Home > Editorial > ప్రకృతి విలయతాండవంతో తీరని నష్టం

ప్రకృతి విలయతాండవంతో తీరని నష్టం

ఆచరణలోకి రాని మోడీ పథకాలు
తమిళ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్

texas-fluds-apduniaప్రకృతి విలయానికి ఎవ్వరైనా అతలాకుతలం అవ్వాల్సిందే. హార్వే ప్రభంజనం అమెరికాలో టెక్సస్ తీరం చిగురుటాకులా వణికి పోయింది. అభివృద్ధి పేరుతో ఎంత హడావిడి చేసిన కుండపోతగా వర్షించిన బీభత్సం నుంచి హూస్టన్ నగరంలోని బాధిత ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. నదులు ఉప్పొంగటంతో భవనాలు రెండంతస్థుల వరకు నీట మునిగిన మహా ప్రళయంలో ఇళ్లలో చిక్కుకున్న వారి కొరకు సహాయక బృందాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి.10 లక్షల మంది నిర్వాసితులైనారు. 47మంది చనిపోయినట్లు ఇప్పటికి గుర్తించటం జరిగింది. మరో 20మంది జాడ తెలియటం లేదు. సముద్రతీరానికి 40-45 మైళ్ల దూరంలో ఉన్న హూస్టన్ మహానగరానికి తుపానులు కొత్తకాదు. 1970మధ్య నుంచి కనీసం 26విపత్తులు చవిచూసినట్లు హూస్టన్‌లోని వాతావరణ పరిశోధన కేంద్రం, జాతీయ వాతావరణ సర్వీసు రికార్డులు తెలుపుతున్నాయి. ఉష్ణమండల తుపానులు గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి బయటకు వచ్చాక ప్రయాణించే మార్గంలో టెక్సస్ రాష్ట్రం ఉంది. హార్వే బీభత్సం నుంచి ప్రజలు కోలుకోకముందే మరో తుపాను భయకంపితుల్ని చేస్తున్నది.ఇర్మా అని పేరుపెట్టబడిన మరో మహాసుడిగాలి కేటగిరి 3 ప్రభంజనంగా ఉధృతమైంది. తూర్పు అట్లాంటిక్‌లో బయలుదేరిన ఈ ప్రళయకాల వాయుగర్జన గంటకు 185 కిలోమీటర్ల వేగంతో సుడి తిరుగుతున్నది. అది భూమిని చేరుకోవటానికి మరో 34 రోజులు పట్టవచ్చు. ఈ పెనుతుపాను ఫ్లోరిడాను తాకుతుందా లేక మెక్సికన్ గల్ఫ్‌ను తాకుతుందా అనేది దాని ప్రయాణదిశను బట్టి ఉంటుంది.హూస్టన్ ఉపద్రవం వాతావరణ మార్పు ప్రత్యక్ష పర్యవసానంగా పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు. వందేళ్లలో నాలుగు అతిపెద్ద వరదలు 2015 తదుపరి ఈ నగరంలో సంభవించాయి. 1950 దశకంతో పోల్చితే 167శాతం అధిక వర్షం కురుస్తున్నట్లు ‘అట్లాంటిక్’ పత్రిక వ్యాసం తెలిపింది. “అది శక్తిమంతమైన తుపానే కావచ్చు, దానివల్ల అనేక సమస్యలు ఏర్పడి ఉండవచ్చు. అయితే మానవులవల్ల సంభవించిన వాతావరణ మార్పు నష్టాన్ని గణనీయంగా పెంచింది” అన్నారు వాతావరణ పరిశోధన జాతీయ కేంద్రానికి చెందిన కెవిన్ ట్రెన్‌బెర్త్.బాహ్య వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచుతున్న గ్రీన్‌హౌస్ వాయువుకు ప్రధాన కారణమైన బొగ్గుపులుసువాయువు(co2) సముద్ర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అదే సమయంలో గాలిలో వేడిని పెంచుతుంది. అది వాతావరణాన్ని స్పాంజిలాగా మార్చటంతో అది అధికాధికంగా నీటిని పీల్చుకుంటుంది. అది ఇప్పుడు హూస్టన్ నగరంపై వర్షించింది. సముద్రంపై వర్షించి ఉంటే సముద్రనీటిమట్టం పెరిగేది. సమీపంలోని న్యూ ఓర్లియాన్స్ వంటి నగరాలను వరద ముంచెత్తేది అని యు.ఎస్. పర్యావరణ రక్షణ ఏజన్సీ తెలియజేసింది.వరదలు నగరాలను జలదిగ్బంధం చేయటంలో రియల్ ఎస్టేట్ పేరాశ అన్ని దేశాల్లో ఉన్నదే. అందుకు హూస్టన్ మినహాయింపు కాదు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతవాసులకు ఇది స్వానుభవం. అవినీతి అధికారులతో కుమ్మక్కు అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు పూడ్చి లోతట్టు ప్రాంతాల్లో, సహజసిద్ధమైన జలప్రవాహ మార్గాలకు అడ్డంగా పలు అంతస్థుల భవనాలు నిర్మించటం వల్ల భారీ వర్షాలకు ఆ ప్రాంతాలు జలతాండవం చేయటం చూస్తున్నాం. అంతేగాక, వర్షపాతం సమానంగా కాకుండా కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా కురవటం వాతావరణ మార్పు పర్యవసానమని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు. గుజరాత్, బీహార్‌లలో ఎడతెగని వరదలు, ముంబైలో కుంభవృష్టి, మరోవైపున జీవనది అయిన కృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో నీరు చేరకపోవటం కూడా దీని పర్యవసానమే. కాబట్టి వాతావరణ ఉష్ణాన్ని పరిమితిలో ఉంచేందుకు ప్రపంచ వ్యాప్త కృషి నిమిత్తం పారిస్‌లో కుదిరిన ఒప్పందంనుంచి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాను తొలగించటం ఎంత సంకుచితమైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాతావరణం, పర్యావరణ పరిరక్షణ పైనే మానవ మనుగడ ఆధారపడి ఉంది. ప్రకృతి సూత్రాలను అహంకార పూరితంగా ధిక్కరిస్తే జలప్రళయాలు తప్పవు.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *