Home > Editorial > జనంలోకి జనసేన

జనంలోకి జనసేన

ప్రకంపనలు సృష్టిస్తున్న భూకుంభకోణాలు
అక్కడో మాట....ఇక్కోడో మాట...

janasena-apduniaఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్‌లో జనసేన నిర్వహించిన ఔత్సాహికుల ఎంపిక శిబిరాలను విజయవంతం చేసిన వారందరికీ జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన తలపెట్టిన ఈ యజ్ఞంపై చూపిన ఆదరాభిమానాలు తనలో మరింత శక్తిని నింపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన పాత తొమ్మిది జిల్లాల పరిధిలోని ఔత్సాహికులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు పంపవచ్చన్నారు. కుల, మత, ప్రాంతాలకు, లింగభేదాలకు అతీతంగా జరుగుతున్న ఎంపికల్లో ఎవరయినా పాల్గొనవచ్చన్నారు. కావలసినదల్లా రాజకీయాల ద్వారా దేశానికి, తెలుగు రాష్ట్రాలకు, వారి వారి ప్రాంతాలకు సేవ చేయాలన్న బలమైన కాంక్ష అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలోని జనసేన కార్యకర్తల కోరిక మేరకు ఆ జిల్లాలో గడువు కూడా మరికొంత కాలం పొడిగించామని, ఈ జిల్లాల నుంచి ఇంతకుముందు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా ఇప్పుడు చెయ్యవచ్చని పవన్ వివరించారు. సమాచారాన్ని తెలుసుకోడానికి జనసేన ఫేస్‌బుక్‌లో చూడవచ్చన్నారు. జనసేన పార్టీ జిల్లా వ్యాప్తంగా నిర్వాహకుల ఎంపిక కోసం వినూత్న రీతిలో టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తికాగా, మరికొన్ని జిల్లాల్లో కొనసాగుతున్నాయి. అయితే, జనసేన పార్టీలో కార్యకర్తలు తప్ప నేతలు ఉండరన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కార్యకర్తల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్టానం పార్టీ నిర్మాణంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

వినూత్నంగా కార్యకర్తల ఎంపిక
ప్రజా సమస్యలను ప్రశ్నించడమే లక్ష్యంగా చెబుతున్న జనసేనలో నాయకులకు చోటులేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసే వారికి ఎటువంటి హోదాలు ఇవ్వరు. చివరికి పవన్ కల్యాణ్‌కు కూడా. జిల్లాల్లోనూ ఎవరికీ ఎలాంటి పదవులు ఉండవు. అందరూ జన సైనికులుగానే ఉంటారు. ప్రస్తుతం ఎంపిక చేస్తున్న వారిలో చురుకైన వారికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎంపికైన వారితో పవన్ నేరుగా మాట్లాడుతున్నారు. ఇలా ఎన్నికైన వారు ఆయా జిల్లాల పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఆ పార్టీకి సంస్థాగత సెటప్ అన్నది లేదనే చెప్పాలి. పార్టీని ప్రకటించిన నాటి నుంచి మొన్నా మధ్య వరకూ పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో నడిపించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామన్న మాటను స్పష్టంగా చెప్పిన నాటి నుంచి పార్టీ అంశాల్ని ఒక్కొక్కటిగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కోసం పని చేసే వారి కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలని.. పరీక్షలు పెట్టనున్నట్లుగా చెప్పటం తెలిసిందే.జనసేన పార్టీ కోసం పని చేసే వారి కోసం చేస్తున్న ఎంపిక తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమాజం పట్ల అవగాహన.. లోతైన విశ్లేషణ చేయగల సామర్థ్యం ఉన్న వారిని మాత్రమే జనసేన కార్యకర్తలుగా ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. మూడు అంచెల్లో ఎంపిక విధానం సాగుతుందని చెబుతున్నారు. పార్టీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు సేకరించి.. వడపోస్తున్నారు.

సామాజిక స్పృహ.. భావ ప్రకటనలో పట్టు.. రాతలోనూ ఎదుటివారి దృష్టిని ఆకర్షించేలా ఉన్న వారికే అవకాశం లభిస్తుందట.వివిధ అంశాలపై అవగాహనతో పాటు స్థానిక సమస్యలపై ఉన్న పట్టును కూడా పరీక్షించిన తర్వాత మాత్రమే జనసేనలోకి ఎంట్రీ లభించనుంది. ఇందుకోసం మూడు రకాల పరీక్షల్ని పెట్టి.. అందులో ప్రతిభను ప్రదర్శించిన వారికి మాత్రమే జనసేనలో ఎంట్రీ దక్కేలా డిజైన్ చేయటం గమనార్హం.

1.ఎదుటి వారిని ఆకట్టుకునేలా మాట్లాడటం
2. ఏదైనా విషయాన్ని అందరికి అర్థమయ్యేలా రాయటం
3. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చన్న విషయాన్ని చెప్పటంతో పాటు ఆ సమస్యతో వచ్చే ఇతర అంశాల్ని విశ్లేషించే సామర్థ్యం కూడా ఎంపికలో గీటురాయిగా నిలుస్తుందట.ఇలా మూడు రకాల పరీక్షల్లో ప్రతిభ ప్రదర్శించిన వారికి పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. పార్టీలో చేరే వారికి వారి జిల్లాలకు సంబంధించి స్థానిక అంశాలపై ఎంత అవగాహన ఉందన్న విషయంపై దృష్టి సారిస్తున్నారు. నిపుణుల ముందు సమస్యల్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. స్థానిక సమస్యలపై అభ్యర్థులు ప్రసంగించాల్సి ఉంటుంది.

ఇక కంటెంట్ రైటర్స్.. ఎనలిస్టులు మాత్రం ప్రశ్న పత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష అనంతరం ఎంపిక చేసిన కొద్ది మంది అభ్యర్థుల వీడియో ప్రసంగాలు.. రాత పరీక్షల సమాధానాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీకి ఎంపిక చేయనున్నారు. అభ్యర్థుల ప్రసంగాల్ని వీడియోలుగా రికార్డు చేసి.. వారి మాటల్ని నిపుణులు వినటం.. భాష మీద వారికున్న పట్టు.. అంశాల మీద వారికి ఉన్న అవగాహనను విశ్లేషించనున్నారు. సమస్యల మీద మాట్లాడటం తప్పించి.. ఇతర అంశాలపై ప్రాధాన్యత ఇచ్చిన వారికి అవకాశం లభించదని చెబుతున్నారు.పార్టీలో పని చేసేందుకు ఉన్నత విద్యావంతులు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. బీటెక్.. ఎంటెక్.. పీహెచ్ డీ చేసిన వారు సైతం జనసేనలో చేరేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం.. విశాఖ.. శ్రీకాకుళం.. విజయనగరం జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల్లో 6250 మంది హాజరైతే మూడు విభాగాలకు ఒక్కో జిల్లాకు 25 మందిని మాత్రమే ఎంపిక అయ్యారు. మూడు అంచెల్లో నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ప్రదర్శించి.. ఎంపికైన వారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారు. ఇప్పటికే అనంతపురం జిల్లా నుంచి ఎంపికైన వారితో పవన్ భేటీ అయ్యారు. ఇక.. మరో కీలకమైన విషయం.. జనసేన పార్టీలో హోదాలు ఉండవు. పార్టీలోపూర్తిగా కార్యకర్తలే ఉంటారట. తాజాగా ఎంపిక చేసిన వారిలో కొందరిని 2019 ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఈ తరహా ఎంపిక రాజకీయాలకు ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *