Home > Bhakti > క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

క్షణకాలం కూడా తీరికలేకుండా కోనేటిరాయుడు

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
22 కిలోల బంగారంతో దుర్గమ్మకు చీర

tirumala-venkanna-apdunia-బ్రహ్మోత్సవాల్లో స్వామి మరీ బిజీ

కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువే భూలోకవైకుంఠం తిరుమలక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. పూర్వం చీమలపుట్టలో దాగి ఎండకు ఎండి, వానకు తడిసిన స్వయంవ్యక్త దివ్యతేజో సాలగ్రామ శిలామూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి నేడు కోట్లాది మంది భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు.ఆ దేవదేవుడికే ఇప్పుడు కొత్త కష్టం ఎదురైంది. యేళ్ల తరబడి ఆ స్వామికి కంటిమీద కనుకు కష్టమైపోయిందంటే ఆశ్చర్యం ఉంది కదూ..!! అవును.. పూర్వం వేళ్ల మీద లెక్క పెట్టే భక్తజనం రావటంతో స్వామి దర్శనం కేవలం పగటిపూట మాత్రమే కలిగేది. తిరుమలకొండ మీద సౌకర్యాలు పెరిగాయి. భక్తులు పెరిగారు. క్యూలు పెరిగాయి. వారి వేచి ఉండే సమయం పెరిగింది. ఆ ప్రభావం సాక్షాత్తు మన స్వామి దర్శనం మీద పడిందనటంలో అతిశయోక్తిలేదు. కష్టాలు తొలగాలని కోర్కెల చిట్టాలతో వచ్చే భక్త జనులకు దివ్యాశీస్సులు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే అన్నట్టుగా స్వామి క్షణకాలం కూడా తీరికలేకుండా అనుగ్రహిస్తున్నారనటంలో ఆవంతైనా అనుమానం లేదు.

నాటి కుగ్రామం నుండి ప్రపంచ స్థాయి క్షేత్రంగా విరాజిల్లుతూ..
∙1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే నాటికి ఈ క్షేత్రం కుగ్రామమే. కనీసం మట్టిరోడ్డు కూడా లేని దట్టమైన అటవీ ప్రాంతం. తిరుమల కొండకు రెండు ఘాట్‌రోడ్ల ఏర్పాటుతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఎలాంటి మౌలిక వసతుల్లేని తిరుమలలో ప్రస్తుతం స్టార్‌ హోటళ్ల స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి. ∙ఒకప్పుడు చేతివేళ్లపై లెక్కపెట్టగలిగేలా ఉన్న సిబ్బంది నేడు వేలసంఖ్యకు పెరిగారు. రోజూ వందల సంఖ్యలోపే వచ్చే భక్తులు నేడు 70 వేలు దాటారు. అప్పట్లో వేలల్లో లభించే ఆలయ హుండీ కానుకలు కూడా ఆ మేరకు పెరిగి రూ.2.5 నుండి రూ.3 కోట్లకు చేరుకున్నాయి. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆస్తిపాస్తులు నేడు లక్షన్నర కోట్లరూపాయలకు పైబడ్డాయి. పగలు మాత్రమే దర్శనమిచ్చిన స్వామికి నేడు అర్ధరాత్రి దాటినా కూడా కునుకు దొరకని విధంగా భక్తులు పెరిగిపోయారు.∙నాడు దట్టమైన అరణ్యంలో దాగిన తిరువేంగడమే నేడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం. పూర్వం తిరుమలకొండకు ‘తిరువేంగడం’ అని, శ్రీవేంకటేశ్వర స్వామిని ‘తిరువేంగడ ముడయాన్‌’ అనీ కీర్తించేవారు. తిరుమల క్షేత్రానికి పల్లవులు, చోళులు, పాండ్యులు, కాడవ రాయరులు, తెలుగుచోళులు, తెలుగు పల్లవులు, విజయనగర రాజులు విశిష్ట సేవ చేశారు. ఆలయ కుడ్యాలపై ఉన్న శాసనాలే ఇందుకు ఆధారం. ఆ తర్వాత బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీ తెల్లదొరలు, ఆర్కాటు నవాబులు, మహంతులు, అధికారులు తిరుమలేశుని కొలువులో సేవించి తరిస్తూ ఆయా కాలాల్లో ఆలయ పరిపాలనలో భక్తులకు తమవంతుగా సేవలు, సౌకర్యాలు కల్పించారు. ∙ఇక ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, అన్నమాచార్యులు, పురందరదాసు, తరిగొండ వెంగమాంబ వంటి వారెందరో ఈక్షేత్ర మహిమను వేనోళ్ల కొనియాడారు. తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని దశదిశలా చాటారు.రెండొందల ఏళ్లకుపైగా దేశాన్ని పరిపాలించిన తెల్లదొరలు కూడా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులేనని చెప్పొచ్చు. దేవస్థానం పాలన కోసం వేసిన పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయనటానికి టీటీడీ వద్ద లభించే రికార్డులే ఆధారం. ∙1843 నుండి 1933 వరకు మహంతుల పాలన జరిగింది. ఆలయ పరిపాలన కోసం అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆలయ కమిషనర్‌తోపాటు ధర్మకర్తల మండలి కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టింది. ∙చివరి మహంతు ప్రయాగ్‌దాస్‌ దేవస్థాన కమిటీకి తొలి అధ్యక్షులుగా 1933 నుంచి 1936 వరకు సేవ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 52 మంది అ«ధ్యక్షులు, స్పెసిఫైడ్‌ అథారిటీ ప్రత్యేక పాలనాధికారులుగా పనిచేశారు.∙ధర్మకర్తల మండళ్లలోని చైర్మన్, ఈవోలు ఎవరికి వారు ఆయా కాలాల్లో అవసరాను గుణంగా భక్తులకు బస కోసం సత్రాలు, కాటేజీలు నిర్మించారు. ప్రయాణ సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు.1933లో టీటీడీ ఏర్పడిన తర్వాత కూడా తిరుమలకు నడిచేందుకు సరిగ్గా కాలిబాట మార్గాలు లేవు. తిరుమల మీద కూడా అలాంటి పరిస్థితులే కనిపించేవి. చుట్టూ కొండలు, బండరాళ్లే కనిపించాయి.∙కొండకు వచ్చే భక్తులు ఆలయం ఎదురుగా ఉండే వేయికాళ్ల మండపం, ఆలయ నాలుగు మాడ వీధుల్లోని మండపాలు, స్థానిక నివాసాల్లో తలదాచుకునేవారు. అప్పట్లో ఎలాంటి క్యూలు ఉండేవికావు. మహాద్వారం నుండే గర్భాలయం వరకు వెళ్లేవారు. స్వామిని కళ్లార్పకుండా తనివితీరా దర్శించుకునేవారు. అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తీవ్రమైన మంచు, చలి ఉండేవి. అందుకే సూర్యుడు కనిపించే సమయంలోనే ఆలయాన్ని తెరిచి ఉంచేవారు.మద్రాసు ఉమ్మడి రాష్ట్ర బ్రిటిష్‌ గవర్నర్‌ సర్‌ ఆర్థ్థర్‌ హూప్‌ నేతృత్వంలో ప్రముఖ భారతీయ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘాట్‌రోడ్‌కు రూపకల్పన చేశారు.∙1944 ఏప్రిల్‌ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైంది. తొలుత ఎడ్లబండ్లు, తర్వాత నల్లరంగు బుడ్డ బస్సులు (చిన్న బస్సులు) ఈ మొదటి ఘాట్‌రోడ్డులోనే తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు సాగించాయి. దీంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ∙1951 నవంబర్‌ నెల మొత్తానికి కలిపి శ్రీవారి దర్శనానికి దేవస్థానం బస్సులు, ప్రైవేట్‌ వాహనాల ద్వారా తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య 27,938 మంది, 1953, ఏప్రిల్‌లో 52,014 మంది మాత్రమే. ∙1961, నవంబర్‌ మొత్తంగా తిరుమల ఘాట్‌రోడ్డులో 1,986 కార్లు, బస్సులు, 81 మోటారు సైకిళ్లు తిరిగాయి.∙తర్వాత 1974లో అందుబాటులోకి వచ్చిన రెండో ఘాట్‌రోడ్డుతో తిరుమల, తిరుపతి మధ్య రాకపోకలు వేరుపడ్డాయి. ప్రయాణ సమయం తగ్గింది. నునుపైన తారు, సిమెంట్‌ రోడ్లు అందుబాటులోకి రావటం, వాటిపై వాహనాలు రివ్వున తిరగటంతో తిరుమలేశుని దర్శించే భక్తుల రాక క్రమంగా పెరుగుతూ వచ్చింది.∙రెండో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి రావటంతో రోజుకు పదివేల మంది భక్తులు పెరిగారు. టీటీ డీ రవాణా సంస్థ వాహనాల బదులు 10.8.1975 నుండి రెండు ఘాట్‌రోడ్లపై ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరగటంతో ఆమేరకు భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 500 ఆర్టీసీ బస్సులు, రోజుకు 3,200 ట్రిప్పులు సాగిస్తూ.. బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.1933 నుంచి 1970కి ముందు వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు.∙మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 5 వేలు, 1974లో పూర్తిస్థాయిలో రెండవ ఘాట్‌రోడ్డు వచ్చేనాటికి ఈ సంఖ్య రోజుకు సుమారు 10 వేలకు పెరిగింది. తిరుమలలో పాతపుష్కరిణి కాంప్లెక్స్‌ నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం జరిగింది. దీంతో 1990 నాటికి రోజుకు 20 నుంచి 25 వేలు, 1995కు 30 వేలు, 2000 నాటికి రోజుకు 35 నుంచి 40 వేలకు పెరిగింది.∙2003 నాటికి రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మించారు. క్యూలైన్లు పెరిగాయి. భక్తుల నిరీక్షణ సమయం రెండు రోజులకు పెరిగింది. 2010 నాటికి రోజువారీ భక్తుల సంఖ్య 60 వేలకు చేరింది.ఇలా 2010 సంవత్సరంలో మొత్తం 2.14 కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 2011లో 2.43 కోట్లు, 2012లో 2.73 కోట్లు, 2013లో ఈ సంఖ్య 1.96 కోట్లు , 2014లో 2.26 కోట్లు, 2015లో 2.46 కోట్లు, 2016లో 2.66 కోట్లమంది భక్తులు వచ్చారు.ఇక ఈ యేడాది 8 నెలలకే సుమారు 2 కోట్లు చేరగా, ఈ సంఖ్య ఏడాదికి 3 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.∙స్వామి దర్శనానికి రోజువారిగా పోటెత్తే భక్తులకు ఈ రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మొత్తం 64 కంపార్ట్‌మెంట్లు చాలటం లేదు. శుక్ర, శని, ఆదివారాల్లో కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లలో భక్తులు నిరీక్షించటం రివాజుగా మారింది. ∙పెరుగుతున్న రద్దీ వల్ల భక్తులు రోజుల తరబడి తిరుమలలో నిరీక్షించకుండా 2000 సంవత్సరంలో దర్శనానికి సుదర్శనం కంకణ విధానం, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌పద్ధతిని రూపకల్పన చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఈ–దర్శన్‌ కౌంటర్ల ద్వారా దర్శనం టికెట్లు, ఆర్జితసేవా టికెట్ల కేటాయింపును చేపట్టారు. 2009వ సంవత్సరం నుండి ప్రవాస భారతీయులకు, ఏడాదిలోపు వయసున్న చంటిబిడ్డతోపాటు వారి తల్లిదండ్రులకు ‘సుపథం’ ద్వారా అనుమతిస్తున్నారు.2010వ సంవత్సరంలో అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో నడచి వచ్చే భక్తులకు దివ్య దర్శనం ఆరంభించారు.∙అదే ఏడాదే ఎటువంటి సిఫారసు లేకుండానే భక్తులు నేరుగా టికెట్లు కొనుగోలు చేసేవిధంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆరంభించారు. ప్రస్తుతం ఆలైన్‌ టైంస్లాట్‌లో మాత్రమే టికెట్ల అమ్మకం చేస్తున్నారు. ∙ఆలయ మహద్వారం నుండి (పస్తుతం దక్షిణ మాడవీధి నుంచి) వికలాంగులు, 65 ఏళ్ల వయసు నిండిన వృద్ధులు, స్వాతంత్య్ర సమరయోధులను అనుమతించారు.∙ఇక సిఫారసులతో రూ.500 టికెట్ల వీఐపీ దర్శనాలు, అన్ని రకాల ఆర్జితసేవా టికెట్లతో ప్రత్యేక దర్శనాలు.. ఇలా అన్ని కేటగిరీల్లోని భక్తులకు ఏదో రూపంలో సుమారు పది రకాలకు పైగా దర్శనాలను టీటీడీ కల్పిస్తోంది.
∙మహంతుల కాలం (1843 నుంచి 1933)లో తిరుమల ఆలయంలో గర్భాలయ దివ్యమంగళ మూర్తికి గంటల తరబడి విశ్రాంతి ఉండేది. నిత్య ఏకాంత కైంకర్యాలన్నీ నిర్ణీత వేళల్లో సంపూర్ణంగా జరిగేవి∙2000వ సంవత్సరం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయి పట్టుమని పదినిమిషాలు కూడా స్వామికి విశ్రాంతి లభించటం లేదు. ∙ఇక తప్పని పరిస్థితుల్లో లాంఛనంగా తలుపులు వేసి మమ అనిపిస్తున్నారు. ఆగమం ప్రకారం ఆరు గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలివైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిష్టంగా 6 గంటలపాటు విరామం ఉండాలి. అదే స్థాయిలోనే స్వామికి ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి ఏకాంత కైంకర్యాలు ఉండాలని పండితులు చెబుతున్నారు.∙ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 20 గంటలపాటు వివిధ రకాల పేర్లతో టికెట్లు కేటాయించి దర్శనం అమలు చేస్తున్నారు. ఇక నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ పేరుతో పట్టుమని పది నిమిషాలు కూడా స్వామికి విరామం ఇవ్వటం లేదు. ఏకదాటిగా 22 గంటలపాటు స్వామి దర్శనం సాగించే పరిస్థితులు పెరిగాయి. అర్ధరాత్రి దాటాక ఏకాంత సేవ, ఆ వెంటనే సుప్రభాతం నిర్వహిస్తూ స్వామి కైంకర్యాలు నిర్వహించే పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. ∙దీనికి టీటీడీ అధికారులు చెబుతున్న ప్రధాన కారణం ఒక్కటే. భక్తుల రద్దీ…రద్దీ.. ∙భక్తుల రద్దీకి తగ్గట్టు స్వామి దర్శనం కల్పించవలసిన బాధ్యత ఎంత మేరకు ఉందో, పూర్వం నుండి ఆగమోక్తంగా అమలు చేసే స్వామి కైంకర్యాల్లో కోత విధించటం, స్వామికి విరామం లేకుండా చేయటం సమాజ శ్రేయస్కరం కాదని ఆగమ పండితుల హెచ్చరికల్ని కూడా దేవస్థానం అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *