Home > Editorial > పెద్ద నోట్ల రద్దుకు ఏడాది

పెద్ద నోట్ల రద్దుకు ఏడాది

రాహూల్ రాటుదేలుతున్నారు....
మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే

currency-demonetaisation-apdunia2016 నవంబర్ 8 చరిత్రలో నిలిచిపోయే రోజు ఆర్థిక వ్యవస్థలో 85 శాతంగా ఉన్న రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్ల చెల్లుబాటును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రద్దు చేసిన రోజు అది. సంవత్సర కాలం గడిచినా ఆ చర్య ఇప్పటికీ వివాదాంశంగా కొనసాగుతుండటమే దాని విశిష్టత. ఆ అసా ధారణ చర్య ప్రకటిత లక్షాలను నెరవేర్చిందా, ఆర్థిక వ్యవస్థకు మేలు చేసిందా లేక కీడు చేసిందా అనేది ఇప్పటికీ చర్చనీయాంశమే. వచ్చే బుధవారం దేశం ఒక విచిత్ర దృశ్యాన్ని చూడనుంది. పెద్దనోట్ల చలామణీ రద్దు అంశంపై ప్రతిపక్ష పార్టీల ప్రతికూల, పాలక బిజెపి సానుకూల ప్రచా రాందోళన. ఏదైనా ప్రభుత్వ చర్యను ప్రజావ్యతిరేకమైందిగా భావించినప్పుడు దాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేయటం ప్రజాస్వామ్యంలో రివాజు. కాని అట్టి ఆందోళనోద్యమానికి ప్రతిగా పాలక పార్టీ ప్రచార సభలు నిర్వహిం చటం బిజెపి సంఘర్షణా పూరిత లక్షణానికి నిదర్శనమనవచ్చు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చి సమస్యను పక్కదారి పట్టించేందుకు పాలక పార్టీ ప్రయత్నిస్తోందన్నది స్పష్టం. నవంబర్ 8ని డీమానిటైజేషన్ వ్యతిరేక దినంగా పాటిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాక,ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బిజెపి పోటీ కార్యక్రమం ప్రకటించారు.2016 నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్దనోట్ల చలామణీ రద్దును ప్రకటిస్తూ, అది నల్లధనంపై, నకిలీ కరెన్సీపై, టెర్రరిజానికి నిధులపై నేరుగా దాడి అని ప్రకటించటం గుర్తు చేసుకోదగింది. ఈ చర్యలను ‘సర్జికల్ దాడి’గా వ్యాఖ్యానించిన మోడీ మద్దతుదారులు సైతం ప్రకటిత లక్షాల్లో ఏదీ నెరవేరకపోగా సామాన్య ప్రజలు, మధ్యతరగతులు, వ్యాపారులు, చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు నెలల తరబడి అష్టకష్టాలు పడ్డారని, జిడిపి వృద్ధి రేటు తిరోగమించిందని ఇప్పుడు అంగీకరించక తప్పని స్థితిలో ఉన్నారు. డీమానిటైజేషన్ దుష్ప్రభావం, సమగ్రమైన సన్నద్ధత లేకుండా జిఎస్‌టి అమలులోకి తెచ్చిన తదుపరి కొనసాగుతున్న అస్తవ్యస్థత ఈ రోజుకూ ఆర్థిక జీవనాన్ని కార్యకలాపాలను కృంగదీస్తున్నది. ధరలు పెరిగిపోయి ప్రజలు నలిగిపోతున్నారు. అనుభ వాలనుబట్టి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తన తొందరపాటును సమర్థించుకుంటోంది. అర్ధరాత్రి స్వాతంత్య్ర సముపార్జనను గుర్తుచేస్తూ, పరోక్ష పన్నుల సంస్కరణ అయిన జిఎస్‌టిని ఆర్థిక స్వాతంత్య్రంగా భ్రమ కల్పించేందుకు పార్లమెంట్ సెంట్రల్ అర్ధరాత్రి రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయటం గుర్తు చేసుకోదగింది. డీమానిటైజేషన్ ప్రకటించాక, అప్పటికి చలామణీలో ఉన్న రూ. 15.44 లక్షల కోట్ల కరెన్సీలో రూ. 12 లక్షల కోట్ల దాకా బ్యాంకులకు తిరిగి వస్తుందని, మిగతాది నల్లడబ్బు అయినందున బ్యాంకులకురాదని ప్రభుత్వం ఆదిలో అంచనా వేసింది. అయితే 2017 ఆగస్టు 30న రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం రూ. 15.28 లక్షల కోట్లు లేదా 99 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చింది. రూ. 16,050 కోట్లు మాత్రమే తిరిగి రాలేదు. సహేతుకమైన కారణాలతో గడువులోగా పాతనోట్లను జమ చేయలేకపోయిన తమకు మరో అవకాశం ఇవ్వాలని కొందరు దాఖలు చేసిన పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్నాయి. రిజర్వు బ్యాంకు లెక్కిస్తున్న నోట్లలో నకిలీ ఎన్ని ఉన్నాయో వెల్లడించలేదు. టెర్రరిస్టులకు నిధులు అలభ్యం చేయటం బూటకంగా తేలిపోయింది. కొత్త రూ. 2000 నోట్లు విడుదల సమయానికే టెర్రరిస్టులు, ఇతర క్రిమినల్స్ వద్దకు అవి పుష్కలంగా చేరాయన్న ఆరోపణలున్నాయి. డీమానిటైజేషన్, ప్రకటిత లక్ష్యాల్లో దేన్నీ సాధించకపోగా నల్లధనం ఉన్నవారు నిధులు మూలుగుతున్న రాజకీయ పార్టీలు, నాయకులు సహా నలుపును తెలుపు చేసుకునేందుకు తోడ్పడింది. దీనికితోడు బ్యాంకుల నిరర్థక ఆస్తులు మోడీ ప్రభుత్వ మూడున్నర సంవత్సరాల పాలనలో మూడు రెట్లు పెరిగారు. అందువల్ల డీమానిటైజేషన్, జిఎస్‌టి వంటి తొందరపాటు చర్యలు ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు చేసిన చేటును, మోడీ ప్రభుత్వ విఫల విధానాలను ప్రజలకు వివరించే నైతిక హక్కు ప్రతిపక్షాలకే ఉంది. నవంబర్ 8న ప్రతిపక్ష పార్టీలు ఒక జట్టుగా, ఆరు వామపక్ష పార్టీలు మరో జట్టుగా, డీమానిటైజేషన్ వ్యతిరేక దినం పాటించనున్నాయి. నల్లధనంపై పోరాటంలో పెద్ద విజయంగా బిజెపి ప్రచారం చేయనుంది. ప్రజలే మంచి చెడుల నిర్ణేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com