Home > Editorial > ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో మైలు రాయి…

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో మైలు రాయి…

ప్రభుత్వానికి మాయని మచ్చగా లీకేజీలు
దాసరీ.. చిత్రసీమలో లేరు నీకు సరి!

india-longest-bridge-dhole-apduniaఅసోంలోని లోహిత్ నదిపై మహావారధి భారతదేశంలోని అతిపొడవైన వంతెన. ఈశాన్య భారత్ రాష్ట్రాల మధ్య వివిధ రవాణా మార్గాల ద్వారా సంబంధాలు నెలకొల్పే ప్రభుత్వ ప్రయత్నాల్లో ఇదొక మైలురాయి. భారతప్రభుత్వ “లుక్ నార్త్‌ఈస్ట్‌”, “యాక్ట్ ఈస్ట్‌” విధానాలను ముందుకు గొనిపోవటంలో ఇది నిజంగా వారధి అవుతుంది. అసోంను అరుణాచల్‌ప్రదేశ్‌తో కలుపుతున్న ఈ వారధి తూర్పు, ఆగ్నేయాసియాలకు మహాద్వారంగా ఉపకరిస్తుంది. ఈ వారధి నిర్మాణానికి దశాబ్దంపైగా సమయం తీసుకుంది. భారీ టాంకులు సైతం ప్రయాణించగల ఈ మహావారధి రక్షణ కోణంనుంచి కూడా ప్రాధాన్యత గలది. ఏడు రాష్ట్రాలతో (అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర) ఏడుగురు అక్కచెల్లెళ్లుగా పిలవబడే ఈశాన్య భారత్‌లో సిక్కిం ఎనిమిదవ రాష్ట్రంగా చేరింది. ఈ రాష్ట్రాల విస్తీర్ణం భారత భూభాగంలో 7.98శాతం కాగా జనాభా కేవలం 3.91శాతం. సుమారు 21కిలోమీటర్ల సిలిగురి మెడ లేదా “చికెన్‌నెక్‌” ఈ ప్రాంతాన్ని మిగతా భారత్‌తో కలుపుతోంది. ప్రతి ఒక్క రాష్ట్రానికీ అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఈ ప్రాంతానికి మిగతా భారత్‌తో ఉన్న భౌతిక సంబంధం కేవలం 37 కిలోమీటర్లు, కాగా ఇతర దేశాలతో సరిహద్దు 5500 కిలోమీటర్లు. ఉత్తరాన చైనా, తూర్పున మయన్మార్, నైరుతిన బంగ్లాదేశ్, వాయవ్యాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ ప్రాంతానికున్న అసాధారణ వ్యూహాత్మక ప్రాముఖ్యతను దాని భౌగోళిక స్థానం తెలియచేస్తున్నది. భారతప్రభుత్వం దీన్నొక విలక్షణ రీజియన్‌గా 1971లో గుర్తించి, 8రాష్ట్రాల అభివృద్ధికిగాను ఈశాన్య మండలిని ఏర్పాటు చేసింది. 1995లో ఈశాన్య ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నెలకొల్పింది. 2001లో ఈశాన్య రీజియన్ అభివృద్ధి డిపార్టుమెంట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2004లో దానికి మంత్రిత్వశాఖ ప్రతిపత్తి ఇచ్చింది. ఈశాన్య రాష్ర్టాలలోని వనరులను పూర్తిగా ఉపయోగంలోకి తేవ డం, మయన్మార్ మొదలుకొని తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా కొన్నేండ్లుగా ఈ ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణంపై కేంద్రం ఆసక్తి చూపిస్తున్న ది. ఈ క్రమంలోనే దాదాపు ఆరేండ్ల కింద ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రారంభమైన వంతెన ఇప్పటికి కానీ పూర్తి కావచ్చింది. మెల్లగా సాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు, ఈశాన్యమంతటా మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్ప అక్కడి ప్రజలు అభివృద్ధికి నోచుకోరు.వివిధ రవాణా వ్యవస్థల ద్వారా ఆగ్నేయాసియాతో సంబంధాలను సుగమం చేసే ఈ విధానంలో ఈ శాన్యభారత్ అభివృద్ధి అంతర్భాగం. కేంద్రంలో ఏ పార్టీ లేక కూటమి ప్రభుత్వం ఉన్నా ఇదే విధానాన్ని అనుసరిస్తూ వచ్చాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి నిర్లక్ష్యం వహించడంతో అక్కడ వేర్పాటువాద, ఇతర తీవ్రవాద సాయుధ పోరాటాలు పెచ్చరిల్లాయి. దేశ విభజన మూలంగా బంగ్లాదేశ్‌తో ఈశాన్య ప్రాంతాలతో అనుసంధా నం లేకుండాపోయింది. చారిత్రకంగా బ్రిటిష్ పాలన చివరి ఘట్టం వరకు మయన్మార్ కూడా ఈశాన్యంతో కలిసిపోయి ఉండేది. ఈశాన్య రాష్ర్టాలకు బంగ్లాదేశ్ లోని రేవు పట్టణాలు ఉపయోగపడేవి. వీరికి ఢాకా వాణిజ్య కేంద్రంగా ఉండేది. భౌగోళికంగా ఈశా న్య ప్రాంతానికి ఒకవైపు హిమాలయ తూర్పు నదీ పాయలు, మరోవైపు పీఠభూమి ఉన్నాయి. దేశ ప్రధాన భూభాగానికి రావడానికి సన్నని కోడి మెడ వంటి కూచ్ బెహర్ ప్రాంతమే అనుసంధా నం. బర్మా, బంగ్లాదేశ్‌లతో వాణిజ్యానికి తలుపు లు మూసుకుపోవడం ఈశాన్య ప్రాంత జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది.
ఆసియా రహదారి మార్గాలు పూర్తయితే ఈశాన్యంలో పరిశ్రమలకు ఆసియా వ్యాప్త మార్కెట్ లభిస్తుంది. ఈశాన్య ప్రాంత అభివృద్ధితో పాటే అక్కడి ప్రజలు మానసికంగా దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసిపోయే చర్యలు తీసుకోవాలె. ఈశాన్య రాష్ర్టాలలో అక్షరాస్యత ఎక్కువ. మిజోరం, త్రిపుర, నాగాలాండ్ తదితర రాష్ర్టాలలో కూడా ప్రజలు అక్షరాస్యులు కావడమే కాకుండా, ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఈ మానవ వనరులను ఉపయోగించుకోవడంపై కూడా దృష్టి పెట్టాలె. దేశంలోని మిగతా ప్రాంతాలకు వీరి నైపుణ్యం ఉపయోగపడుతుంది. ఇదేవిధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి ప్రకృతి వనరులతో పాటు అక్షరాస్యత అనుకూలాంశం. అసోంలో ప్రధాని మోదీ ప్రారంభించిన వంతెన ఈశాన్య ప్రాంత అభివృద్ధికి సూచిక కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com