Home > Politics > నవీన్…ఓడించడం అంత వీజీ కాదు

నవీన్…ఓడించడం అంత వీజీ కాదు

హామీలను సమీక్షించాలి : సిఎం చంద్రబాబు
21 తర్వాతే టీడీపీ తెగతెంపులు

naveen-patnaik-apduniaనవీన్ పట్నాయక్… నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. హంగు, హడావిడి, ఆర్భాటానికి పూర్తిగా దూరంగా ఉండే నిబద్ధత గల నాయకుడు. సామ్యవాది. సౌమ్యుడు. లౌకిక వాది. వరుసగా పదిహేడేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ప్రాంతీయ నాయకుడు. పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన నవీన్ పట్నాయక్ నేటి తరం నాయకులుకు, ప్రాంతీయ పార్టీల నాయకులకు ఆదర్శప్రాయుడు. మచ్చలేని వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. ఇన్ని సద్గుణాలు కలిగిన నాయకుడు అరుదేనని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిజూ జనతాదళ్ అధినేతగా రెండు దశాబ్దాలకు పైగా పార్టీకి చక్కటి సారథ్యం అందజేస్తున్నారు. అదేసమయంలో దాదాపు రెండు దశాబ్దాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సత్పరిపాలనను అందిస్తున్నారు. అటు కేంద్రంతో అనవసరంగా గొడవలకు పోకుండా సత్సంబంధాలు నెరుపుతున్నారు. సాధారణంగా ప్రాంతీయ పార్టీల నాయకుల్లో ఇన్ని అరుదైన లక్షణాలు ఉండటం ఒకింత కష్టమైన పనే అనడం అవాస్తవం కాదు.తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అస్కో స్థానం నుంచి 90వ దశకం ద్వితీయార్థంలో లోక్ సభకు ఎన్నికైన నవీన్ పట్నాయక్ అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 1998 నుంచి 2000 వరకూ అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో పనిచేశారు. జనతాదళ్ లో చీలిక అనంతరం తన తండ్రి బిజూ పట్నాయక్ పేరుతో 1997లో డిసెంబర్ 26న బిజూ జనతాదళ్ పార్టీని ప్రారంభించారు. కేంద్రమంత్రిగా పనిచేస్తూ 2000 సంవత్సరంలో రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. నాటి ఎన్నికల్లో మొత్తం 147 స్థానాలకు గాను 68 సాధించి బీజేపీ మద్దతుతో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆ అవసరం లేకుండా పోయింది. రోజురోజుకూ పార్టీని విస్తరించడమే తప్ప వెనకడుగు వేసింది లేదు. 2004లో మళ్లీ మెజారిటీ స్థానాలను సాధించి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు.2009లో ఆయన బలం అమాంతం 107కు పెరిగింది. విపక్ష కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. గతంలో ద్వితీయ పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. మొదటి సారి పట్నాయక్ సొంత బలంతో సీఎం అయ్యారు. నాలుగోసారి 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ బలం 117 స్థానాలకు పెరిగింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా నవీన్ పట్నాయక్ హవా నడుస్తోంది. 1998లో మొత్తం 21 స్థానాలకు గాను పార్టీ 9 స్థానాలను గెలుచుకుింది. 2004లో 11, 2009లో 14 స్థానాలను బీజేడీ సాధించింది. 2014 ఎన్నికల్లో విశ్వరూపం ప్రదర్శించింది. దేశ వ్యాప్తంగా మోడీ ప్రభంజనం వీచినా మొత్తం 21 స్థానాల్లో 20 లోక్ సభ స్థానాలను సాధించి సత్తా చాటింది. కేవలం సుందర్ ఘర్ నియోజకవర్గంలో మాత్రమే ప్రస్తుత కేంద్రమంత్రి జ్యుయల్ ఓరమ్ గెలిచారు. తాజాగా ఇటీవల జరిగిన బీజెపుర అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో42 వేల ఓట్ల మెజారిటీతో పార్టీ అభ్యర్థి రీటా సాహు గెలుపొందడం నవీన్ పట్నాయక్ వ్యక్తిగత ప్రతిష్టకు నిదర్శనం. వాస్తవానికి ఇది కాంగ్రెస్ స్థానం. మూడు సార్ల నుంచి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుబల్ సాహు మరణంతో పట్నాయక్ తెలివిగా ఆయన భార్య రీటా సాహును బరిలోకి దించి గెలిపించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారగా బీజేపీ ద్వితీయ స్థానంలో నిలవడం గమనార్హం. ఇదే అదనుగా విస్తరించాలన్నది బీజేపీ వ్యూహం.2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి గట్టి ప్రతిపక్షంగా ఎదగాలన్నది బీజేపీ యోచన. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. రాష్ట్రానికి చెందిన పార్టీ నాయకుడు ధర్మేంద్ర ప్రదాన్ ను కేంద్రమంత్రిని చేసింది. పార్టీ పటిష్టతలో భాగంగా ఆయనను బీహార్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయించి పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖను కట్టబెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరును తెరపైకితెస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, హిందుత్వ నినాదం, మోడీ పేరు ప్రతిష్టలతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని కమలం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి బలం లేని ఈశాన్య రాష్ట్రాల్లోనే విజయ ఢంకా మోగించామని, ఒడిశా తమకు లెక్కే కాదని బీజేపీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. గత రెండు ఎన్నికల్లో తమ బలం తగ్గినప్పటికీ 2000 అసెంబ్లీ ఎన్నికల్లో 38, 2004లో 38 స్థానాలను సాధించామని గుర్తు చేస్తున్నారు. అధికార సాధన లేదా గట్టి ప్రతిపక్షంగా ఎదగాలన్న తమ లక్ష్యాన్ని ఈసారి ఎవరూ అడ్డుకోలేరని కమలం పార్టీ నాయకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *