Home > Politics > మోడీ, బాబు భేటీపై సర్వత్రా ఉత్కంఠ

మోడీ, బాబు భేటీపై సర్వత్రా ఉత్కంఠ

పశ్చిమలో టీడీపీ, బీజేపీ వార్
తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి వారే..యమునే తీరే

chandrababu-narendramodi-apduniaరాష్ట్ర విభజన జరిగి అప్పుడే నాలుగేళ్లు కావస్తోంది… విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలు ఇంతవరకూ అమలు కాలేదు. విభజనతో రాష్ట్రం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. ఆదుకునే బాధ్యత కేంద్రంపైనే ఉంది… మరి కేంద్రం కనికరిస్తుందా… ప్రధాని భేటీలో సమస్యల పరిష్కారం దొరుకుతుందా… విభజన సమయంలో ఏపీకి కేంద్రం నుంచి అనేక హామీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా విభజన చట్టం-2014లో మాత్రం వాటన్నింటినీ పొందుపర్చడం జరగలేదు. ప్రత్యేక హోదా కూడా ఈ కోవలోకే వస్తుంది. దీంతో ఏపీకి విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా.. చెప్పుకోదగ్గ న్యాయం జరగలేదనే అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీపై అందరి దృష్టి నెలకొంది. ప్రధానితో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించే అవకాశాలున్నాయి. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ… పోలవరం ప్రాజెక్టుని గడువు ప్రకారం పూర్తి చేసేందుకు, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, విశాఖకు రైల్వే జోను, ఈఏపీ ప్రాజెక్టులకు సకాలంలో అనుమతులు, శానసనభ నియోజకవర్గాల పునర్విభజన వంటి పలు అంశాలపై చర్చించే అవకాశముంది. ప్రధాని మోడీదృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఎన్ని అమలయ్యాయి? ఎన్ని పెండింగులో ఉన్నాయి? వంటి అంశాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడీతో సీఎం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రత్యేక హోదాను కాదని ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన సమయంలో కేంద్రం పలు హామీలు ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలి. హోదా ఇవ్వనందున దానిని భర్తీ చేసేందుకు 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్రంలో ఈఏపీల కోసం తీసుకునే రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యతను కేంద్రం తీసుకుంటానని హామీ ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఈఏపీ ప్రాజెక్టుల కోసం రంగం సిద్ధం చేసింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి వందశాతం ఆర్థిక సాయం అందించే బాధ్యత తమదేనని ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రాష్ట్రం సొంతగా 3,217 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రీయింబర్స్ మెంట్ చెయ్యాలి. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు, కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం పెరిగిన అంచనాలను ఆమోదించాల్సి ఉంది. విభజన హామీల అమలుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల అధినేతలతోపాటు… గవర్నర్ నర్సింహన్ కూడా అనేక మార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టి వచ్చారు… విభజన జరిగి మూడున్నరేళ్లు పూర్తి కావడంతో హామీలన్నీ కొలిక్కి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు… ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయముండటంతో కేంద్రం హామీలపై జోరుగా చర్చ జరుగుతోంది. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేంద్రం దృష్టిసారించినట్టు సమాచారం. ఇటీవల తెలుగురాష్ట్రాల గవర్నర్ నర్సింహన్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా విభజన హామీలను పరిష్కరించాలని కోరినట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో నర్సింహన్ సమావేశమై తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లోనూ తరచూ విభజన హామీలపై చర్చ జరుగుతూనే ఉంది.  ముఖ్యంగా ఉమ్మడి హైకోర్టు విభజన అంశంపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తుతున్నారు. చినరకు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రులు స్పందించి స్పష్టత ఇచ్చారు. ఒక్క హైకోర్టు అంశమే కాకుండా పలు అంశాలపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రస్తావనకు తెస్తున్నారు. ప్రత్యేక హోదా సహా అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అన్ని సమస్యలను కలిసి పరిష్కరించాలని సూచించారు.

ముఖ్యంగా ఏపీకి ఇచ్చిన విభజన హామీలు చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన పార్లమెంట్‌లో ప్రస్తావించారు. విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైన న్యాయం చేయాలని, అలాగే నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూలోటు అంశాలపై ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని సుజనా చౌదరి కోరారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఏర్పాటు కోసం ఏపీ భవనాలను అన్వేషిస్తోందని, ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలుస్తోందన్నారు. నిర్ణయించిన భవనాల్లోకి ఏపీ హైకోర్టు మారుతుందని, హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి కొంతకాలం సమయం పడుతుందన్నారు. పరస్పర గౌరవ భావంతో ఏపీ, తెలంగాణ ఉండాలని కోరుతున్నానని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. న్యాయశాఖ మంత్రి చేసిన ప్రకటన అభినందనీయమని ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు. విభజన సమస్యలు ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలని, అవసరమైతే కేంద్రం సహాయం చేస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విభజన చట్టంలోని హామీలన్నీ తప్పకుండా నెరవేర్చుతామని స్పష్టం చేశారు. హైకోర్టు అంశం మాత్రం సుప్రీంకోర్టు చూసుకుంటుందన్నారు.అలాగే గృహ నిర్మాణ రంగానికి కేటాయింపుల్లోనూ ఏపీకి న్యాయం జరగడం లేదనే వాదనా వినిపిస్తోంది. కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కేంద్ర పధకాల కింద ఇళ్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. గ్రామీణ పేదల కోసం పక్కా ఇళ్ల కేటాయింపుల్లో ఏపీకి నామ మాత్రంగాను మంజూరు చేయడం లేదు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరుగా విభజించి ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. 2016-17, 2017-18లకు గాను పీఎంఏవై-గ్రామీణ్‌ కింద ఏపీలోని గ్రామీణ పేదలకు 1,23,112 ఇళ్లు కేటాయించారు. అందులో తెలంగాణకు దక్కినవి కేవలం 70,674 ఇళ్లు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు నిధులు భారీగానే ఇస్తున్నా తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేటాయింపుల్లో కాస్త వివక్ష చూపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక 13వ షెడ్యూల్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ ఏర్పాటుకు అన్ని విధాల సహకరిస్తామన్నారు. ఎయిమ్స్‌ తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, బోధనాలయం ఏర్పాటుకు అంగీకారించారు. ఉద్యాన విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తు నిర్వహణ శిక్షణాలయం నెలకొల్పేందుకు హామీ ఇచ్చారు. వీటిలో కొన్ని నెరవేరగా… ఎన్‌ఐటీ-తాడేపల్లిగూడెం, కేంద్రీయ విశ్వవిద్యాలయం-అనంతపురం, గిరిజన  విశ్వవిద్యాలయం-విజయనగరం, పెట్రోలియం విశ్వవిద్యాలయం-విశాఖలకు కేటాయింపులు ప్రకటించినా నిధులు విడుదల కావాల్సి ఉంది.సెక్షన్‌ 94(3) ప్రకారం నూతన రాజధాని అమరావతిలో నిర్మించే రాజభవన్‌, సచివాలయం, హైకోర్టు, ఉభయసభలు, మంత్రులు, అధికారులు తదితరుల నివాస సముదాయాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం చేయాలి. సెక్షన్‌ 94(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. ఇంతవరకు ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి ఏదీ రాలేదు. వీటికి అవసరమైన ఏర్పాట్లు చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com