Home > Health > నందిగామ ఆస్పత్రిలో నర్సులే డాక్టర్లు

నందిగామ ఆస్పత్రిలో నర్సులే డాక్టర్లు

వైద్యశాస్త్రంలోనే అద్భుతం...తలలు మార్చేసిన వైద్యుడు!
డేంజర్ డెంగీ
 
nandigama hospital ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇన్‌చార్జి డాక్టర్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉన్న ఇన్‌చార్జి డాక్టర్ కూడా విధులకు సక్రమంగా హాజరు కాకపోవడంతో ఆసుపత్రి నర్సులే వైద్యులుగా అవతారం ఎత్తి రోగులకు చికిత్సలు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో షాద్‌నగర్ లేదా కొత్తూరు ప్రభుత్వ వైద్యశాలలకు రోగులకు తరలిస్తున్నారు. నందిగామ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు హెడ్ నర్సులు, 10మంది ఎఎన్‌ఎంలు, 26మంది ఆశా వర్కర్లు, ఒక్క ఫార్మాసిస్ట్, ఓ ల్యాబ్ టెక్నీషియన్, ఒక నైట్ అటెండర్ ఉండాలి. అయితే, ఆసుపత్రి ఏర్పాటుచేసినప్పటి నుంచి ఒక డాక్టర్ పోస్టు ఖాళీగా ఉండగా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే మరో డాక్టర్ మూడు నెలల క్రితం పిజి చదువు కోసం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లారు. ఐదుగురు హెడ్ నర్సులకు గాను ఇద్దరు ఉండగా.. 10మంది ఏఎన్‌ఎంలకు నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆశా వర్కర్లు 26 మందికి 15 మంది మాత్రమే ఉన్నారు. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నైట్ వాచ్‌మెన్, అటెండర్‌లు అసలే లేరు. దాంతో ప్రతి నిత్యం వైద్యం కోసం వచ్చే రోగులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. నందిగామ మండల కేంద్రం పాత జాతీయ రహదారి పక్కన, బైపాస్ రహదారికి కూతపెట్టు దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. డాక్టర్లు లేని కారణంగా ఇక్కడ నర్సులే వైద్యులుగా అవతారం ఎత్తి రోగులకు చికిత్సలు కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ విజయలక్ష్మిని నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జిగా వారం రోజుల క్రితం నియమించారు. దాంతో డాక్టర్ విజయలక్ష్మి అత్యవసర సమయంలోనే నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారే తప్పా మిగతా సమయాల్లో రావడం లేదు. డాక్టర్ లేని సమయంలో నర్సులే వైద్యుల అవతారం ఎత్తి ఆసుపత్రికి వచ్చే రోగులకు చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేని కారణంగా వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సమయాల్లో అత్యవసర కేసులను కూడా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని రోగులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని నందిగామ గ్రామానికి చెందిన యువసత్తా యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. వైద్యులు లేకపోవడంతో రోగం వస్తే కొత్తూరు లేదా షాద్‌నగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లినా డాక్టర్లు కనిపించరని, కేవలం నర్సులు మాత్రమే ఉంటారని వివరించారు. నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని ఇన్‌చార్జి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. నందిగామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై చదువుల కోసం సెలవుపై వెళ్లగా ఇన్‌చార్జిగా తనకు బాధ్యతలు ఇచ్చారని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. షాద్‌నగర్, నందిగామ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు అందిస్తున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com