాస్పదంగా మారింది. మ‌ల్ల‌న్న సాగ‌ర్ కోసం క‌ర్ష‌కుడిని క‌ష్టాలు పాలుజేశారన్న అపకీర్తిని కూడా కేసీఆర్ స‌ర్కారు మూట‌క‌ట్టుకుంది. బ‌ల‌వంతంగా చేప‌ట్టిన భూసేక‌ర‌ణ రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇది కూడా ఈ మూడేళ్ల పాల‌న‌లో కేసీఆర్ స‌ర్కారుపై ప‌డిన ఒక మ‌ర‌క‌లాగే మిగిలిపోయింది. రాష్ట్రంలో ప‌క్కాగా శాంతిభ‌ద్ర‌త‌లున్నా… త‌ర‌చూ ప‌రీక్షా పేప‌ర్లు లీకేజ్ కావ‌డంతో స‌ర్కారు ప్ర‌తిష్ట బాగా దెబ్బ‌తింది. ఎంసెట్ తోపాటు ప‌దో త‌ర‌గతి, ఇంట‌ర్ ప‌రీక్ష పేప‌ర్లు లీకేజ్ వ్య‌వ‌హ‌రం తెలంగాణ స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారాయి. అలాగే కేజీ టూ పీజీలో భాగంగా ప‌లు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను మూసివేయ‌డమో లేక‌పోతే బ‌ల‌వంతంగా సమీపంలోని పాఠ‌శాల‌ల్లోనో విలీనం చేశారు. ఒక‌వైపు విద్యావ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తున్నామ‌ని చెబుతూనే మ‌రోవైపు డిఎస్సీ వేయ‌క‌పోవ‌డం, పాఠ‌శాల‌ల మూసివేతవంటివి స‌ర్కారు ప్ర‌తిష్ట‌కు ఇబ్బందిక‌రంగా మారాయి.
పధ‌కాలు, సంక్షేమంతో దూసుకుపోతోన్న కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఇవోక చికాకు వ్య‌వ‌హారాలుగా మారాయి. అంత స‌మ‌ర్ధ‌వంత‌మైన స‌ర్కారుగా చెప్పుకున్న అధికార పార్టీకి స‌రిగ్గా ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించ‌లేదా అనే విమ‌ర్శ‌ను ఎదుర్కొవాల్సివ‌చ్చింది. ఇక నిరుద్యోగులు కూడా స‌ర్కారుపై పెద్ద‌యెత్తున అసంత్రుప్తితో ఉన్నారు. ల‌క్ష ఉద్యోగాలిస్తామ‌న్న స‌ర్కారు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేయ‌లేక‌పోతోంది. ఊదాహ‌ర‌ణ‌కు వైద్య ఆరోగ్య‌శాఖ‌లో వేల ఉద్యోగాల‌కు అనుమ‌తినిచ్చిన ఇంత‌వ‌ర‌కు ఒక్క డాక్ట‌ర్ గానీ, న‌ర్స్ పోస్టును గానీ భ‌ర్తీ చే్య‌లేక‌పోయింది. కాగా వీటికి తోడు కేసీఆర్ తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు కొన్ని సంద‌ర్భాల్లో చాలా వివాదాస్పందంగా మారాయి. అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారాయ‌న‌. దీనిపై పెద్ద దూమార‌మే రేగింది. ఫీజు రియంబ‌ర్స్ మెంట్ కు స్థానిక‌త జోడించ‌డంపై హైకోర్టు జోక్యం చేసుకోవాల్సివ‌చ్చింది. అలాగే ఇప్ప‌టిదాకా కూడా ఫీజు రియంబ‌ర్స్ మెంట్ స‌రిగ్గా ఇవ్వ‌లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ ఉంది. వీటితోపాటు కేసీఆర్ ప్ర‌తిసారీ ఏదో ఒక‌టి త‌ర‌లింపు అన‌డం… అది వివాదాస్పదంగా మార‌డం అన‌వాయితీగా మారింది. తొలుత చెస్ట్ ఆస్ప‌త్రిని త‌ర‌లిస్తామ‌న్నారు. ఆ త‌రువాత అసెంబ్లీ త‌ర‌లింపు, తాజాగా ఇందిరా పార్క్ వ‌ద్ద ధ‌ర్నా చౌక్ త‌ర‌లింపు. వీటిపై విప‌క్షాల ఆందోళ‌న‌లు. ఆపై లాఠీచార్జీలు. ఇలా ఈ మూడేళ్ల‌లో కేసీఆర్ తీసుకొన్న నిర్ణ‌యాలు, ప్ర‌క‌ట‌న‌లు విప‌క్షాల‌కు ఆయుధాల‌తో పాటు ఆరోపించ‌డానికి అవకాశాన్ని కూడా ఇచ్చాయి. రెండు ప‌డ‌క‌ల ఇళ్లు, ద‌ళితుల‌కు మూడేక‌రాల భూమి పంపిణీ కార్య‌క్ర‌మాలు ప‌క్కాగా ప‌ట్టాలెక్క‌లేదు. ఈ హామీల‌ను నెర‌వేర్చ‌డంలో కేసీఆర్ స‌ర్కారు చాలా దూరంలో ఉంది..ఇక పాల‌నాప‌గ్గాలు చేప‌ట్టక ముందే ఇక్క‌డ మేమూ, ఏపీలో జ‌గ‌న్ గెలుస్తారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్… అధికారంలోకి వ‌చ్చాక‌… కొద్ది నెల‌ల పాటు ఏపీతో క‌య్యానికి కాలు దువ్వారు. ఏపీతో తొలిరోజుల్లో కొట్లాట‌, చీటికిమాటికి త‌గాదా పెట్టుకున్నారు. ఆ రాష్ట్రం కూడా అలాగే కొన్నింట్లో వ్య‌వ‌హ‌రించింది. అయితే ఓటుకు నోటు త‌రువాత ప‌క్క రాష్ట్రంతో పాటు, కేంద్రంతో కూడా స‌త్ సంబంధాలు పెట్టుకున్నారు కేసీఆర్. అయితే తెలంగాణ కోసం కొట్లాడిన ప్రజా సంఘాల‌ను, కోదండ రామ్ ను ప‌క్క‌న‌పెట్టారన్న అతి ప్ర‌ధాన విమ‌ర్శ‌ను మూట‌గ‌ట్టుకున్నారాయ‌న‌. ముఖ్యంగా కోదండ‌రామ్ తో కేసీఆర్ వ్య‌వ‌హ‌రించిన తీరును స‌గ‌టు తెలంగాణ‌వాదులెవ్వ‌రూ హ‌ర్షించ‌డం లేదు. దీనికి తోడు తెలంగాణ ఉద్యమంలో వ్య‌తిరేకంగా వ్య‌వ‌హరించినవాళ్ల‌నూ, విమ‌ర్శించిన వాళ్ల‌ను కేసీఆర్ ప‌క్క‌న‌బెట్టుకొని ప‌ట్ట‌మెక్కించ‌డం కూడా తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొవాల్సివ‌చ్చింది. అలాగే మంత్రివ‌ర్గంలో ఒక్క మ‌హిళ‌కు కూడా చోటివ్వ‌లేదు. దీంతో్పాటు క‌నీసం ఒక్క ఎమ్మెల్సీగానీ, ఒక్క కార్పోరేష‌న్ చైర్మ‌న్ పోస్టు గానీ మ‌హిళ‌ల‌కు కేటాయించ‌క‌పోవ‌డం వ‌ల్ల …. కేసీఆర్ అడ‌వారికి ప‌ద‌వులివ్వ‌డం ఇష్టం ఉండ‌ద‌న్న అప‌వాదును మోయాల్సివ‌స్తోంది. మూడేళ్లవుతున్నా… ఇంత‌వ‌రకు మంత్రివ‌ర్గంలోకానీ, మండ‌లిలోగానీ, కార్పోరేష‌న్ చైర్మ‌న్లో గానీ ఒక్క మ‌హిళ లేదంటే…వారి పై కేసీఆర్ చిన్న‌చూపు ఉందన్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఈ మూడేళ్ల కేసీఆర్ పాల‌న‌లో అంతా సాఫీగా సాగిపోలేదు. కొన్ని ఇబ్బందులతో పాటు విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. తొలుత ఇబ్బంది ప‌డ్డా…ఇప్పుడు చాలా ఈజీగా గ‌వ‌ర్న‌మెంట్ ను అంతా అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా న‌డిపిస్తున్నారాయ‌న‌. త‌న‌కు, త‌న పార్టీకి తిరుగులేకుండా చేయ‌డ‌మే గాకుండా వార‌సుడికి కూడా రాజ‌కీయ ర‌హ‌దారికి పునాదిని వేశారు కేసీఆర్. మ‌రి రాబోయే రెండేళ్లు ఇంకేన్న కొత్త ప‌థ‌కాలను తెరపైకి తీసుకువ‌స్తారో… ఇంకేన్ని విమ‌ర్శ‌లను, ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com