Home > Editorial > మానవహక్కుల్లో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణ

మానవహక్కుల్లో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణ

కొరకరాని కొయ్యగా జీఎస్టీ
స్కూళ్లలో కొరవడుతున్న రక్షణ

narendramodi-apduniaప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎవ్వరు చేయనన్ని విదేశీ పర్యటనలను చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆయనను గొప్ప నాయకుడిగా ప్రజలముందు ఉంచడం కోసం ఒక వంక కేంద్ర ప్రభుత్వం, మరోవంక బిజెపి విశేష ప్రయత్నాలు చేస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం కలిగి ఉండటమే కాకుండా విదేశాంగ మంత్రిగా అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్నట్లు పేరు తెచ్చుకున్న సుష్మ స్వరాజ్‌ను దాదాపు కదలనీయకుండా చేసి ప్రధాని, ఆయన కార్యాలయంలోని కొద్దిమంది అధికారులే విదేశాంగ విధానంపై ఆధిపత్యం వహిస్తున్నారు.ఎంతగా ప్రచారం చేసుకొంటున్నప్పటికి మానవహక్కుల విషయంలో మాత్రం మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతున్నది. మయన్మార్ నుండి మన దేశంలోకి ప్రవేశిస్తున్న రోహింగియా శరణార్ధుల విషయంలో ఇప్పటికే ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి ఆగ్రహానికి గురైంది. ఐక్యరాజ్య సమితి నుండి రెండు సందర్భాలలో భారత్ ‘సంజాయిషీ’ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదటగా నాలుగున్నర ఏళ్లకు ఒకసారి మానహక్కుల మండలి జరిపే యుపిఆర్ సందర్భంగా మన దేశంలోని మానవహక్కుల పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా దృష్టి సారించే అవకాశం ఏర్పడింది. మన దేశంలో మానవహక్కుల పరిస్థితులను మెరుగుపరచవలసిన అవసరం గురించి 109 దేశాల ప్రతినిధులు 250 సిఫార్సులు చేశారు. వీటిల్లో సుమారు 100 సిఫార్సులను భారత్ తిరస్కరించింది. చిత్రహింసల వ్యతిరేక ఒడంబడికకు భారత్ ఆమోదం తెలుపకపోవడం గురించి 20 దేశాలు ప్రస్తావించాయి. చివరకు మానవహక్కులు పాఠ్యాంశములలో భాగంగా చేయాలనీ సిఫార్సు పట్ల కూడా భారత్ ప్రతికూలంగా స్పందిస్తున్నది. మొత్తం ఐక్యరాజ్యసమితి ఏర్పాటు ప్రపంచ ప్రజల మానవహక్కుల పరిస్థితులను మెరుగుపరచడం అయినప్పటికీ వివిధ స్థాయిలలో నెలకొన్న మానవహక్కుల పరిస్థితుల గురించి నేరుగా ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా యుపిఆర్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం 48 దేశాలు చొప్పున నాలుగున్నరేళ్లలో అన్ని దేశాలలోని పరిస్థితులను సమీక్ష జరుపుతారు. ఇప్పటికే ఆ విధంగా రెండుసార్లు జరిపి, మూడోసారి సమీక్షలను ఈ సంవత్సరమే ప్రారంభించారు.యుపిఆర్ విషయంలో మాత్రం పౌర సమాజ సంస్థలను సహితం భాగస్వాములుగా చేస్తూ ఉండడంతో ప్రభుత్వాలు కొన్ని విషమ పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. మొదటిసారి సమీక్ష జరిపినప్పుడు భారత ప్రభుత్వం పౌరసమాజ సంస్థలను పరిగణనలోకి తీసుకోలేదు. భారత్ ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించిన అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రస్తోగి మాత్రం ‘‘పౌర సమాజ సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఈ నివేదిక తయారీలో భాగస్వాములను చేసాము’’ అని చెప్పుకోవలసి వచ్చింది.దేశంలోని ప్రముఖ మహావహక్కుల వేదికలు కలసి ‘‘వర్కింగ్ గ్రూప్ ఆన్ హ్యూమన్ రైట్స్’’గా ఏర్పడి, ఈ విషయమై విస్తృతమైన సంప్రదింపులు జరుపుతూ సమగ్రమైన నివేదికను మానవహక్కుల మండలికి సమర్పిస్తూ వస్తున్నది. ఈ విషయమై 22 రాష్ట్రాలలో రాష్టస్థ్రాయి సంప్రదింపులు, జాతీయ స్థాయిలో రెండు రోజులపాటు అటువంటి సంప్రదింపులు జరిపింది. వీరి నివేదికను వేయి మందికి పైగా పౌర సమాజ సంస్థలు, ప్రముఖులు సమర్ధించారు. మే 4న జెనీవాలో భారత్‌లోని పరిస్థితులపై సమీక్షా జరుపుతూ ఉండగా దేశంలో 50 ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ సమీక్షను పరిశీలించే ఏర్పాటు చేయడంతో ఈ సమీక్ష గురించి దేశ వ్యాప్తంగా ఒక కదలిక ఏర్పడింది. అంతకు ముందు ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు సహితం తెలియకుండా జరిగే సమీక్ష ఇప్పుడు అందరి దృష్టి పడటం సహితం మోడీ ప్రభుత్వానికి కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ మొత్తం ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనవలసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ సహితం ప్రేక్షకపాత్ర వహించేటట్లు చేశారు. ఇక ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారతదేశంలో పనిచేస్తున్న జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అక్రిడిటేషన్ ఇచ్చే ప్రక్రియ నవంబర్ మధ్యలో జరుగనున్నది. అది సహితం మోదీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా ఇరకాటంలో పడవేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఉన్న ‘1 ప్లస్’ గ్రేడ్ తిరిగి లభించని పక్షంలో అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ప్రతిష్ఠ దిగజారడానికి దారితీయగలదు. ఈ అక్రెడిటేషన్ ప్రక్రియను జాతీయ మానవహక్కుల సంస్థల అంతర్జాతీయ కూటమికి చెందిన ఉప సంఘం చేయనున్నది. వాస్తవానికి భారత్ ఆక్రిడిటేషన్ గత సంవత్సరమే ముగిసింది. తిరిగి పునరుద్ధరించడానిక తిరస్కరించిన ఈ ఉపసంఘం పరిస్థితులను మెరుగు పరుచుకోవడానికి మరో సంవత్సరం గడువు ఇచ్చింది. ఈ సంవత్సరంలో పరిస్థితులను మెరుగు పరుచుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేనేలేవు.సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులుగా పారదర్శక, బహిరంగ పద్ధతిలో ప్రతిభ ఆధారంగా నియమించాలి.స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ కార్యకర్తలు, స్వతంత్ర నిపుణులతో వోటింగ్ హక్కు లేకుండా మానవహక్కుల కమిషన్‌కు సలహా మండలి నియమించాలి.తన నియమ నిబంధనలను, మార్గదర్శక సూత్రాలను తానే జారీచేసుకొనే, ఎవ్వరినైనా వాటి ఉల్లంఘనకు పాలపడితే వేలెత్తి చూపే విధంగా కమిషన్‌కే అధికారం కల్పించాలి.ప్రస్తుతం ఢిల్లీకే పరిమితం అయినా కమిషన్ కార్యాలయానికి అదనంగా తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో అదనపు కార్యాలయాలను ఏర్పాటు చేయాలి.తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భాలలో అత్యవసర పరిస్థితులలో సంప్రదించడం కోసం టోల్‌ఫ్రీ జాతీయ స్థాయి హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలి.

జమ్మూ కశ్మీర్‌లో సహా పారామిలటరీ దళాలు, సైన్యానికి సంబంధంగల మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులను చేపట్టే అధికారం కల్పించాలి. సైనికులు పాల్పడుతున్న మానవహక్కుల ఉల్లంఘనల ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారం కల్పించాలి. మోదీ ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో ‘1 ప్లస్’ గ్రేడ్ లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ గ్రేడ్ లభించని పక్షంలో జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రతినిధులు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివిధ ప్రక్రియలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. భద్రతా మండలిలో సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది. అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యం ప్రక్రియ సక్రమంగా లేని దేశాల సరసన భారత్ నిలబడవలసి వస్తుంది. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా కేవలం భారత్‌లో మాత్రమే 9 జాతీయ స్థాయి మానవహక్కుల కమిషన్లు వివిధ వర్గాలకు ఉన్నాయి. అయితే జాతీయ మానవహక్కుల కమిషన్ వాటిని తమతోపాటు సమానంగా భావించడం లేదు. అంతర్జాతీయ వేదికలపై వాటికి భాగస్వామ్యం కల్పించడం లేదు. పైగా మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొనే ఐపిఎస్, ఐఎఎస్ అధికారులను సహితం కమిషన్ సభ్యులుగా చేసిన ఘనత భారత ప్రభుత్వానికే దక్కుతుంది. పౌర సమాజాన్ని చెందిన వారెవ్వరిని కమిషన్ సభ్యులుగా ఇప్పటివరకు చేయలేదు. ఉద్యోగ విరమణ చేసిన న్యాయమూర్తులకు పునరావాసం కల్పించే వేదికలుగా కమిషన్లు మారిపోయాయి. ఈ మొత్తం పక్రియ నేడు అంతర్జాతీయంగా సమీక్షకు నిలబడుతున్నది. మయన్మార్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీ వీరిపట్ల జరుగుతున్న అణచివేత చర్యల గురించి నోరు మెదపక పోయినా వారి విషయంలో సంయమనం పాటించాలని అంటూ సుష్మ ఆ దేశ ప్రభుత్వానికి హితవు చెప్పారు. భారత్ ప్రభుత్వంలో స్పష్టంగా రెండు నాల్కల ధోరణి కనిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *