Home > Editorial > మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే

మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే

పెద్ద నోట్ల రద్దుకు ఏడాది
తీవ్ర మౌతున్న కాలుష్యం...

narendramodi-apduniaహిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును గుజరాత్ షెడ్యూలు కన్నా చాలాముందే ప్రకటించినప్పటికీ రాజకీయ పక్షాల దృష్టి అంతా గుజరాత్‌పై కేంద్రీకరించటం ఆ ఎన్నికల ఫలితాలకున్న జాతీయ ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇరువురూ గుజరాతీలే కావటం ఒక్కటే అందుకు కారణం కాదు. 22 ఏళ్లుగా గుజరాత్‌లో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న బిజెపికి మామూలుగానైతే ఈ ఎన్నికలు నల్లేరుమీద నడక. కాని దాని ఏకచ్ఛత్రాధిపత్యాన్ని సవాలు చేసే విధంగా సామాజిక పొందికల్లో వచ్చిన మార్పులు బిజెపిని కలవరపెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూలు ప్రకటనలో జాప్యానికి వరద సహాయక పనులు కారణంగా ఎన్నికల సంఘం సమర్థించుకున్నప్పటికీ, ప్రధానమంత్రి ఆ సమయాన్ని పర్యటనలకు ఉపయోగించుకుని రూ.11,000కోట్ల వాగ్దానాల వరద పారించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి గుజరాత్ అభివృద్ధి నమూనాను జాతీయ ప్రచారంలోకి తెచ్చి అటువంటి అభివృద్ధి కావాలంటే మోడీ ప్రధానమంత్రి కావాలని విజ్ఞప్తులు చేయటం గుర్తు చేసుకోదగింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేసినట్లే, 2017 ఫలితాలు 2019 వేసవిదాకా ప్రభావవంతంగా ఉంటాయని ప్రధాన ప్రత్యర్థులైన బిజెపి, కాంగ్రెస్ రెండింటికీ తెలుసు.మోడీ ప్రధానమంత్రి అయిన తదుపరి గుజరాత్‌లో బిజెపి నాయకత్వం బలహీనపడింది. ఆయన వారసురాలిగా ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన ఆనందీబెన్ పటేల్‌ను మధ్యలో తొలగించి విజయ్ రూపానీని అందలమెక్కించారు. పటీదార్‌ల రిజర్వేషన్ ఆందోళన బిజెపిని కుదిపివేసింది. మరోవైపున ఆవు చర్మం ఒలుస్తున్నారన్న నెపంతో గోరక్షకులు ఉనావ్ గ్రామంలో దళిత యువకులను హింసించటానికి వ్యతిరేకంగా జిగ్నేశ్ మేవాని అనే యువకుడు దళితులను పెద్దఎత్తున సమీకరించాడు. కాగా ఒబిసి కులాల హక్కుల కొరకు అల్ఫేష్ ఠాకూర్ పెద్ద ఉద్యమం లేవదీశాడు. ఎన్నికల్లో పోటీచేసే వయస్సులేని 24 ఏళ్ల హర్దిక్ పటేల్ పటీదారు యువతను సునాయాసంగా వీధుల్లోకి తేవటం బిజెపి సాంప్రదాయక మద్దతుదార్లయిన పటేల్ సముదాయ ఓట్లకు పెద్దగండి కొట్టనుంది. ఈ ముగ్గురు యువకులు బిజెపిని వ్యతిరేకిం చటం, కాంగ్రెస్‌తో కలిసి పనిచేయటం మోడీషా ద్వయాన్ని కలవరపెడుతున్నది. హర్దిక్ పటేల్ బిజెపిని ఓడించటమే లక్షంగా రాహుల్ కాంగ్రెస్‌తో మంతనాలు సాగిస్తున్నాడు. అల్ఫేష్ ఠాకూర్ కాంగ్రెస్‌లో చేరాడు. కాగా జిగ్నేశ్ మేవాని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు.అంతేగాక పెద్దనోట్ల చలామణీ రద్దు, జిఎస్‌టి అమలు గుజరాత్‌లోని చిన్న,మధ్య తరహా పరిశ్రమలను, వ్యాపారులను, వారిపై ఆధారపడిన శ్రామికులను విపరీతంగా దెబ్బతీసింది. సూరత్‌లో వస్త్రవ్యాపారులు వారాల తరబడి ఆందోళన చేయటం గుర్తుచేసుకోదగింది. రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ కారణాలన్నీ బిజెపి పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తికి హేతువైనాయి. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిజెపి ముందస్తు ఓటములు చవిచూసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు షా ముందస్తు వ్యూహాలు రచించారు. శంకర్‌సింగ్ వాఘెలా నాయకత్వంలో కాంగ్రెస్ శాసనసభ పక్షంలో చీలిక తెచ్చాడు. ఓట్ల చీలిక నుంచి లబ్దిపొందే వ్యూహంతో అతని గ్రూపును పార్టీలో చేర్చుకోకుండా సొంతపార్టీ పెట్టించి స్వతంత్రంగా పోటీ చేయిస్తున్నారు. 182 అసెంబ్లీ సీట్లలో 152 గెలవటం లక్షంగా షా నిర్దేశించాడు.సాధారణంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడి పార్టీ ఉనికిని కాపాడుకోవలసిన స్థితిలోని కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు కలిసివచ్చాయి. ఇప్పుడది అధికారంపై ఆశలు పెంచుకుంది. అయితే ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసి ప్రజల తో ముఖాముఖీ మాట్లాడటం మొదలుపెట్టాక పరిస్థితిలో మార్పు వస్తుందని పరిశీలకుల భావన. అయితే కాంగ్రెస్ నుంచి గట్టి కుదుపును తోసిపుచ్చటం లేదు.డిసెంబర్9,14తేదీల్లో పోలింగ్ అనంతరం18న ఓట్ల లెక్కింపు వరకు ఉత్కంఠ తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com