Home > Editorial > వ్యవసాయానికి సాయం అవసరం

వ్యవసాయానికి సాయం అవసరం

అనాధ నుంచి స్విట్జర్లాండ్ ఎంపీ వరకు....
వైట్ ఎలిఫెంట్స్ గా ఐఐటీలు

agriculture-apduniaపెరుగుతున్న జనాభా ఆకలి తీర్చడానికి అవసరమైన ఆధునిక వ్యవసాయ పద్ధతులు రసాయనాల కారణంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండడంతో సేంద్రియ సాగువైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. 2050 నాటికి ఇంకో 50% పంట దిగుబడి పెరిగితేగాని ప్రపంచ జనాభాకు కడుపునిండదు. ఇప్పటికే మనదేశంలో 19కోట్లు మంది ఆకలి రుచి చూస్తూనే ఉన్నారు. ఆరోగ్యం, ఆహారం రెంటికీ విలువిచ్చే సేంద్రియ సాగుకు దేశాలు అధిక ప్రాధాన్యత నీయవలసిన అవసరం కంటికి కనిపిస్తోంది.సేంద్రియ సాగులో జపాన్ ఈ మధ్య కొత్త విధానాన్ని కనుగొంది. హైడ్రోజెల్ పొరలపై కూరగాయలను రుచికరంగా పండిస్తోంది. సన్నని ఫిలిం పొరను నేలపై పరచి సహజ సిద్ధమైన మట్టిని దానిపై పరచి పంటలు తీస్తున్నారు. నీటి వినియోగం తక్కువై భూసార రక్షణ నిలిచిఉంటోంది. వ్యవసాయానికి దూరంగా ఉన్న నేలలోని మట్టిని తెచ్చి వాడడం ద్వారా వచ్చిన పంటలో సహజ సిద్ధమైన రుచులుంటున్నాయి. క్రమంగా ఈ విధానం కూడా సేంద్రీయ సాగురూపంలో వ్యాప్తి చెందవచ్చు.సేంద్రియ ఉత్పత్తుల కోసం నగరాల్లో విడిగా విక్రయ కేంద్రాలు ఏర్పడుతున్నాయి. సూపర్ బజార్, మాల్స్‌లో రసాయనిక, సేంద్రియ రకాలు రెండింటినీ అమ్ముతున్నారు. ధరల భయంతో వినియోగదారులు ఇంకా మామూలు ఉత్పత్తులనే కొనుగోలు చేస్తున్నారు.

కొనుగోలు స్తోమత ఉన్నవారు సేంద్రియ పదార్థాల వైపు మొగ్గు చూపడంతో ఇందులో మోసాలు కూడా మొదలవుతున్నాయి. సేంద్రియ ఉత్పత్తుల పేరిట అమ్ముతున్న వస్తువుల్లో రసాయనాలు, క్రిమి సంహారక మందుల అవశేషాలున్నట్లు ప్రయోగశాలలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించవలసిన అవసరం ఉంది.సేంద్రీయ సాగు చేసేవారికి, వారి ఉత్పత్తులకు విదేశాల్లో ప్రత్యేక లైసెన్సులు ఇస్తున్నారు. వారిపై ప్రభుత్వాల నిఘా ఉంటుంది. సేంద్రీయ దినుసు పేరిట నాణ్యత లేని వాటిని అమ్మితే లైసెన్సు రద్దు చేసి చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. మనదేశంలో కూడా ప్రభుత్వం ఈ దిశగా నిబంధనలను ఏర్పరచవలసిన అవసరం ఉంది. సేంద్రియ సాగును ప్రోత్సహించే విధంగా రాయితీలు కూడా ఉత్పత్తిదారులకు ప్రభుత్వం కల్పించాలి. సేంద్రియ సాగు శాతం పెరిగేలా, ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునే బాధ్యత సర్కారుపై ఉంది.అభివృద్ధి చెందిన దేశాలు ఆరోగ్యకర ఆహార పదార్థాల వైపు చూస్తుండగా మన దేశంలో ఇంకా పాల అధిక ఉత్పత్తి కోసం గేదెలకు హార్మోను ఇంజక్షన్లు ఇస్తున్నారు, కాపర్ సల్ఫేట్ వాడకం ద్వారా పండ్లు, కూరగాయలు రంగురూపులను కన్నులకింపుగా చేస్తున్నారు. ఆహార భద్రతతో పాటు కల్తీని నివారించవలసిన అవసరం ఎంతో ఉంది.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభంతోపాటు వ్యవసాయం కూడా దెబ్బతింది. సరిపడా తిండిగింజలు దొరకక ప్రజలు విలవిలలాడిపోయారు. దీర్ఘకాలంగా ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే, తక్షణం జనం క్షుద్బాధ తీర్చాలనే ఆలోచనలోంచి సాగుతీరు మారింది. అధిక దిగుబడికోసం రసాయనాల వాడకం అనివార్యమైంది. 20వ శతాబ్దం రెండో అర్థంలో మొదలైన సస్యవిప్లవం ఫలితంగా మొక్క ఎత్తు తగ్గి, పంట దిగుబడి పెరిగింది. మొక్కకు రోగాలనుండి రక్షణ లభించింది.సస్యవిప్లవ పితామహుడిగా పేరుపొందిన నార్మన్ బొద్గాగ్ పరిశోధనల ఫలితంగా 1965 70 మధ్యకాలంలో మెక్సికో, ఇండియా, పాకిస్థాన్ దేశాలలో గోధుమపంట ఉత్పత్తి రెండింతలైంది. తద్వారా వందకోట్ల ప్రజలకు ఆహార భద్రత లభించింది.వేల ఏళ్ళుగా ప్రకృతి సహజంగా కొనసాగిన వ్యవసాయం అందరి కడుపులు నింపలేని దశకు రావడంతో ఉత్పత్తి పెంపుకోసం కృత్రిమ ఎరువుల వాడకం తప్పనిసరైంది.1962లో ప్రొ॥ స్వామినాథన్ చొరవతో ఆనాటి కేంద్ర వ్యవసాయ మంత్రి సి.సుబ్రహ్మణ్యం ఆహ్వానంపై నార్మన్ బోర్లాగ్ మార్చి 1963లో మన దేశాన్ని సందర్శించారు. ఆయన తనతో తీసుకొని వచ్చిన వంద కిలోల సంకరజాతి విత్తనాలను దేశంలో విత్తడం జరిగింది. ఢిల్లీ, లుధియానా, పంత్‌నగర్, కాన్పూర్, పుణెలలో ఈ విత్తనాలవల్ల గోధుమ దిగుబడి పెరిగి ఇతర ప్రాంతాలకు ఈ విధానం విస్తరించింది.బొర్లోన్ సంకర విత్తనాల వల్ల ముందుముందు ముప్పు వాటిల్లగలదని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు విమర్శించినా, అదంతా ఆకలి బాధ తెలియని వారి వాదన అంటూ బొర్గొగ్ కొట్టిపడేశారు.ఇలా సాంప్రదాయక వ్యవసాయంలో ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల కారణంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు భాగమైపోయాయి. రసాయనాల వినియోగం 1970 ప్రాంతంలో హెక్టారుకు 13 కిలోలు ఉండగా 2000నాటికి వాటి అవసరం హెక్టారుకు 96 కిలోలుగా పెరిగిపోయింది. అలాగే క్రిమిసంహారక మందుల వాడకం కూడా 50ఏళ్లలో పదింతలైంది. 1970లో 24, 000 టన్నుల పురుగుమందులు 2000 నాటికి 45,000 టన్నులకు ఎగబాకింది.పంట దిగుబడిని, చీడపీడనుంచి విముక్తిని ఆశించి మందుల వాడకాన్ని పెంచుతూ పోవడంతో పండిన పంట విషతుల్యమైంది. పండ్లు, కూరగాయలు వాడేవారు పలు రోగాల బారిన పడుతున్నారని రుజువవుతోంది. ఆహారం కూడా రుచి పచి చచ్చి శరీరానికి ఎలాంటి బలాన్ని అందించలేని స్థితికి చేరుకుంది. ఈ దశలో సేంద్రీయ వ్యవసాయం తప్పనిసరైంది. సాంప్రదాయిక విధానానికి పర్యావరణ వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని జోడించి యంత్రాల వినియోగంతో సాగు చేయడమే సేంద్రియ వ్యవసాయంగా భావించవచ్చు. గత 40 ఏళ్లుగా పర్యావరణానికి కలిగిన కాలుష్యముప్పు ను, భూసార నష్టాన్ని నివారించేందుకు సేంద్రియ ఎరువులు తోడ్పడుతాయి.1990 నుండి మార్కెట్‌లో సేంద్రియ సాగు ఉత్పత్తుల అమ్మకాలు మొదలైనాయి. మన దేశం లో ఈ పయనం ఆలస్యంతోపాటు అనుకున్న స్థాయిలోనూ లేదనడానికి సాక్షాలున్నాయి. 2015 నాటి గణాంకాల ప్రకారం అమెరికాలో సేంద్రీయ వ్యవసాయం 37% చేరుకోగా జర్మనీ 12% అందుకుంది. మనదేశంలో సేంద్రియ సాగు కనీసం 1%కూడా లేకుండా 0.20% వద్దే ఉంది. దేశంలోని ప్రధాన నగరాలకే సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉండడం మనం చూస్తున్నదే. అయితే సేంద్రియ సాగు ద్వారా వచ్చిన తిండి దినుసుల ధర ఎక్కువగా ఉండడం కూడా మన దేశంలో వీటి విస్తరణకు ప్రతిబంధకంగా భావించవచ్చు. రసాయనాల వాడకం ద్వారా పండిన ఆహార పదార్థాలకన్నా సేంద్రీయ విధానాల ఉత్పత్తుల ధరలు రెండు, మూడంతలు ఎక్కువగా ఉంటున్నాయి. నిజానికి సేంద్రీయ సాగులో పెట్టుబడి తగ్గినా దిగుబడి తక్కువగా ఉండడంవల్ల ధరలు ఈ విధంగా ఉండవచ్చు. మామూలు బియ్యం కిలోకి 4050 రూపాయలుండగా సేంద్రీయ సాగు బియ్యానికి కిలోకి రూ.75100 ధర పలుకుతోంది. మామూ లు గోధుమలు కిలోకి2530రూపాయలుండగా, సేంద్రియ గోధుమలకు 80120 రూపాయలుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com