Home > World News > అప్ డేట్ కాకపోతే… పింక్ స్లిప్పులే

అప్ డేట్ కాకపోతే… పింక్ స్లిప్పులే

రెయిన్ బో విలేజ్
తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు

pinkslip-it-employyes-apduniaఐటి హబ్‌ల్లో భారీ ప్యాకేజీ పొందుతున్న ఉద్యోగులను ఇంటికి పంపించే పనిలో పడ్డాయి కంపెనీలు. ఎప్పటికప్పుడు ఐటి రంగంలో వచ్చే కొత్త టెక్నాలజీని ఆకళింపు చేసుకుని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేవారికి వచ్చే ముప్పు లేదు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నవారికి మాత్రం సమస్యే. వీరిని నాల్గవ రేటింగ్‌లో పెట్టి ఇంటికి వెళ్లాల్సి వస్తుందని ఐటి కంపెనీలు నోటీసులు ఇస్తున్నాయి. ఐటి సంస్థల్లో అసోసియేట్ మేనేజర్ నుంచి డైరెక్టర్ స్థాయి వరకు కనీస వేతనాలు 12 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఉంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీతోపాటు, బెంగళూరు, నోయిడా, పుణె ఐటి కంపెనీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఐటి కంపెనీల్లో ఆరు స్ధాయిల్లో రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఎంట్రీ లెవల్ ట్రైనీలు, అసోసియేట్, సీనియర్ అసోసియేట్, మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్ పైస్థాయి ఉద్యోగులుంటారు. ఇందులో ఎంట్రీ లెవల్ ఉద్యోగులు 17 శాతం మంది, అసోసియేట్ స్థాయిలో 40 శాతం, సీనియర్ అసోసియేట్ స్థాయిలో 20 శాతం, అసోసియేట్ మేనేజర్ స్థాయిలో 17 శాతం, మేనేజర్ స్థాయిలో ఆరు శాతం, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో 0.5 శాతం, డైరెక్టర్ స్థాయిలో 0.02 శాతం మంది ఉంటారు. ఎంట్రీ లెవల్ ఉండే వారికి 3 లక్షలు, అసోసియేట్ స్థాయిలో ఉండేవారికి 4 నుంచి 9 లక్షలు, సీనియర్ అసోసియేట్లకు 9 లక్షల నుంచి 12 లక్షలు, మేనేజర్ స్థాయిలో ఉండేవారికి 16 లక్షలు, అసిస్టెంట్ డైరెక్టర్ లెవల్‌లో ఉండేవారికి 24 లక్షలు, డైరెక్టర్ హోదాలో ఉండేవారికి 30 లక్షల రూపాయల వరకు వార్షిక వేతనం ఉంటుంది. హైదరాబాద్‌లో దాదాపు 1,386 వరకు చిన్న, మధ్యతరహా ఐటి కంపెనీలు, 116 బహుళ జాతి ఐటి కంపెనీలు ఉన్నాయి. దాదాపు 4.5 లక్షల మంది ఐటి వర్కర్లు ఇందులో పనిచేస్తున్నారు. కానీ అమెరికా హెచ్-1బి వీసా నిబంధనల కఠినతరం మధ్య దేశీయ ఐటి సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, వాటి ప్రభావం దేశీయ ఉద్యోగులపై పడుతోంది. హైదరాబాద్ ఐటి రంగం అలజడికి లోనుకావడం ఇది ప్రథమం కాదని, 2007-2010 మధ్య తీవ్రమైన అనిశ్చితికిలోనై మళ్లీ కళకళలాడిందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) అధ్యక్షుడు ఎం సందీప్ కుమార్ చెబుతున్నారు. నాలెడ్జ్‌ను మెరుగుపరుచుకోవడం, దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీలో శిక్షణ పొంది అప్‌డేట్‌గా ఉండడం ఒక్కటే మార్గమని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో కొన్ని సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు పనితీరు మెరుగుపరుచుకోలేదనే కారణంపై నాల్గవ రేటింగ్ ఇచ్చి 60 రోజుల నుంచి 90 రోజుల పాటు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ ప్లాన్ (పిఐపి)లో కూర్చోబెడుతారన్నారు. 2015 జనవరి నుంచి డిసెంబర్ వరకు పనిచేసిన తీరుపై మదింపు వేసి ఈ ఏడాది మార్చి నెలలో నాల్గవ రేటింగ్ ఇచ్చారన్నారు. వీరి భవిష్యత్తు జూన్, జూలై నెలల్లో తేలుతుందన్నారు. రెండేళ్ల క్రితం వరకు 20 మంది ఐటి వర్కర్లకు ఒక మేనేజర్ ఉండేవారు. ఇప్పుడు ఒక మేనేజర్ ఆధ్వర్యంలో వంద మంది ఐటి ఉద్యోగులు పనిచేసే సంస్కృతిని కొన్ని ఐటి కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. మిగిలిన మేనేజర్లకు పనిలేక, వారి పనితీరు బాగాలేకపోవడంతో పింక్ స్లిప్‌లు ఇవ్వడం, నాల్గవ రేటింగ్ ఇవ్వడం చేస్తున్నాయని ఒక ఐటి సంస్థ ఉద్యోగి చెప్పారు. మిడిల్ లెవల్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను పనితీరు ప్రాతిపదికన పక్కనపెట్టి నైపుణ్యం అభివృద్ధి చేసుకోని పక్షంలో తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఒక సీనియర్ లెవల్ ఉండే ఉద్యోగికి సాలీనా ప్యాకేజీ 20 నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చే బదులు అదే వేతనంతో ఐదు నుంచి పది మంది ఫ్రెషర్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లను సాలీనా 3 నుంచి 5 లక్షల రూపాయల ప్యాకేజీతో నియమించవచ్చనే అభిప్రాయంతో కొన్ని అంతర్జాతీయ ఐటి కంపెనీలు ఉన్నాయని టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *