Home > General > ఇది విరాట్ శకం…

ఇది విరాట్ శకం…

వచ్చే జనవరికి కులికుతుబ్ షాహి టూంబ్స్ పునరుద్దరణ పూర్తి
ప్లాస్టిక్ పై జీఎస్టీ తగ్గించాలి

virat-kohli-apduniaటీమిండియాలో మరో శకం మొదలైంది. గతంలో పటౌడీ శకం., కపిల్ శకం, సచిన్ శకం, గంగూలీ శకం., ధోనీ శకం.. ఇలా లెజెండరీ ఆటగాళ్లతో టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. ఇప్పుడు భారత క్రికెట్ లో విరాట పర్వం నడుస్తోంది. టెస్టులతో పాటు వన్డేలు, టీ20ల్లో విరాట్ కొహ్లీ అందిస్తున్న విజయాలతో భారత క్రికెట్ దూసుకుపోతోంది. తాజాగా శ్రీలంక టూర్ లో భారత్ సాధించిన క్లీన్ స్వీప్ విజయాలు విరాట్ కెరీర్ లోనే కాదు భారత క్రికెట్ లోనే మైలురాళ్లుగా నిలిచిపోనున్నాయి.

కెప్టెన్ గా, ఆటగాడిగా విరాట్ దూకుడు సాటి క్రికెటర్లకు స్పూర్తిగా నిలుస్తోంది. 2008లో శ్రీలంక గడ్డపైనే అరంగేట్రం చేసిన విరాట్.. 9 ఏళ్ల తర్వాత అదే జట్టుపై కెప్టెన్ గా, బ్యాట్స్ మన్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. టెస్టు సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడం మామూలు విషయం కాదు. అందులోనూ మూడు భారీ విజయాలే. ఇక వన్డే సిరీస్ లో కూడా భారత్.. లంక దుమ్ము దులిపింది. 2వ వన్డే మినహాయిస్తే మిగిలిన నాలుగు మ్యాచుల్లోనూ వన్ సైడెడ్ విక్టరీలు సాధించింది. ఇక టీ20 గురించి చెప్పనక్కర్లేదు. లంక సవాల్ విసిరే లక్ష్యాన్ని ఇచ్చినా.. కొహ్లీ చలవతో భారత్ ఆడుతూ పాడతూ ఛేజ్ చేసింది.

అనూహ్య పరస్థితుల్లో ధోనీ నుంచి టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న విరాట్ కొహ్లీ.. తనకు ఎదురైన సవాల్ ను ధీటుగానే ఎదుర్కొన్నాడు. తన కెప్టెన్సీలో 29 టెస్టులాడిన భారత్ 19 టెస్టుల్లో గెలిచింది. కేవలం 3 సార్లు మాత్రమే ఓటమి పాలైంది. 7 టెస్టులు డ్రాగా ముగిశాయి. ధోనీ 60 మ్యాచుల్లో 27 విజయాలు సాధిస్తే.. కొహ్లీ 30 మ్యాచులు దాటకుంటానే 19 విజయాలు సాధించాడు. ఇక ధోనీ వన్డే కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ సారధ్యంలో 35 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 27 సార్లు విజయంసాధించింది. ఇక 5టీ20 లకు సారథ్యం వహించిన కోహ్లీ 3 మ్యాచుల్లో భారత్ ను గెలిపించాడు.
ప్లేయర్ గానూ విరాట్ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. సచిన్ వారసుడిగా ప్రశంసలు అందుకుంటున్న కొహ్లీ.. అప్పడే మాస్టర్ రికార్డులపై కన్నేశాడు. వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా పరుగులు చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్న ఈ ఢిల్లీ డైనమేట్… సచిన్ రికార్డులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నాడు. ఇప్పటివరకు 194 వన్డేలాడిన కోహ్లీ 55.75 సగటుతో 8,547 పరుగులు సాధించాడు. 10వేల రన్స్ కు క్రమంగా చేరువవుతున్న ఈ యంగ్ గన్.. మరో 20 మ్యాచుల్లోనే మ్యాజిక్ ఫిగర్ అందుకోనున్నాడు. అలాగే సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఇప్పటికే అత్యధిక సెంచరీల లిస్ట్ లో సెకండ్ ప్లేస్ కు ఎగబాకాడు. 186 ఇన్నింగ్సుల్లో కోహ్లీ 30 సెంచరీలు చేసి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును తుడిచేశాడు. సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో 49 సెంచరీలు సాధించగా.. మాస్టర్ రికార్డుకు విరాట్ 19 సెంచరీల దూరంలో ఉన్నాడు. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే వన్డేల్లో సచిన్ ఖాతాలో ఉన్న 18,567 పరుగుల రికార్డును కూడా కోహ్లీ తుడిచిపెట్టేయడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా సుదీర్ఘ కెరీర్ ఉన్న విరాట్ ఫిట్ నెస్, ఫామ్ ను కంటిన్యూ చేస్తేనే రికార్డులన్నీ కోహ్లీ సొంతమవుతాయి.

కాసేపు ఆట సంగతి పక్కనపెడితే… గంగూలీ తరహాలో భారత క్రికెట్ ను కొహ్లీ శాసిస్తున్నడని కూడా చెప్పవచ్చు. కోచ్ గా అనిల్ కుంబ్లేను పక్కనపెట్టడంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ.. తనకు నచ్చిన, తాను మెచ్చిన రవిశాస్త్రినే తిరిగి కోచ్ గా ఎంపిక చేయించుకున్నాడు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా.. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన సలహా సంఘాన్ని ఒప్పించగలిగాడు. తాను పట్టుబట్టినట్టే రవిశాస్త్రి కోచింగ్ లో సంచలన విజయాలు సాధిస్తున్నాడు. కోచ్ విషయంలో తన పంతం నెగ్గించుకున్న కోహ్లీ.. కెప్టెన్ గానూ తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఫామ్ లో ఉన్న రహానే స్థానంలో రాహుల్ ను ఆడించడమే ఇందుకు నిదర్శనం. వెస్టిండీస్ టూర్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన రహానేకు శ్రీలంక టూర్లో అవకాశాలివ్వలేదు. తాను మెచ్చిన లోకేష్ రాహుల్ కే విరాట్ ఎక్కువ అవకాశాలిచ్చాడు. సిరీస్ గెలిచిన తర్వాత రహానేకు ఛాన్సిచ్చాడు. తుది జట్టు విషయంలో తాను అనుకున్నదే జరగాలని పట్టుబడుతున్న కోహ్లీ.. ప్రస్తుతానికైతే మంచి ఫలితాలే సాధిస్తున్నాడు. అది కాస్తే వికటిస్తే పరిస్థితి తారుమారయ్యే అవకాశముంది. గతంలో రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మల విషయంలో మాజీ కెప్టెన్ ధోనీ ఇదే రకమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. కుంబ్లేతో వివాదం కూడా తుది జట్టు ఎంపిక దగ్గరే మొదలైంది. సో ఈ విషయంలో కోహ్లీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆటకుదగ్గ ఆవేశం.., గెలుపుకు అవసమైన నైపుణ్యం, ఫామ్ తో దూసుకుపోతున్న విరాట్.. భారత బెస్ట్ కెప్టెన్ గా నిలవాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *