Home > Editorial > రాహుల్ లో కనిపిస్తున్న పరిణితి

రాహుల్ లో కనిపిస్తున్న పరిణితి

ఆధారాల్లేని ఆరోపణలకు చెక్
ఇండియాలో క్యాష్ లెస్ ఎకానమీ సాధ్యమా...
rahul-gandhi-apduniaపెద్ద నోట్ల రద్దు వ్యవహారం నాటి నుంచీ  రాహుల్ లో  మార్పు కనిపిస్తోంది. ఆయన మాటలు, చేతల్లో పరిణతి కనిపిస్తోంది. ఆయనను ఎవరూ గత దశాబ్ద కాలంగా పట్టించుకోలేదు. కొన్ని కీలక అంశాలపై ఆయనకు అవగాహన ఉన్నట్టు అనిపించేది కాదు. జాతీయ సమస్యలపై కూడా అవగాహన లేకుండా, సమన్వయం లేకుండా ఆయన ప్రసంగాలు, ప్రకటనలు చేసేవారు. ఓ సరైన నాయకుడుగా ఆయన తనను తాను నిరూపించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాదు, నాయకత్వ బాధ్యతలను భుజాలకెత్తుకోవ డానికి ఏనాడూ ముందుకు రాలేదు. అటువంటిది, ఆయనలో ఒక్కసారిగా మార్పు వచ్చేసినట్టు కనిపిస్తోంది.పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై ఆయన చేస్తున్న ఆరోపణలు, వాదనలు, విమర్శల్లో పెద్దగా పస లేకపోవచ్చు కానీ, జనం ఆయన మాటలు, వ్యాఖ్యలు, ప్రసంగాలపై దృష్టి పెట్టడం మాత్రం మొదలైంది. మోదీకి కంచుకోటలాంటి గుజరాత్‌లో ఆయన ప్రధానికి సవాళ్లు విసరడం ఆయన దూకుడుకు, ధైర్యానికి అద్దం పడుతోంది. రాహుల్‌ గాంధీ సభలకు ఏనాడూ రానంత భారీ సంఖ్యలో జనం వచ్చారు. దాంతో ఆయన విజృంభించి, మోదీ ప్రతిష్ఠపై దాడి చేశారు. విమర్శ లకు, ఆరోపణలకు అతీతంగా ’మిస్టర్‌ క్లీన్‌’గా మోదీకి ఉన్న ఇమేజ్‌ మీద ఆయన అనూహ్యంగా మాటల తూటాలు సంధించారు.ప్రధాని తన ప్రసంగాలను, విమర్శలను, ఆరోపణలను ఎద్దేవా చేయడాన్ని, వెటకారంగా మాట్లాడడాన్ని ఆయన లెక్క చేయలేదు. ప్రతిపక్షాలు, ప్రత్యర్థుల విమర్శలకు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మోదీ వాటిని ఎద్దేవా చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ముందు సమాధానం చెప్పి ఆ తరువాత ఎద్దేవా చేయాలని కూడా సవాలు చేశారు. రాహుల్‌ అక్కడితో వదిలిపెట్టలేదు. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ’కామన్‌ కాజ్‌’ అనే ఎన్జీవో తరఫున ప్రధానిపై వేసిన పిటిషన్‌లోని ఆరోపణలను కూడా రాహుల్‌ అందిపుచ్చుకున్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 2013లో నరేంద్ర మోదీకి నలభై కోట్ల రూపాయల మేరకు ముడుపులు ముట్టినట్టు, సహారా, బిర్లా డైరీలను ఉటంకిస్తూ ఆయన ప్రచారం ప్రారంభించారు. పైగా మున్ముందు తాను బయటపెట్టే విషయాలు మోదీ జీవితంలో భూకంపం సృష్టించబోతున్నాయంటూ ఆయన హెచ్చరించారు.
 
మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా తాను రంగంలో నిలబడాలని రాహుల్‌ భావిస్తున్నారు. 2006 ప్రాంతంలో మోదీ కూడా ఇలాగే సోనియాను ప్రత్యర్థిగా పరిగణించి రంగంలోకి దిగారు. ఇప్పుడు అదే పాత్రను రాహుల్‌ పోషిస్తున్నారు. నోట్ల రద్దు మీద ప్రజల్లో వెల్లువెత్తే వ్యతిరేకత మీద రాహుల్‌ ఆధారపడుతున్నారు. నోట్ల రద్దును ప్రజలు వ్యతిరేకిస్తేనే మోదీ ప్రజాకర్షణ తగ్గి తన ప్రజాకర్షణ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. దేశంలో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిలబడుతున్నవారంతా తనకు భవిష్యత్తులో మద్దతు ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు.మోదీని విమర్శించడంలో ఆయన సరికొత్త పదజాలాన్ని ఎంచుకుంటున్నారు. ’మోదీ పేదలను ఘోరంగా వంచించారు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ’’ఇంతవరకూ ఎంత మంది నల్లధనస్వాముల్ని జైల్లో పెట్టారు మోదీజీ’’ అని ఆయన ఓ సభలో ప్రశ్నించారు. ’’94 శాతం ఉన్న నల్లధనాన్ని లక్ష్యంగా చేసుకోవాల్సింది పోయి, ఆరు శాతం నిజాయతీపరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు’’ అని కూడా రాహుల్‌ విమర్శించారు. ’’బ్యాంకులు లక్షల కోట్ల రూపాయల్ని సంపన్నులకు రుణాలుగా ఇస్తున్నాయి. అందులో ఒక్క పైసా కూడా తిరిగి రావడం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాంకుల రుణాల గురించి ఆయన మాట్లాడడం ప్రజలకు ఆనందంగానే ఉండొచ్చు కానీ, ఈ రుణాలన్నీ మోదీ అధికారంలోకి రాక ముందే, అంటే తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మంజూరయ్యాయన్న సంగతిని ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఏతావతా ఆయన చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలకు మోదీ తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన చేస్తున్న ఆరోపణలో కొన్ని పాతవే కావచ్చు. మరికొన్ని చర్విత చర్వణాలే కావచ్చు. కానీ, అవి దేశ రాజకీయ రంగంలో చర్చనీయాంశాలయ్యాయి. ఒక అబద్ధాన్ని పది సార్లు వల్లిస్తే అది ప్రజల మనసుల్లో నాటుకు పోతుందనే సంగతిని రాహుల్‌ గాంధీ కూడా బాగా ఒంటబట్టించుకున్నట్టు కనిపిస్తోంది.రాహుల్‌ తండ్రి రాజీవ్‌ గాంధీకి కూడా మొదట్లో ’మిస్టర్‌ క్లీన్‌’ ఇమేజ్‌ ఉండేది. అయితే, వీపీ సింగ్‌ నాయకత్వంలోని రాజీవ్‌ ప్రత్యర్థులు ఈ ఇమేజ్‌ పైపై ముసుగు మాత్రమేనని ప్రజలను నమ్మించగలిగారు. బోఫోర్స్‌ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వారి పేర్లన్నీ తన జేబులో ఉన్నాయంటూ రాజీవ్‌పై వీపీ సింగ్‌ ధ్వజమెత్తారు. ’గల్లీ గల్లీ మే షోర్‌ హై, రాజీవ్‌ గాంధీ చోర్‌ హై’ అనే నినాదాన్ని సృష్టించి ఊరూరా ప్రచారం చేయడంతో రాజీవ్‌పై జనానికి మనసు విరిగిపోయింది. రాహుల్‌ గాంధీ బావ రాబర్ట్‌ వద్రాపై కూడా యూపీఏ హయాంలో ఇలాగే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కాబోతున్నా ఇంత వరకూ వద్రా కేసులో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వద్రా మీద ఒక్క ఆరోపణా రుజువు కానప్పటికీ ఆయన అవినీతిపరుడనే అపఖ్యాతి మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజకీయాల్లో ప్రచారానికి ఉన్నంత విలువ, వాస్తవాలకు ఉండదనడానికి ఇవే నిదర్శనం.రాహుల్‌ గాంధీ ఓ రాజకీయ నాయకుడిగా, ఓ మాటల వీరుడిగా ఎదగడానికి మోదీ ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు పథకం చాలా వరకూ దోహదం చేసింది. దీనివల్ల సాధారణ ప్రజానీకానికి ఎదురవుతున్న కష్టనష్టాలు జనం మోదీ గురించి పునరాలోచన చేయడానికి అవకాశం కల్పించాయి. మున్ముందు ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ర్టాల ఎన్నికలు ఇందుకు ఊతమివ్వవచ్చు. రాహుల్‌ ప్రస్తుతానికి మోదీ స్థాయికి ఎదిగి ఉండకపోవచ్చు. ఇద్దరి మధ్య భారీగా అంతరం కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ భిన్న మార్గాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఏదో ఒక రోజున తను ముందుకు వెళ్లలేకపోతానా అని రాహుల్‌ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇందుకు ఎంతో శ్రమ అవసరమవుతుంది. ఎన్నో రాజకీయ యుక్తులు, వివేకం అవసరమవుతాయి. అంతకు మించి ఎంతో అదృష్టం కూడా తోడు కావాల్సి ఉంటుంది. అంతవరకూ బీజేపీ ఆయన మాటలను జోకులుగానే తీసుకోవచ్చు. కానీ, ఒక విషయంలో మాత్రం అది ఎద్దేవాలు, వెటకారాలను పక్కన పెట్టి అప్రమత్తంగానే ఉండాలి. మహాత్మా గాంధీ అన్నట్లు, ’నిన్ను నీ ప్రత్యర్థులు మొదట నిర్లక్ష్యం చేస్తారు, తరువాత నవ్వుతారు, తరువాత నీతో పోరాడుతారు, చివరికి నువ్వే గెలుస్తావు.’ బీజేపీ నాయకులు ఈ సూక్తిని గుర్తుంచుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *