Home > Editorial > కొరకరాని కొయ్యగా జీఎస్టీ

కొరకరాని కొయ్యగా జీఎస్టీ

నివేదికలకే పరిమితమవుతున్న పోలీస్ సంస్కరణలు
మానవహక్కుల్లో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణ

gst-apduniaసరకులు, సేవల పన్ను (జిఎస్‌టి) వ్యాపారులకే కాక ప్రభుత్వానికి కూడా కొరుకుడు పడనిదిగా ఉంది. ఆ వ్యవస్థను సరిగా రూపొందించకపోవడం వల్ల అమలులో విపరిణామాలు ఎదురవుతున్నాయి. ధరలు పెరిగిపోవడం వాటిలో ముఖ్యమైనది. రెస్టారెంట్లలో ఆహార పదార్థాలపై 18 శాతం పన్ను విధిస్తున్నారు. దానివల్ల సరదాగా బైట గడుపుతూ తినాలనుకొనేవారికి ఖర్చులు పెరిగిపోయాయి. జిఎస్‌టి అసలు ఉద్దేశానికి అది విరుద్ధం. జిఎస్‌టి అమలులోకి వచ్చాక ధరలు దిగివస్తాయని ప్రభుత్వం ప్రచారం చేసింది. చివరకు ధరలు పెరిగాయి. 18 శాతం పన్నుతో చాలా సేవల రేట్లు కూడా పెరిగాయి. గతంలో చార్జి చేసింది 15 శాతం.

టోకు ధరల సూచీ(డబ్లుపిఐ)లో సేవల రేట్లు ప్రతిఫలించవు. ద్రవ్యోల్బణ సూచీని డబ్లుపిఐ ఆధారంగానే రూపొందిస్తారు. అందుచేత సేవల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం సూచీలో కనపడదు. దేశం లో 60 శాతం ఉత్పత్తులపై సేవల పన్ను విధిస్తారు. గత చాలా సంవత్సరాలుగా సేవల ధరలు పెరుగుతూ వచ్చాయి కానీ ద్రవ్యోల్బణ సూచీలలో ప్రతిఫలించకపోవడం వల్ల దానిని తక్కువగా అంచనా వేసినట్లు అయింది. సేవల ధరలు పెరగడానికి ప్రభుత్వం వాటిపై పన్ను ను 15శాతానికి, ఇప్పుడు 18 శాతానికి పెంచడమే కారణం. సరకు లు, సేవల ధరల సూచి పెరిగినపుడు ఆ భారం వినియోగదారులకు బదిలీ కావడం మామూలే.

జిఎస్‌టి వ్యవహారంలో ప్రభుత్వం చెప్పింది ఒకటి, జరిగింది మరొకటి కావడానికి కారణం ఎమిటి? అసలు జిఎస్‌టి ధరలను తగ్గిస్తుందని అనుకొన్నారు. పన్నులపై పన్ను వల్ల తుదకు పన్ను భారం పెరగడం జరుగుతుంది. ఈ ‘బహుళ పన్నుల’ ప్రభావాన్నే జిఎస్‌టి తొలగిస్తుందని చెప్పారు. ఉదాహరణకు ఒక రెస్టారెంట్ కొనే ముడిసరుకులపై చెల్లించిన పన్నువల్ల అక్కడి తిన్నవారిపై పన్ను భారం పెరుగుతుంది. ఎందుకంటే ముడిసరకులపై పన్ను, తయారైన ఆహార పదార్థంపై పన్ను కూడా కస్టమర్ చెల్లించాలి. కస్టమర్ బిల్లు మొత్తం లో సరకులకు చెల్లించిన పన్ను కూడా ఉంటుంది. అంటే ఆహారంపై పన్నుకు సరకుల పన్ను అదనంగా తోడవుతుంది.

జిఎస్‌టి కింద ‘ఇన్‌పుట్ క్రెడిట్’ సౌకర్యం కల్పించారు. ముడిసరకులపై చెల్లించిన పన్ను మీద పరపతి సౌకర్యం ఇది. అందువల్ల కొన్న సరకులు అందించిన సేవల ధరలు తగ్గుతాయని భావించారు. అంటే తగ్గిన తయారీ సరకు ధరలపై విధించే పన్ను కూడా తగ్గుతుందని అనుకున్నారు. అయితే రెస్టారెంట్లు ఆ పని చేయడం లేదు. బదులుగా ఒకే తయారీపై రెండుసార్లు లాభపడే పద్ధతిని అవి అవలంబిస్తున్నాయి. అవి ముడిసరకులపై కట్టిన పన్నును చూపించి పరపతి సౌకర్యం వినియోగించుకుంటాయి. ఆ డబ్బు లాభానికి తోడవుతుంది. అక్కడితో ఆగకుండా అవి కస్టమర్ల నుంచి హెచ్చు ధరను వసూలు చేస్తాయి.

ఒక రెస్టారెంట్ రూ.1000కి అమ్మే ఆహార పదార్థం కోసం రూ.500 విలువ చేసే ముడి సరకులు కొంటే వసూలు చేసే జిఎస్‌టి మొత్తం రూ.180 అవుతుంది. అయితే రెస్టారెంట్‌కు రూ.90 ఇన్‌పుట్ రుణం లభిస్తుంది. ప్రభుత్వానికి రెస్టారెంట్ ఆ పదార్థం అమ్మినందుకు చెల్లించే పన్ను మొత్తం రూ.180. అందులో ఇన్‌పుట్ క్రెడిట్‌పోను రూ.90 కస్టమర్ నుంచి వసూలు చేయాలి. కానీ మొత్తం రూ.1,180 వసూలు చేస్తాయి. ఇన్‌పుట్ క్రెడిట్ మిగుల్చుకుంటాయి కనుక వాటి లాభానికి అది తోడవుతుంది. ఏమైనప్పటికీ జిఎస్‌టి వ్యవస్థను రూపొందించడంలో తప్పిదాలవల్ల కొన్నవారి, అమ్మినవారి ఇన్వాయిస్‌లు కలిసినప్పుడే ఇన్‌పుట్ క్రెడిట్ వ్యాపారికి లభిస్తుంది. అంటే ఒక రెస్టారెంట్ యజమాని అనేకమంది సరఫరాదార్ల వెంట పడాలి. ప్రత్యామ్నాయ సరఫరా కేంద్రాలకు మారడం మరింత ఖర్చుతో కూడిన పని. సరఫరా చైన్లు సులభంగా ఏర్పడవు.

అందుచేత రేట్ల జాబితా ధరలను రెస్టారెంట్లు తగ్గించడం లేదు. ఎందుకంటే ఇన్‌పుట్ క్రెడిట్ లభిస్తుందన్న గట్టి నమ్మకం వాటికి లేదు. అందుచేత జిఎస్‌టి ముందునాటి ధరల జాబితాలే కొనసాగుతున్నాయి. అంటే ప్రభుత్వానికి జిఎస్‌టి పన్నుల ఆదాయం దక్కనట్టే. దేశంలో పూర్తి స్థాయి జిఎస్‌టి అమలులో లేదు. ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తులు, విద్యుత్, రియల్ ఎస్టేట్, మద్యం జిఎస్‌టి పరిధి వెలుపలే ఉన్నాయి. అవి కూడా భారీ పన్నులు విధించే సరకులు కావడంతో వినియోగదారులకు ‘బహుళ పన్నుల ప్రభావం’ తప్పడం లేదు. 50శాతం సరకులు జిఎస్‌టి పరిధిలో లేనందువల్ల వాటి ధరలు పెరగకూడదు.

సామాన్య వినియోగదారు వాడేది చాలా వరకు ఈ అత్యవసర సరకులే. బియ్యం, పాలు, గుడ్లు, ఉప్పు, చేనేత వస్త్రాలపై జిఎస్‌టి లేదు. అయితే పరోక్ష పన్నుల వల్ల వాటిపై కూడా సామాన్యుడు పన్ను చెల్లిస్తున్నాడు. ఎలాగంటే ఉదాహరణకు పాలు ఒక చోట నుంచి మరోచోటకు రవాణా చేయాలి. అలాగే ఇతర అత్యవసర సరకులు కూడా. రవాణా తర్వాత నిల్వ సమస్య వస్తుంది. అందుకు తప్పని సరిగా అకౌంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ అన్ని సేవలపై జిఎస్‌టి పడుతుంది. జీరో పన్ను సరకులపై కూడా చివరకు జిఎస్‌టి పడుతోంది. దానితో ఆ సరకుల ధరలు కూడా పెరుగుతున్నాయి. పన్నుల సరకులు అంతగా వినియోగించని సామాన్యుడిపై కూడా ద్రవ్యోల్బణం ప్రభావం జిఎస్‌టివల్ల చెప్పుకోదగ్గంత ఉంటోంది. ప్రభుత్వం ముందుగా ‘రెవెన్యూ న్యూట్రల్ రేట్ (ఆర్‌ఎన్‌ఆర్)’ పన్నును నిర్ణయించింది. అది పన్ను సగటు రేటు. రెండు కమిటీలు దానిని 12 శాతం, 15 శాతంగా ప్రతిపాదించాయి. ప్రభుత్వం మాత్రం 15 శాతాన్ని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ అంచనాలను రూపొందిస్తే అది 8 శాతం ఉండవచ్చని తేలింది.

అంటే ప్రభుత్వం నిర్ణయించిన 15 శాతం రేటు చాలా ఎక్కువ. జిఎస్‌టి అమలుకు ముందు చెల్లిస్తున్న పన్నుల రేటుకు దగ్గరగా వివిధ సరకుల రేటును నిర్ణయించడం తదుపరి జరగాలి. కానీ ప్రభుత్వం దానిని కూడా 18 శాతం, 12 శాతం – రెండు విధాలుగా నిర్ణయించింది. 18శాతం జిఎస్‌టి విధించే సరకుల ధరలు ఎక్కువగా పెరుగుతాయి. 12శాతం జిఎస్‌టి సరకుల ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండడానికి 12శాతం రేటునే ప్రభుత్వం నిర్ణయించి ఉండాల్సింది. కానీ 18శాతం రేటును కూడా కొన్ని సరకులకు తెచ్చింది. కేవలం విలాస వస్తువులకే 18శాతం రేటును పరిమితం చేయాల్సింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వదుల్చుకోవాలనుకున్న ‘బహుళ పన్నుల ప్రభావం’ మరో రూపంలో కొనసాగుతూ వస్తోంది. వినియోగదారు పై జిఎస్‌టి తర్వాత ధరల భారం పెరగడానికి ఆ పన్నుల వ్యవస్థను సక్రమంగా రూపొందించకపోవడమే కారణమని చెప్పాలి.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *