Home > Politics > బాబులో నయా జోష్….

బాబులో నయా జోష్….

డిసెంబర్ 8న రాహుల్ బాధ్యతలు
జగన్ కు సపోర్ట్ చేయని జెండా
 
chandrababu naiduముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో సరికొత్త జోష్ కన్పిస్తోంది. నగరంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఎపి అగ్రిటెక్ సమ్మిట్ 2017 ఆశించిన దానికన్నా విజయవంతం కావడంతో చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భంలో వ్యవసాయం దండగ అంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాణం పోసిన చంద్రబాబు, తాజా పరిస్థితుల్లో రైతాంగాన్ని మంచి చేసుకునే యత్నంలో పడ్డారు. అప్పట్లో బిల్ గేట్స్‌తో సమావేశం కావడం, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హైదరాబాద్ రప్పించడంలో తనదైన చతురత చూపిన చంద్రబాబు తాజా పరిణామాల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం కోసం ఏకంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌నే రప్పించగలిగారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ (బీఎంజీఎఫ్) తరపున వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసే ప్రక్రియకు ఎంఓయు చేసుకోవడంతో చంద్రబాబు అనుకున్నది సాధించినట్టే. గతంలో ఐటి రంగాన్ని ప్రోత్సహించిన చంద్రబాబు హఠాత్తుగా వ్యవసాయ రంగంపై మమకారం చూపించడం వెనుక మర్మం ఏదైనప్పటికీ, రైతాంగానికి తాను చేరువవుతున్నట్టు సంకేతాలు పంపడంలో విజయం సాధించారు. వ్యవసాయంలో సాంకేతికత సహకారం అందిస్తూ మీతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం, ఇద్దరం కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ సాక్షాత్తు బిల్‌గేట్స్ అంతటి వ్యక్తి ప్రకటించడం గమనార్హం. టీడీపీ తాజాగా అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. నదుల అనుసంధానం పేరిట తలపెట్టిన ప్రాజెక్టులు ఒకటొకటిగా ప్రారంభానికి సిద్ధ అవుతున్నాయి. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా శరవేగంతో పూర్తవుతున్నాయి. ఈ తరుణంలో సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లో వ్యవసాయం లాభసాటి చేస్తే రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన రుణ మాఫీ హామీతో రైతుల ఓట్లను రాబట్టిన చంద్రబాబు భవిష్యత్‌లో రైతు ఓటు బ్యాంకే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు అర్ధం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com