Home > General > దుర్గగుడిలో సెక్యూరిటీ అంతా డొల్లేనా

దుర్గగుడిలో సెక్యూరిటీ అంతా డొల్లేనా

సూపర్‌స్టార్‌ కృష్ణ 'అసాధ్యుడు' చిత్రానికి 50 వసంతాలు
ఆధార్‌కు రెండంచెల భద్రత

durgamma-temple-apduniaదుర్గగుడిలో భద్రత డొల్లతనం బయటపడింది. ఆలయంలో డిసెంబరు 26న అర్ధరాత్రి పూజల వ్యవహారంలో సెక్యూరిటీ సిబ్బంది తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయం ఒక సారి రాత్రి 10.30 గంటలకు మూసివేసిన అనంతరం గర్భగుడి ఆలయం తాళంపై సీజ్‌ వేయడం, మూమెంట్‌ రిజిష్టర్‌లో ఆలయం మూసివేసినట్లు సంబంధిత బాధ్యులు సంతకాలు చేయడం ఆనవాయితీ. ప్రత్యేక పూజల నేపథ్యంలో అర్ధరాత్రి గర్భగుడి తలుపులు తెరిస్తే ఆయా శాఖల ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించారు. డిసెంబరు 27న రాష్ట్రపతి సతీమణి ఆలయానికి వస్తుందని ప్రత్యేక అలంకరణలు చేయాలని అప్పటి ఇఓ సూర్యకుమారి సిబ్బందిని ఆదేశించినట్లు పలువురు పేర్కొంటున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల సమయంలో ఆలయం తిరిగి తలుపులు తెరిచే సమయంలో ఎందుకు మూమెంట్‌ రిజిష్టర్‌లో నమోదు చేయలేదనే విషయంపై పలు అనుమానాలున్నాయి. తాంత్రిక పూజలా లేక ప్రత్యేక పూజలా అనే విషయం పక్కన పెడితే ఆలయ ప్రధానార్చకునితో పాటు బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు గర్భగుడిలోకి వెళుతుంటే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు అడ్డుకోలేదనే వాదన వినబడుతుంది. ప్రధానార్చకునితో పాటు గర్భగుడిలోకి వెళ్లడం వల్లే మిగిలిన వారిని ప్రశ్నించడం కానీ, ఐడి కార్డులను పరిశీలించడం గానీ చేయలేదని సెక్యూరిటీ సిబ్బంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అసాంఘిక శక్తులు ప్రధానర్చకుడిని భయభ్రాంతులకు గురి చేసి ఇదే తరహాలో గర్భగుడిలోకి ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది రూపాయల విలువ జేసే బంగారు అభరణాలు అమ్మవారికి అలంకరిస్తారు. సెక్యూరిటీ నిర్లక్ష్యం మత్తులో అసాంఘిక శక్తులు ఏదైనా అరాచకానికి పాల్పడినా అడ్డుకునే నాథుడే లేడని స్పష్టంగా అర్థమవుతోంది. మద్యం, మాంసం లోనికి తీసుకువస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పసిగట్టలేక పోయారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఆలయంలో ఎలువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఎపిఎస్‌పిఎఫ్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) సిబ్బంది మూడు షిప్టుల్లో 12 మంది పని చేస్తున్నారు. ఒక్కో షిప్టుకు హెడ్‌ కానిస్టేబుల్‌ నేతృత్వంలో మరో ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మూడు షిప్టుల్లో కలిసి తొమ్మిది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్‌ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి తోడు అదనంగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ అందుబాటులో ఉన్నా అర్ధరాత్రి ప్రత్యేక పూజలు జరిగాయని నిరూపణ కావడంతో భద్రతా చర్యలు తీసుకుంటున్న ఏపి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పిఎఫ్‌) కమాండెంట్‌ కొండా నరసింహారావు శాఖాపరమైన అంతర్గత విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఎస్‌పిఎఫ్‌ డిఎస్‌పిని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com